” మళ్ళీ ఒకసారి ఆఫీస్ కి వెడదాం?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 71

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్ గా వచ్చిన తరువాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం… ఆంధ్రప్రభ వీక్లీ పాఠకులలో అత్యధికుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ” కెమేరా” సీరియల్ ను ఆపివేయటం! అయితే ఎలా ఆపేయాలి? ఏదో కారణం చూపించాలిగా? నిజానికి ఇది “ఫేస్ సేవింగ్” ప్రయత్నం!

ఇంకా రెండు వారాల సీరియల్ స్క్రిప్ట్ కంపోజ్ అయి ఉంది. చంద్ర వేసిన బొమ్మలూ ఉన్నాయి. ఏం చేయాలి?

అప్పుడు శర్మ గారూ, నేనూ ఈ సీరియల్ నుంచి బయట పడటానికి ఒక ఆలోచన చేశాం… “ఈ సీరియల్ ముగింపు పాఠకుల నుంచే ఆహ్వానిద్దాం. సరైన లేదా సమంజసం అయిన ముగింపునకు బహుమతి ఇద్దాం. పాఠకుల నుంచి ముగింపు అందటానికి ఒక తుది గడువు పెడదాం. మన దగ్గర ఉన్న రెండవ వారం స్క్రిప్ట్ పబ్లిష్ అయాక పాఠకుల నుంచి వచ్చిన ముగింపుతో సీరియల్ కు ముగింపు పలుకుదాం”… ఇదీ మా ప్లాన్!

ప్రకటించాం. చాలా ముగింపులు వచ్చాయి. వాటిలో ఒకటి సరిగ్గా జపాన్ మూల నవల ముగింపే! బెంగుళూరు నుంచి ఒకరు పంపారు. ఆ పాఠకుడు/ పాఠకురాలు ( గుర్తు లేదు) ఖచ్చితంగా జపాన్ మూల నవల చదివారు అని మాకు అర్థం అయిపోయింది. దానికి బహుమతి ఇవ్వటానికి నేను అంగీకరించలేదు! ఎందుకు? అది పంపిన వారు ఖచ్చితంగా ఆ మూల నవల చదివారు. దానినే వ్రాసి పంపారు కానీ ఆ సీరియల్ కు తగిన ” స్వంత ముగింపు” ఇవ్వలేదు! కనుక బహుమతికి అర్హం కాదు అని నా వాదన!

శర్మ గారు నా వాదాన్ని ఒప్పుకోలేదు! ” మీరు మూల జపాన్ నవలను వీక్లీకి అడాప్ట్ చేశారు. అంతే! ఇది  మీ స్వీయ రచన కాదు. అడాప్ట్ చేసినప్పుడు మూల రచయిత ముగింపే మనమూ ఇవ్వాలి కానీ స్వంత ముగింపు కాదు. కనుక దానినే ప్రచురించడం న్యాయం” అన్నారు. సరే! ఎడిటర్ ఫిక్స్ అయాక చేసేదేముంది? అలా ” కెమెరా” సీరియల్ ముగిసింది.

శర్మ గారు వీక్లీ నిర్వహణ గురించి ఒక మాట చెప్పారు… ” పొత్తూరి వారు వీక్లీని పట్టుచీర కట్టుకొని పేరంటానికి వెళ్లే ముత్తైదువలా రూపొందించారు. వాకాటి వారి హయాంలో వీక్లీ షిఫాన్ చీర కట్టుకొని ఆఫీస్ కి వెళ్ళే మహిళ లా మార్చారు. నేను బికినీ వేసుకొని బీచ్ లో తిరిగే అమ్మాయిలా మారుస్తాను. ఇంక నా తరువాత వచ్చే వాడు ఆ బికినీ కూడా ఉంచడనుకోండి!” ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాట నిజమే అయింది… ఆయన తరువాత వచ్చిన ఎడిటర్ “మొదటి రాత్రి అనుభవాలు”  అనే శీర్షిక ప్రకటించారు!

శర్మ గారు కొవ్వూరు ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ చదువుకున్న కావ్యాలు, సంస్కృత పద వ్యుత్పత్తులు, పాణిని వ్యాకరణ సూత్రాలు అలవోకగా దొర్లేవి ఆయన మాటల్లో! ఆయన సంస్కృతాంధ్ర సాహిత్య పాండిత్యం వల్ల ఆయన అంటే నాకు గౌరవాభిమానాలు పెరిగాయి. ఇద్దరికీ చాలా ఇష్టమైన సంస్కృత నాటకం ” మృచ్ఛకటికం”. ఆయన, నేనూ సాయంత్రం ఆఫీస్ వేళలు అయిపోయాక ఆ నాటకాన్ని చదివాం మళ్ళీ! చదవటం అంటే ఆ నాటకం మూలం నేను చదువుతూ అంటే ఆయన వ్యాఖ్యానం చేసేవారు. ఆయనది కొవ్వూరు ప్రాచ్య కళాశాల నేపథ్యం… నాది మా గురువుగారు శరభయ్య గారు పెట్టిన సాహిత్య భిక్ష! మేము ఇద్దరమూ ఆ నాటకం చదవటంలో మా ఇద్దరి నేపథ్యాలు కలిసి ఆ నాటకం మాకే క్రొత్తగా సాక్షాత్కరించింది!

శర్మ గారు ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తున్న రోజులలో ఆంధ్రజ్యోతి వీక్లీకి ఒక సీరియల్ వ్రాశారు. మంత్ర తంత్రాలు, ఆభిచారిక, మారణ ప్రయోగాలు… ఇలా ఎన్నో ఉన్నాయి అందులో. ఆయా శాస్త్రాలలో నాకూ అభిరుచి ఉండటం వల్ల ఒకరోజు ఆయనను అడిగాను… ” ఇవన్నీ మీరు ఎక్కడ చదివారు?” అని. ఆయన నవ్వేసి ” రేపు చెబుతా!” అన్నారు. మరునాడు లంచ్ అవర్ లో నన్ను పిలిచి ఒక పుస్తకం చేతిలో పెట్టారు. జస్ట్ అరవై నాలుగు పేజీల పుస్తకం. దాని పేరు ” శాబర మంత్ర చింతామణి”. ఆ పుస్తకం ఇచ్చి ” ఇదొక్కటే నేను చదివినది. దీంట్లో కొన్ని మంత్రాలు సెలెక్ట్ చేసుకుని సీరియల్ మొత్తం అల్లేశా!” అన్నారు శర్మ గారు! అక్కడే ఆ పుస్తకం తిరగేశాను. కేవలం ఆరంటే ఆరే మంత్రాలు అండర్లైన్ చేసి ఉన్నాయి! ” ఈ ఆరేనా? ఇంతేనా?” అన్నాను. ” అంతే!” అన్నారు శర్మ గారు! నాకు నవ్వాలో, ఏడవాలో తెలియలేదు… జస్ట్ ఏదో పుస్తకంలో ఒక ఆరు మంత్రాలు సెలెక్ట్ చేసుకొని అంత సీరియల్ అల్లేశారా? మంత్ర తంత్ర శాస్త్రాలు అంతా ” చులకన” అయిపోయాయా? ఇది ఏమైనా ఆరు మంత్రాలు సెలెక్ట్ చేసుకొని  అంత సీరియల్ కథ అల్లేసిన ఆయన ” కథన ప్రతిభ”ను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేక పోయాను!

” శ్రీగురు సేవకు మరొక అవకాశం!” రేపు…


Leave a comment