“మంత్ర సాధనలో మరొక అడుగు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 69

పరమ గురువులు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీ జీ సాధనా శిబిరానికి వెళ్లి వచ్చిన తరువాత తరచుగా నేనూ, వివేకానందం పుత్లిబౌలి లోని గురూజీ శ్రీ అనిల్ కుమార్ జోషీ జీ ని కలుస్తూ ఉండేవాళ్ళం. అప్పటి వరకూ ఎవరైనా ఒక మంత్రం చెబితే చేయడమే కానీ శాస్త్ర పరిచయం పెద్దగా లేదు. నన్ను పెంచిన మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు బోధించిన సౌందర్య లహరి, షట్చక్ర నిరూపణ వంటివి తప్ప, మంత్ర – తంత్ర శాస్త్రాల గురించి పెద్దగా చదివినదీ లేదు. కులపతి గారు వ్రాసిన ” తాంత్రిక ప్రపంచం” అనే రచన చదివినా అదేమీ పెద్దగా రుచించినదీ కాదు.

గురూజీ అనిల్ కుమార్ జోషీజీ తో పరిచయం పెరిగిన కొద్దీ ఆ శాస్త్ర విషయాలలో కొంతలో కొంత అవగాహన ఏర్పడింది. కొద్ది రోజులకే ప్రతి రోజూ సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఆయన ఇంటి దగ్గర హాజరు!

అయితే అప్పట్లో ఎప్పుడూ ఆయన దగ్గర నా సమస్యలు ప్రస్తావించ లేదు. కేవలం మంత్ర – తంత్ర శాస్త్ర విజ్ఞాన దాహం మాత్రమే!

అయితే ఒక సందర్భం వచ్చి నెత్తిన పడింది!

ఒకరి వైద్యం కోసం ఒకరి దగ్గర అప్పు తెచ్చాను మూడు నెలల్లో తిరిగి ఇచ్చే మాట మీద. ఆ వైద్యం అవసరం అయిన వ్యక్తికి ఒక ఫ్లాట్ ఉంది. దానిని అప్పటికే అమ్మకానికి పెట్టారు. ఆ డబ్బు వచ్చాక వారు నాకు తిరిగి ఇవ్వాలి. అప్పుడు నేను తెచ్చిన అప్పు తీర్చాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి వైద్యం పొందుతూ మరణించారు. నేను డబ్బు అప్పు తెచ్చి ఇచ్చిన సంగతి ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఆ సొమ్ము ఆ కుటుంబంలో ఇంక ఎవరినీ అడిగే పరిస్థితి లేదు. నేను ఆ అప్పు తీర్చలేక పోయాను. మూడు నెలలూ గడచిపోయాయి. అప్పు ఇచ్చిన వ్యక్తి ” మీరు చెప్పిన టైమ్ కి ఇవ్వలేదు” అన్నారు. పరిస్థితి వివరించాను. ఆయన ” సరే, ఒక పని చేయండి. ఇప్పటిదాకా మిమ్మల్ని వడ్డీ అడగలేదు. ఈ నెల నుంచీ వడ్డీ ఇవ్వండి” అన్నారు. గత్యంతరం ఏముంది? ఒప్పుకున్నాను. కొన్ని నెలల తరువాత ఆ వడ్డీ కూడా కట్టలేక పోయాను. చివరికి ఆ అప్పు ఒక “డెడ్ లైన్” కి వచ్చింది. ఒక తేదీకి ఆ డబ్బు కట్టకపోతే ఇంటి మీదకు మనుషులు వచ్చే పరిస్థితి ఏర్పడింది.  చివరికి అయిదే రోజుల గడువు మిగిలింది.

నాకు ఒక సాహిత్య పిపాసి అయిన మిత్రుడు … నాకన్నా వయసులో పెద్దవాడు… నాతో ఒక మాట అన్నాడు. ” ఈ విషయం జోషీ గారికి చెబితే ఏదైనా మార్గం చూపిస్తారు కదా?”

ఒకరోజు ఉదయం గురూజీ దగ్గరకు వెళ్ళాను. మొట్టమొదటి సారిగా గురూజీ దగ్గరకు ఒక సమస్యతో వెళ్ళాను ఆ రోజు. వివరంగా చెప్పాను. అంతా విని ” ఎల్లుండి రండి” అన్నారు. అంటే గడువులో మరొక రెండు రోజులు అయిపోతాయి. చేసేదేముంది?

ఆయన చెప్పిన రోజు ఉదయం ఇద్దరం వెళ్ళాము. గురూజీ ఒక తాయెత్తు ఇచ్చి ” దీనిని నిప్పుల్లో పూర్తిగా కాల్చేయండి” అన్నారు. ఆ మాట విన్న వెంటనే నేను అడిగిన ప్రశ్న ” దానివల్ల అతనికి ఏ ప్రమాదమూ రాదు కదా?”

