స్వీయ అన్వేషణ – 74
ఆంధ్రప్రభ వీక్లీలో పని చేస్తున్న కాలంలోనే గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ అనేక సాధనలు చేయించారు. మనిషి బుద్ధి ఎలా పెడదారి పడుతుంది అనేది ఒక సందర్భంలో నాకు అర్థం అయింది. అలా అర్థం కావటానికి కూడా రెండు మూడు నెలలు పట్టింది! ఆ సందర్భం ఇదీ! సాధకుల నోరు ఎంత అదుపులో ఉండాలో, అలా లేకపోతే ఏమవుతుందో తెలిపే సంఘటన ఇది!
ఒక ఏడాదిలో గురూజీ పదహారు సాధనలు చేయించారు. అప్పట్లో ఒక్క రోజు జపం చేయకపోతే పిచ్చెక్కినట్టుండేది. కొంతకాలం పాటు ఆయన ఏమీ చెప్పలేదు. నాకు ఏమీ తోచడం లేదు. ఒక రోజు గురూజీ దగ్గరకు వెళ్ళాను.
” సర్! ( ఏమిటో! ఇప్పటికీ “సర్” అనటమే! ఆ అలవాటు అలాగే ఉండిపోయింది!) ఈ ఏడాదిలో పదహారు సాధనలు చేశాను. మళ్ళీ మీరేమీ చెప్పలేదు” అన్నాను.
ఆయన ఒకసారి నా వైపు చూసి ” ఎన్ని చేశారు?” అన్నారు.
” పదహారు” అన్నాను.
” చెబుతాలెండి!” అన్నారు. అంతే.
మరో రెండు నెలల వరకూ ఏమీ చెప్పలేదు. నాకు ఏమీ తోచడం లేదు, తెలియడం లేదు. ఆలోచించగా కొన్ని నెలలకు “బుద్ధి” వచ్చింది! నా ” తప్పు” నాకు అర్థం అయింది!
గురువు దగ్గర మాట్లాడే విధానమేనా అది? సాధనలు ” నేను చేశానా?” లేక “గురూజీ చేయించారా?”
” నేను చేశాను” అనే మాట ఎంత తప్పు? ఎంత అహంకారం?
అది అర్థం అయాక ” బుద్ధి” వచ్చింది. ఆ మాట గురూజీ దగ్గర అనలేదు. కానీ నాకు ” బుద్ధి వచ్చింది” అనే విషయం ఆయనకు అర్థం అయింది. అప్పుడు మళ్ళీ సాధన మొదలైంది. గురువు దగ్గర మనం ఎలా మాట్లాడాలో ఇది తెలియ చేస్తుంది.
గురూజీ ఒకసారి ఒక మంత్ర సాధన చెప్పారు. అయిదు రోజులు… ఆ అయిదు రోజులూ ఘన పదార్థాలు ఏవీ తీసుకోకూడదు… అవసరం అయితే పాలు మాత్రం తీసుకోవచ్చు…ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు… పీట మీద ఎర్రని వస్త్రం పరచి, దానిపై కుంకుమ కలిపిన అక్షతలతో ఆ మంత్రాన్ని వ్రాయాలి… యంత్రానికి పంచ ఉపచార పూజ చేయాలి… రోజూ శనగపిండి తో చేసిన లడ్డు నైవేద్యం పెట్టాలి… దానిని మాత్రం ప్రసాదంగా తీసుకోవాలి… ఇదీ విధానం!
మనం తిండి విషయంలో ” అగ్ని స్వరూపులం!”… వేళకు పొట్టలో పడిపోవాల్సిందే!
సాధన మొదలు పెట్టాను. రెండవ రోజు సాయంత్రానికి ఇంటిలో ఒక్కక్కరూ ఇద్దరిద్దరుగా కనిపిస్తున్నారు… ఒక్కో కిటికీ రెండు రెండుగా, ఒక్కొక్క గుమ్మం రెండు రెండుగా కనిపిస్తున్నాయి! మూడవ రోజు సాయంత్రానికి కాస్త స్థిరపడింది!
