” పరమ గురు దర్శనం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -68

ఒకరోజు మిత్రుడు వివేకానందం హడావిడిగా ఆంధ్రప్రభ ఆఫీస్ కి వచ్చాడు. ” శ్రీమాలీజీ హైదారాబాద్ వస్తున్నారు! ఎల్లుండి సాధనా శిబిరం ఉందిట!ఇవాళ సికింద్రాబాద్ వెడితే అక్కడ బ్యానర్ చూశాను. దాని మీద కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు” అని చెప్పాడు. ఎంత గొప్ప అవకాశం!

“The Power of Tantra” చదివాక ఆయనతో ఇంటర్వ్యూ ప్రచురించిన సంగతి ఇంతకుముందు చెప్పాను! అంతటి సిద్ధుడు మనం ఉన్న ఊరికే వస్తూంటే ఊరికే ఎలా కూర్చోగలం? వివేకానందం ఆ కాంటాక్ట్ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడాడు. శ్రీమాలీజీ కాచిగూడాలో ఒక హోటల్ లో ఉంటారని, అక్కడికి రమ్మని చెప్పారు. మరునాటి ఉదయం ఆ హోటల్ కి వెళ్ళాం. అక్కడ ముందుగా ఫోన్ చేసిన వ్యక్తిని కలిశాం. ఆయనే శ్రీ అనిల్ కుమార్ జోషీజీ! ఆనాటి సాధనా శిబిర నిర్వాహకులు. ఆయన మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారు. మిత్రుడు వివేకానందం ఎలాగూ ఆయనకు తెలిసినవాడే. మా ఇద్దరినీ జోషీజీ పరిచయం చేశారు.

ఆయన మమ్మల్ని పిలిచి కూర్చోమన్నారు. ఆ మహా మంత్ర – తంత్ర – యంత్ర – వివిధ శాస్త్ర సిద్ధుని పాదాల దగ్గర కూర్చున్నాం. ఆయన కుడి చేతిని చాచి బొటన వ్రేలు కనుబొమల నడుమ ఉంచి శ్రీ గురు మంత్రం ఉపదేశించారు మా ఇద్దరికీ! అదొక దివ్య అనుభూతి! అంతటి మహా సిద్ధుని హస్తస్పర్శ చాలదూ జన్మజన్మలకీనూ!

అక్కడి నుంచి సాధనా శిబిరం దగ్గరకు వెళ్లాం. లోపలికి వెళ్ళటానికి దీక్షా సామగ్రి కావాలి. నాలుగు వందల రూపాయలు. మా దగ్గర లేవు. వివేకానందం నాతో ” మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను” అని వెళ్ళాడు. ఒక పావుగంటలో తిరిగి వచ్చి ” ఇద్దరికీ దొరకలేదు. నాలుగు వందలే దొరికాయి. మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను” అని నన్ను లోపలకి పంపించాడు.

శ్రీమాలిజీ ఉపన్యాసం మొదలైంది. చెట్టంత మనిషి, సింహ సదృశమైన వదనం, మల్లె మొగ్గ విచ్చుకుంటున్నట్టు ఆ చిరునవ్వు, గంగా ప్రవాహంలా సాగిపోయే వచో ధార, మధ్య మధ్యలో మెరుపులాంటి విసురు… ఇప్పటికీ ఆ ప్రసంగ గంభీర మాధుర్యం మరచిపోలేని దివ్యానుభవం!

ఆ రోజు దీక్షలలో ఒకటి ” మనో కామనా దీక్ష”! మన మనసులోని కోరికలను తీర్చే దీక్ష! ఒక్కొక్కరుగా వరుసలో వేదిక మీదకు వెళ్ళాలి. వంతు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి. ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ మనసులోని కోరికలను తలచుకోవాలి. ఆయన బొటన వ్రేలితో కనుబొమల నడుమ స్పృశించి పంపిస్తారు. తరువాత ఆయన చెప్పిన మంత్రం జపించాలి. ఇదీ పద్ధతి. ఒక్కొక్కరూ వెడుతున్నారు. ఆ వరుసలో నేనూ ఉన్నాను. మన ముందు వాళ్ళు ఆయన ఎదుట నిలబడే వరకూ మన మనసులో ఎన్నో కోరికలు! పెద్ద చిట్టా! వంతు వచ్చింది. ఆయన ఎదుట నిలబడ్డాను. ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను. అంతే! అప్పటివరకూ కొండవీటి చాంతాడంతగా మనసులో ఉన్న కోరికలన్నీ ఒక్కటి కూడా గుర్తుకు రాకుండా మాయం! ఏ కోరికా లేని ప్రగాఢ శూన్యం! ఆ రోజు మరొక్కసారి ఆ మహా సిద్ధుని హస్త స్పర్శ!

యాదృచ్ఛికంగా ఈ శ్రావణ పూర్ణిమ నాడు, వేదమాత శ్రీ గాయత్రీ దేవి జయంతి శుభవేళ పూజ్య గురుదేవుల సంస్మరణ చేసుకునే ఈ భాగ్యం కూడా శ్రీ గురుదేవుల అనుగ్రహ విశేషమూ, పథ నిర్దేశమూగా భావిస్తూ…

శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!

” సాధనలో మరొక అడుగు!” రేపు…

పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ్ దత్
శ్రీమాలీ జీ ( స్వామీ నిఖిలేశ్వరానంద),
పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీ జీ

Leave a comment