స్వీయ అన్వేషణ – 70
“క్షమస్వ గురుదేవా!” నాకు తెలుసు… సాధనలో కలిగే అనుభవాలు కేవలం గురుదేవులకు మాత్రమే చెప్పాలని… నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలు గురుదేవుల కృపా కటాక్షాల వల్ల మాత్రమే సాధ్యం అయాయి కాబట్టి ఇది శ్రీ గురు వైభవ ఆవిష్కరణగా మాత్రమే అందరితో పంచుకుంటున్నాను. ” సర్వాపరాధాన్ క్షమస్వ!”
గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ ఒక మంత్రాన్ని ఉపదేశించి లక్ష జపం పది రోజులలో పూర్తి చేయాలని నిర్దేశించారు.
మా డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఒక గది ఆ సాధనకు కేటాయించుకున్నాను. నేను తప్ప మరెవరూ ఆ గదిలోకి వెళ్లకూడదు అని చెప్పాను. రాత్రి జపం అయాక ఆ గదిలోనే నిద్ర. పగటి పూట ఆఫీస్ కి వెళ్లి వచ్చి, రాత్రి జపం చేసేవాడిని. గది లోపల గడియ పెట్టేసేవాడిని. మరునాడు పొద్దున్నే ఆ గడియ తీయటం. మొదటి నాలుగైదు రోజులు మామూలుగా గడచిపోయాయి. ఆ తరువాత నుంచీ తొమ్మిదవ రోజు వరకూ విచిత్రమైన అనుభవం!
జపం పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించిన కాసేపటికి నిద్రలోకి జారుకున్న తరువాత మొదలయ్యేది.
గది మధ్యలో పడుకునే వాడిని. కాసేపటికి ఒక పెద్దపులి వచ్చేది. నా చుట్టూ తిరుగుతూనే ఉండేది తెల్లవార్లూ. భయంతో చెమటలు పట్టేవి. లేచి గడియ తీసి బయటకు పారిపోదామని అనిపించేది. కానీ కాళ్ళూ చేతులూ కదల్చలేక పోయేవాడిని. నిద్రా కాదు, మెలకువ కాదు, అదొక విచిత్ర స్థితి. రాత్రంతా అలాగే బిగుసుకుపోయి ఉండేవాడిని.
పదవ రోజు రాత్రి… జీవితంలో మరచిపోలేని అనుభవం. జపం చేస్తూ ఉండగా ఒక దృశ్యం … స్వర్ణ కాంతులీనే ఒక అత్యంత అలౌకిక సుందర చరణ కమలం… బంగారు కాలి పట్టీలు, మెట్టెలు! జపం పూర్తి అయేంత వరకూ స్థిరంగా ఆ దృశ్యం!
పది రోజులు పూర్తి అయ్యాయి. మరునాడు ఉదయం గురూజీ చెప్పిన విధానంలో 108 ఆహుతులు అదే మంత్రంతో సమర్పించాను.
ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు గురూజీని కలిశాను. ” హవనం చేసిన చోట ఏదైనా వస్తువు ఉందా?” అని అడిగారు. నేను చూడలేదు. హోమ భస్మం చల్లారలేదు కనుక చూడలేదు. అదే చెప్పాను. “సాయంత్రం చూడండి” అన్నారు.
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి నా భార్య అక్కడ శుభ్రం చేసింది. ” ఎవరు శుభ్రం చేశారు?” అని అడిగితే తానే చేశానని చెప్పింది. ” అక్కడ ఏదైనా దొరికిందా?” అని అడిగాను. అప్పుడు తెచ్చి ఇచ్చింది… పర్పుల్ కలర్ లో హార్ట్ షేప్ లో ఉన్న ఒక చిన్న లాకెట్… దానిపై శ్రీవేంకటేశ్వర స్వామి బొమ్మ!
” మీరు హోమం చేసిన చోట ఉంది. ఎవరిదో తెలియలేదు. ఎవరూ ఇంటికి రాలేదు. ఆ గదిలోకి వెళ్ళలేదు. ఒకవేళ పని మనిషిదేమో అని అడిగాను. కానీ తనది కాదని చెప్పింది. అందుకని షెల్ఫ్ లో వుంచాను మీరు వచ్చాక చెబుదామని. ఈ లోగా మీరే అడిగారు” అని చెప్పింది.
మరునాడు ఉదయం ఆ లాకెట్ తీసుకువెళ్ళి గురూజీకి చూపించాను. దానిని తీసుకుని చూసి ” జాగ్రత్తగా ఉంచండి” అని చెప్పి తిరిగి ఇచ్చారు.
గురూజీ ఒక పుస్తకం చేతిలో ఉంచి, ఏ ప్రయోజనం కావాలో నిర్ణయించుకోమని అన్నారు కదా? నేను కోరుకున్నది దేవీ సాక్షాత్కారం! అదే ఇదా? నా అదృష్టం కేవలం చరణ దర్శనం మాత్రమేనా? అయినా… ఏ దేవతను కోరవలసినది అయినా ” శరణాగతి” యే కదా? అది కూడా ” చరణాల”ను ఆశ్రయించే కదా? ఆ ” చరణ దర్శనం” కన్నా కావలసినది ఏముంది?
ఆ అనుభవాన్ని ప్రసాదించిన శ్రీ గురు చరణ వైభవానికి, కృపా కటాక్ష ప్రసాదానికీ కోటి కోటి నమస్సులు! శ్రీ గురు చరణ కమలేభ్యో నమః! అని నమస్కరించడం కన్నా ఏమి చేయగలను?
” మళ్ళీ ఒకసారి ఆఫీస్ కి వెడదాం!” రేపు
Leave a comment