స్వీయ అన్వేషణ – 73
శ్రీకాంత శర్మ గారు ఆంధ్రప్రభ వీక్లీ ఎడిటర్ గా ఉంటూనే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత రూపక రచనలు కొనసాగించారు. దానికోసం మూడు నాలుగు రోజులు విజయవాడ వెడుతూ ఉండేవారు.
ఒకపక్క నేను పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ చెప్పిన సాధనలు చేయటానికి అయిదు రోజులు లీవ్ పెడుతూ ఉండేవాడిని.
ఒక్కొక్కసారి మా ఇద్దరికీ ఈ శలవుల విషయంలో క్లాష్ వచ్చేది. శర్మ గారు ” లీవ్ ఇంకోసారి తీసుకోరాదూ? నేను విజయవాడ వెళ్ళాలి. రేడియో ప్రోగ్రాం ఉంది” అనేవారు. అలా ఇద్దరమూ ఒకరికొకరం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం.
ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ, ఆయన మిత్రుడు ఇంజనీర్ రవి ఇద్దరూ ఒక కొండ ఎక్కుతున్నారు. నేను వారి వెనుక పరుగు పెడుతూ వెళ్లి కలసి ఒక ప్రశ్న వేశాను… ” ఇది ఎప్పుడు వదలుతుంది?” ఇదీ నా ప్రశ్న! ” నలభై రోజుల తరువాత” అని గురూజీ అన్నారు. మెలకువ వచ్చేసింది. ఏమీ అర్థం కాలేదు. ఏది వదలాలి? దేనిని వదలించుకోవాలి? తెలియదు!
మరునాడు ఆఫీస్ కి వెడుతూ గురూజీ ఇంటికి వెళ్ళాను. రాత్రి వచ్చిన కల గురించి చెప్పి ” నాకేమీ అర్థం కాలేదు!” అన్నాను. ఆయన నవ్వేసి ” తొందరెందుకు? నలభై రోజుల తరువాత తెలుస్తుంది కదా?” అనేశారు. ఇంకేం మాట్లాడుతాను? ఆఫీస్ కి వెళ్ళిపోయాను.
ఒకసారి గురూజీ చెప్పిన ఒక సాధన చేయటానికి పది రోజులు లీవ్ పెట్టాను. సాధన పూర్తి అయింది. మరునాడు ఆఫీస్ కి వెడుతూ ముందుగా గురూజీ ఇంటికి వెళ్ళాను. నాకోసమే ఎదురు చూస్తున్నట్టు ఒక్కరే కూర్చొని ఉన్నారు ఆయన. సాధన పూర్తి అయిందని, లీవ్ అయిపోయిందని, ఆ రోజు ఆఫీస్ కి వెడుతున్నానని చెప్పి ” సాయంత్రం కలుస్తాను” అన్నాను. ” సరే, మధ్యాహ్నం కలుద్దాం” అంటూ మరొక మాటకు అవకాశం లేకుండా లేచి లోపలకు వెళ్ళిపోయారు!
” ఇదేవిటీ? సాయంత్రం కలుస్తాను అంటే మధ్యాహ్నం కలుద్దాం అంటారు?” అనుకుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాను.
ఒక గంట తరువాత గురూజీ తన స్కూటర్ మీద మా ఆఫీసుకి వచ్చారు. ” ఇటు వెడుతూ వచ్చా” అన్నారు. కాసేపు కూర్చున్నారు. వెళ్ళటానికి లేచి స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉంటే ” సాయంత్రం కలుస్తాను” అన్నాను. ‘ సరే మధ్యాహ్నం కలుద్దాం!” అంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అదే మాట!
మరొక అరగంటకి ఒక అటెండర్ వచ్చి ” మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు” అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. మేనేజర్ కి ఏదైనా పని ఉంటే ఎడిటర్ శర్మ గారితో ఉండాలి, ఏదైనా మాట్లాడితే ఆయనతో మాట్లాడాలి. నాతో ఏమి పని ఉంటుంది? అర్థం కాలేదు. శర్మ గారి దగ్గరకు వెళ్ళి చెప్పాను. ” మేనేజర్ కి నాతో ఏం పని?” అని అడిగాను. ఆయన తల వంచుకొని ఏవో కాగితాలు చూస్తూ ” ఏమో? ఎందుకు పిలిచారో? పిలిచారు కదా? వెళ్లి రండి!” అన్నారు.
మేనేజర్ దగ్గరకు వెళ్ళాను. మేనేజర్ మణియన్ నాకు చెప్పిన విషయం ఇదీ… ” శర్మ గారు మీ మీద మనోజ్ కుమార్ సంతాలియా గారికి కంప్లయింట్ ఇచ్చారు. మీరు ఎక్కువగా లీవ్స్ పెడుతున్నారని, దాని వల్ల ఆఫీస్ వర్క్ కి చాలా ఇబ్బంది అవుతోందని కంప్లయింట్. దాని మీద సంతాలియా మిమ్మల్ని డైలీకి ట్రాన్స్ఫర్ చేయమని, అది మీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేయమని రాశారు!”
నాకు ఏమీ అర్థం కాలేదు! శర్మ గారు నా మీద కంప్లయింట్ చేశారా? అదీ లీవ్స్ విషయంలో? నా లీవ్స్ అన్నీ ఆయన స్వయంగా అప్రూవ్ చేసినవి! ఆయనకు ఎడిటర్ గా లీవ్ రిజెక్ట్ చేసే పూర్తి అధికారాలు ఉన్నాయి. పోనీ ఒక్క లాస్ ఆఫ్ పే లీవ్ లేదు! పైగా ఆయనా, నేనూ లీవ్స్ విషయంలో ఒక ఒప్పందానికి వచ్చి మరీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం! అలాటిది శర్మ గారు లీవ్స్ విషయంలో నా మీద కంప్లయింట్ ఇవ్వటం ఏమిటి?
