” ఇది నాకు క్రొత్త శిక్షణ!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 67

వాకాటి వారి హయాంలో అన్ని పనులూ నోటి మాటతో అయిపోయేవి. ఎప్పుడో కానీ కాగితం మీదకు వచ్చేవి కావు.

శ్రీకాంత శర్మ గారు జాయిన్ అయిన మరునాడు ఉదయం పిలిచారు. వెళ్లి కూర్చున్నాను. ఒక రైటింగ్ పాడ్ తీసుకున్నారు. పెన్ సిద్ధంగా పెట్టుకున్నారు. ఆ తరువాత వీక్లీ సిబ్బందిలో ఒక్కొక్కరినీ పిలిచి కూర్చోబెట్టి, వారి సాధక బాధకాలు, వారి సమస్యలు, కోరికలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన ప్రతి అంశం వారి పేరుతో సహా శ్రద్ధగా వ్రాసుకున్నారు. వారి వారికి ఇవ్వవలసిన ” హామీలు” ఇచ్చేశారు.

అప్పుడు మొదలైంది నాకు ఒక క్రొత్త ” శిక్షణ”! మా సంభాషణ ఇలా సాగింది…

” ఆచార్యులు గారూ! మన వాళ్ళకి చాలా సమస్యలు, కోరికలూ ఉన్నాయే?”

” అవును సర్!”

” ఒక విషయం చెబుతా వినండి. తరువాత మీకు ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ కి చాలా కోరికలుంటాయి. అన్నీ తీర్చే అవకాశం ఎవరికీ ఉండదు.”

” మరి ఎందుకు అడిగారు? ఎందుకు నోట్ చేసుకున్నారు సర్?”

” అదే తెలుసుకోవాలి మీరు. వాళ్ళు అడిగినవి మూడు రకాలుగా ఉన్నాయి. కొన్ని మనమే తీర్చేయొచ్చు, కొన్ని తీరటానికి కొంచెం టైమ్ పడుతుంది… మీ అసిస్టెంట్ ఎడిటర్ లాగ…” అంటూంటే మధ్యలో ఆపి, ” దాని సంగతి ఇప్పుడెందుకు సర్! ఆ మాట ముందే చెప్పారుగా?” అన్నాను.

” సరే లెండి, ఉదాహరణకి చెప్పాను అంతే. ఇక ఆఖరివి ఉన్నాయే అవి ఎప్పటికీ తీర్చలేము”

” వాళ్ళని అన్నీ అడిగి వాళ్ళకి ఆశ పెట్టడం ఎందుకు సర్?”

” అదే మేనేజ్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మొదటివి రేపు, ఎల్లుండికి తీర్చేస్తాను. రెండవ రకం మన చేతుల్లో లేదు. పై వాళ్ళకి రాసి, ఫాలో అప్ చేస్తే నెలా, రెండు నెలల్లో తేర్చేయొచ్చు. రేపు, ఎల్లుండికి కొన్ని, ఆ తరువాత కొన్ని తీర్చేస్తే మిగిలినవి పెద్దగా పట్టించుకోరు. శర్మ గారు రాగానే మనకి చాలా చేశారు అనే ఐడియాలో ఉంటారు.”

” మోసం సర్!”

” కానే కాదు. ఇది నేను ఆల్ ఇండియా రేడియోలో అధికారుల దగ్గర నేర్చుకున్న ప్రొసీజర్. మీరూ ఇవాళ కాకపోతే రేపు దీన్ని ఫాలో అవక తప్పదు!”

ఏ క్షణాన ఆయన ఆ మాట అన్నారో కానీ, తరువాతి కాలంలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యవంలో నడిచే “వెలుగు” ప్రాజెక్ట్ లో మీడియా కన్సల్టెంట్ గా ఉన్నప్పుడు ఆ ” సూత్రం” అనుసరించక తప్పలేదు. ప్రభుత్వంలో పని చేసి వచ్చిన వారి దగ్గర పని చేస్తే కలిగే ” లాభా”లలో ఇదీ ఒకటి!

ఒక వారం పది రోజుల తరువాత శర్మ గారి నవల గురించి ప్రస్తావన వచ్చింది.

” చిత్రాంగి మేడ మీకు ఎందుకు నచ్చలేదు?” అని సూటిగా అడిగారు.

” మీకున్న పేరు కాస్తా పోతుంది. ఇంక  నవల నిర్మాణం గురించి మాట్లాడితే మీరు రాసిన మొత్తంలో 60 పేజీలు అనవసరం.”

దెబ్బ తిన్నట్టు చూశారు. ” అంతే అంటారా?” అన్నారు.

” ఒకసారి ఓపికగా అది మీ నవల అనుకోకుండా మళ్ళీ చూడండి” అన్నాను.

మూడు నాలుగు నెలల తరువాత శర్మ గారు నా మాట ఒప్పుకున్నారు.

” పరమ గురు దర్శనం!” రేపు…


Leave a comment