స్వీయ అన్వేషణ – 72
పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ అనేక గ్రంథాలు రచించారు. అత్యధిక భాగం హిందీలో, కొన్ని ఇంగ్లీషులో ఉన్నాయి అవి. తెలుగులో లేవు. అందువల్ల తెలుగు వారికి ఆ విజ్ఞానం అందుబాటులో లేదు.
ఆ సంవత్సరం శ్రీ గురు పూర్ణిమకు పరమ పూజ్య గురుదేవులు శ్రీమాలీజీని హైదారాబాద్ కు ఆహ్వానించి ఉత్సవం నిర్వహించాలని పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ సంకల్పించారు. ఆ సందర్భంగా శ్రీమాలీజీ పుస్తకాలలో కొన్నిటినైనా తెలుగులోకి అనువదించి, ప్రచురించి, గురుదేవుల చేతి మీదుగా వాటిని ఆవిష్కరించాలని భావించారు. గురూజీ అపార కృప వల్ల ఆ అనువాద భాగ్యం నాకు లభించింది! అంతకు ముందే శ్రీమాలీజీ హిందీలో వెలువరిస్తున్న ” మంత్ర యంత్ర తంత్ర విజ్ఞాన్” మాస పత్రిక లోని కొన్ని మంత్ర సాధనలను ఆంధ్రప్రభ వీక్లీలో ” తంత్ర ప్రభ” శీర్షికతో అందించటం మొదలు పెట్టాము. శ్రీకాంత శర్మ గారికి కూడా ఈ విషయాలలో ఆసక్తి ఉండటం వల్ల అది సాధ్యం అయింది. వీక్లీ చివరి పేజీలో సగం పేజీ దానికి కేటాయించారు. ఆ శీర్షిక నిర్వహించేది నేనే!
పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ రెండు పుస్తకాలు ఎంపిక చేశారు… ఒకటి ” భౌతిక్ సాధనాయే ఔర్ సఫలత”, రెండవది ” లక్ష్మీ సాధన”. శ్రీమాలీజీ హిందీలో రచించిన ఈ రెండు పుస్తకాలూ నేను తెలుగు చేసే మహద్భాగ్యాన్ని గురూజీ నాకు ప్రసాదించారు. ఆ విధంగా పరమ పూజ్య గురుదేవులకు ” అక్షర సేవ” సమర్పించుకునే అవకాశం కలిగింది. తెలుగులో ప్రచురించిన ఆ రెండు గ్రంథాలనూ పరమ పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ అమృత హస్తాలతో ఆవిష్కరించారు.
శ్రీకాంత శర్మ గారు కూడా ” The Power of Tantra” చదివారు. శ్రీమాలీజీ గురించి వివరాలు అడిగారు. చెప్పాను. ” ఆయన గురించి తెలుగు వాళ్ళకి తెలియాలి” అన్నారు శర్మ గారు.
శ్రీమాలీజీ తన సాధనా ప్రస్థానాన్ని వివరిస్తూ హిందీలో ” నిఖిలేశ్వరానంద్ చింతన్” అనే గ్రంథం వ్రాశారు. దానిలో ఆయన దేశమంతా పర్యటించి ఎంత మంది దగ్గర ఎన్ని సాధనలు తెలుసుకుని సిద్ధింపచేసుకున్నారు అనే విషయాలు వివరంగా తెలియచేశారు. శర్మ గారికి ఆ గ్రంథం గురించి చెప్పాను. ఆయన ఆ గ్రంథాన్ని ధారావాహికగా ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క ఎపిసోడ్ గా వ్రాయమని చెప్పారు. అలా శ్రీమాలీజీ సాధనా ప్రస్థానం ఆంధ్ర ప్రభ వీక్లీలో ” నా సాధన” పేరుతో ప్రచురితం అయింది. అలా శ్రీగురు సేవకు ఇంకొక అవకాశం దొరికింది! ఇదంతా శ్రీగురువులు నన్ను ఒక పరికరంగా ఎంచుకొని తమను తాము తెలుగులో ఆవిష్కరించుకొన్న సందర్భంగానూ, నా పై వారు వర్షించిన అపార కృపామృతవర్షంగా భావిస్తూ ” శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!”
” ఆ అధ్యాయమూ ముగిసింది అలా…!” రేపు…
Leave a comment