డైలీకి ట్రాన్స్ఫర్ అంటే డైలీ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారి దగ్గర పని చేయాలి. అది నాకు ఇష్టం లేదు. ఆయన వర్కింగ్ స్టైల్ నాకు పడదు. రెండు మూడు సందర్భాలలో ఆయనకు నా వ్యవహారమూ నచ్చలేదు! అలాంటప్పుడు నేను ఆయన దగ్గర పని చేయటం ఏమిటి? నో వే!
నేనొక నిర్ణయానికి వచ్చాను. మేనేజర్ తో చెప్పాను… ” సర్! నేను రిజైన్ చేస్తాను” అని!
మణియన్ ” నాకూ అర్థం కాలేదు ఈ కంప్లయింట్. మీరిద్దరూ అడ్జస్ట్ అవుతూ లీవ్స్ తీసుకుంటున్నారని నాకు తెలుసు. శర్మ గారే చెప్పారు. ఒకసారి జనరల్ మేనేజర్ ఎ సి వి తో మాట్లాడకూడదూ?” అన్నారు.
” వద్దు సర్! నేను రిజైన్ చేస్తాను!” అన్నాను మళ్ళీ.
” ఎందుకు తొందర పడతారు? పోనీ నేను ఎ సి వి తో మాట్లాడనా?” అన్నారు మణియన్.
” వద్దు సర్! నేను రిజైన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎవరితోనో మాట్లాడి ప్రస్తుతానికి ఈ ఉద్యోగం నిలబెట్టవచ్చు. కానీ నా మీద మళ్ళీ కంప్లయింట్ చేయరని నమ్మకం ఏముంది? అంత సన్నిహితంగా మెలగిన వ్యక్తి ఇప్పుడు ఇలా కంప్లయింట్ ఇచ్చారంటే ఏదో వేరే కారణం ఉండి ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను నిలబెడితే ఎడిటర్ గా అది ఆయనకు అవమానం. పైగా శర్మ గారు పట్టు వదలని మనిషి. ఇవాళ కాకపోతే రేపు సాధిస్తారు. అప్పుడు నాకు గౌరవంగా రిజైన్ చేసే అవకాశం ఉండదు. ఉద్యోగం నుంచి అవమానకరంగా తీసేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను రిజైన్ చేస్తాను” అని లేచాను. ” సారీ, ఇలా అడుగుతున్నానని అనుకోవద్దు. ఎప్పుడు రిజైన్ చేస్తారు. నేను మేనేజ్మెంట్ కి చెప్పాలి కదా?” అని అడిగారు మణియన్.
” మంచి రోజు చూసుకుని” అన్నాను. నేరుగా శర్మ గారి దగ్గరకు వచ్చాను. ” నేను వెడుతున్నాను సర్!” అన్నాను. ” ఈవెనింగ్ వరకూ ఉంటారుగా?” అన్నారు అలాగే తల వంచుకొని కాగితాలలో మునిగి. ” లేదు సర్! ఇప్పుడే వెడుతున్నాను!” అంటూ లేచి వచ్చేశాను. నా టేబుల్ డ్రాలో ఉన్న కొన్ని వస్తువులు తీసుకుని ఆంధ్ర ప్రభ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాను.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ మధ్య కాలంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఆత్మకథ చదివాను. దానిలో ” వల్లభాచార్య వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు” అని వ్రాశారు! అది నిజం కాదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం! అలా నేను వీక్లీ నుంచి బయటకు వచ్చిన వారం లోపే శర్మ గారి మిత్రుడు ” శ్రీరమణ” వచ్చి నా స్థానంలో చేరారు!!!
అలా బయటకు వస్తుండగా ఒక ఆలోచన నా మనసులో మెరుపులా మెరిసింది. ఆనాటి కల వచ్చి ఎన్ని రోజులు అయింది? లెక్క వేసుకున్నాను. నిన్నటికి నలభై రోజులూ పూర్తి ఆయాయి. ఈ రోజు నలభై ఒకటి! వదలిపోయింది! ఆ రోజు రాత్రి కలలో గురూజీని ” ఇది ఎప్పుడు వదలుతుంది?” అని అడిగింది ఇదా? ఆయన ఆ కలలో చెప్పిన సమాధానం ఇదా?
నేరుగా గురూజీ దగ్గరకే వెళ్ళాను. సరిగా మధ్యాహ్నం ఒంటి గంట. ఆ రోజు ఉదయం లాగే ఒక్కరే కూర్చుని ఉన్నారు. జరిగినది అంతా చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. ” సరే!” అన్నారు అంతే!
ఇప్పటికీ గురూజీ నా మీద ఒక జోక్ వేస్తూ ఉంటారు… ” అందరూ నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఈయన మాత్రం ఉద్యోగం ఎప్పుడు వదలిపోతుంది అని అడుగుతాడు!” అని.
శ్రీగురు కృప ఉంటే చాలదా? ఉద్యోగాలు ఉంటే ఎంత? వదలిపోతే ఎంత? ఒక సందర్భంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఒక మీటింగ్ కి వచ్చారు గురూజీ. భక్తి టీవీ లో నా సహోద్యోగి నితీశ్ గురూజీని ఒక ప్రశ్న అడిగాడు… ” గురూజీ! వల్లభాచార్య సార్ నీ అలా వదిలేశారు ఏవిటీ?” అని. దానికి ఆయన ” నేను చూసుకోకుండానే ఆయన ఇలా ఉన్నాడా?” అన్నారు. చాలదా?
” కులపతి గారిని అడ్డుకున్న శ్రీ మాలీజీ!” రేపు…
Leave a comment