గురూజీ నవ్వి ” ఏ ప్రమాదమూ రాదు. గడువు లోపల మీరు ఇవ్వవలసిన అమౌంట్ లో చాలా వరకూ ఇచ్చేస్తారు. మిగిలిన దాని గురించి మీ అంతట మీరే ఇచ్చేవరకు అతను అడగడు” అన్నారు!

ఇంటికి వచ్చి ఆయన చెప్పినట్టు చేసి ఆఫీస్ కి వెళ్ళాను. ఊరుకోలేం కదా? మన ప్రయత్నం మనమూ చేయాలి కదా? టైమ్ ఆఫీస్ లో ఒక మిత్రుడు ఉన్నాడు. అతనితో చెప్పాను నాకు కొంత అమౌంట్ కావాలి అని. అతను ” దీనికి ఇంత కంగారు ఎందుకు? మన మేనేజర్ కి ఒక ఫైనాన్స్ కంపనీ బాగా తెలుసు. దాని అప్లికేషన్స్ కూడా ఆయన దగ్గర ఉంటాయి. వెళ్లి అడుగు” అన్నాడు.

మేనేజర్ దగ్గరకు వెళ్ళి అడిగాను. అప్లికేషన్ తీసి ఇచ్చాడు. ఫిల్ చేసి ఇచ్చాను. మధ్యాహ్నం లంచ్ అవర్ కి వెరిఫికేషన్ అయిపోయింది! మరునాటి మధ్యాహ్నానికి సాంక్షన్ అయిపోయింది. నేను ఇవ్వవలసిన అమౌంట్ లో మూడు వంతులు! వెంటనే డ్రాఫ్ట్ తీసి నేను ఇవ్వవలసిన వ్యక్తికి పంపేశాను.

ఆ రోజు నాలో నేను చాలా మథన పడ్డాను. జీవితంలో మొదటిసారి ఎదురైన ఒక సంక్లిష్ట పరిస్థితిలో నా సాహిత్య విద్య నన్ను కాపాడలేదు! నా ఉద్యోగం నన్ను కాపాడలేదు! నా బంధువర్గం నన్ను కాపాడలేదు! ఒక వ్యక్తి ఒక పావుగంటో, అరగంటో కూర్చుని చేసి ఇచ్చిన ఒక తాయెత్తు నన్ను కాపాడింది!

ఇదీ కావలసినది! జీవితానికి కావలసింది ఇదీ! కాదు… కాదు… ఇదే! ఇది మాత్రమే!

ఇంటికి వచ్చాక నా దగ్గర ఉన్న దాదాపు రెండు వందల పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నాను! జీవితాంతం చదువుకో దగిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అని పరిశీలించుకున్నాను! అన్ని వందల పుస్తకాలలో కేవలం పద్దెనిమిది పుస్తకాలు తేలాయి. మిగిలిన పుస్తకాలు అన్నీ ఒక మిత్రుడికి ఇచ్చేశాను!

అప్పుడు గురూజీ ఇంటికి వెళ్ళాను. ” నాకూ ఏదైనా ఉపదేశం ఇవ్వండి” అని అడిగాను. ఆయన లోపలికి వెళ్లి ఒక చిన్న పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టారు. ” ఈ సాధన వల్ల ఫలితాలు ఇందులో ఉన్నాయి. మీకు ఏ ఫలితం కావాలో బాగా ఆలోచించి చెప్పండి” అన్నారు.

ఇంటికి వచ్చి ఆ పుస్తకం మొత్తం శ్రద్ధగా చదివాను. అనేక ఫలితాలు ఉన్నాయి … ఉద్యోగం, ఆర్థిక ఉన్నతి ,కోర్టు కేసులు… ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి మధ్యలో కనిపించింది… దేవతా సాక్షాత్కారం!

ఆ సమస్యల్లో చాలా నాకూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచీ బయట పడాలి, రాజమండ్రిలో ఆస్తి సంబంధంగా కేసులు ఉన్నాయి. ప్రతీదీ కావలసినదే. అయితే ఇవి నెరవేరటానికి లౌకిక కారణాలూ దోహదం చేయవచ్చు… సాధన వల్లనే అని ఏమిటి గ్యారంటీ? వీటి అన్నిటిలో లౌకిక కారణాలు ఏవీ లేనిది, కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యం అయేదీ ఒకటే! దేవతా సాక్షాత్కారం! అదొక్కటే! అదే కావాలి! అంతే!

మరునాడు గురూజీ దగ్గరకు వెళ్ళి అదే చెప్పాను. ఆయన విధానం అంతా చెప్పారు. పది రోజులలో లక్ష జపం చేయాలి! చేశాను… ఆ పది రోజులల్లో విచిత్ర అనుభవాలు…!

” మొదటి సాధనానుభవాలు!” రేపు…


Leave a comment