ఈ సాధన అంతా ఒక గదిలో పెట్టుకున్నాను. లోపల గడియ పెట్టుకుని జపం చేసేవాడిని. రెండవ రోజు జపం చేస్తూండగా నాకు మొట్టమొదట మంత్రోపదేశం చేసిన కులపతి గారు లోపలకు వస్తూ కనిపించారు. ఆయన గుమ్మంలో వుండగానే పరమ గురువులు శ్రీమాలీజీ ఆయనకు అడ్డంగా నిలబడ్డారు. కులపతి గారిని లోపలకు రానీయలేదు! మూడవ రోజూ, నాలుగవ రోజూ, అయిదవ రోజూ కూడా అదే సన్నివేశం!
అయిదు రోజులూ పూర్తి అయాక గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ దగ్గరకు వెళ్ళాను. నాకు కనిపించిన దృశ్యం గురించి చెప్పాను.
” మీకు ఇచ్చిన మంత్రంలో కులపతి గారు ఉపాసన చేసిన దేవత పేరు కూడా ఉందిగా? అందుకే వచ్చారు! కానీ మన గురూజీ ఆయనను లోపలికి అనుమతించలేదు!” అని వివరించారు. బహుశః ఆనాటితో కులపతి గారితో “మంత్ర బంధం” ముగిసిపోయింది అనుకుంటాను!
ఆ మాట చెప్పిన తరువాత సాధన చేసినప్పుడు ఏర్పాటు చేసిన వస్త్రం, అక్షతలు మూట కట్టి తీసుకు రమ్మన్నారు. తీసుకు వెళ్లాను. ఆ మూట ను ఎదురుగా కొద్ది దూరంలో ఉంచారు. కనులు మూసుకొని కొంత సేపటికి తెరచి ” ఆ మూట లో ఒక వస్తువు ఉంటుంది. తీయండి” అన్నారు. మూట విప్పి చూశాను. ఆ అక్షతల మధ్య గులాబి రంగులో ఉన్న ఒక చిన్న శిల ఉంది. ” దగ్గర ఉంచుకోండి. రేపు పొద్దున్న లేచి తలగడ ఎత్తి చూడకండి. అక్కడ తలగడ క్రింద బంగారం ఏమీ ఉండదు. మీరు రచనల ద్వారా సంపాదించుకుంటారు. అంతే!” అన్నారు. అదే నిజం అయింది! నా తరువాతి ఉద్యోగాలు అన్నిటిలో స్క్రిప్ట్ రైటింగ్ తోనే సంపాదన వచ్చింది!
ఒకటా? రెండా? ఎన్ని అనుభవాలు గురూజీతో!
ఆయన ఎదురుగా మాట్లాడేటప్పుడు మాత్రమే కాదు, ఆయన పరోక్షంలో కూడా నోరు అదుపులో ఉండవలసిందే!
గురూజీ పుత్లి బౌలి లో ఉండేవారు. ల్యాండ్ రెవెన్యూ లో పని చేసేవారు. స్కూటర్ మీద తిరిగేవారు. ఆయన శిష్యులు కార్లలో తిరిగేవారు. శలవు రోజులలో ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అంటే శిష్యులు తమ కార్లలో తీసుకువెళ్ళేవారు.
ఒకరోజు ఉదయం… శలవు రోజే… నేనూ, మిత్రుడు వివేకానందం గురూజీ ఇంటికి వెడుతూన్నాం. సరిగా మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి వివేకానందం ” గురూజీ కార్లకు అలవాటు పడిపోయారు. ఇంక మనలాటి వాళ్ళకి దొరకరు!” అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. గురూజీ ఇంటి దగ్గరకు వెళ్లాం. బయట రెండు మూడు కార్లు ఉన్నాయి. లోపలకు వెళ్లాం. చాలా మంది ఉన్నారు. గురూజీ బయటకు వెళ్ళటానికి స్కూటర్ స్టార్ట్ చేస్తున్నారు! కార్ల శిష్యులు ” గురూజీ! ఎక్కడికో చెప్పండి. కారు ఉంది” అన్నారు. అప్పుడు గురూజీ అన్న మాట మా వాడికి ఒక కొరడా దెబ్బే!
” ఎందుకులెండి? మళ్ళీ నేను కార్లకి అలవాటు పడిపోయానని అనుకుంటారు” అని నావైపు తిరిగి ” అంతేనా?” అన్నారు. నేనేం మాట్లాడగలను? నోరు మూసుకుని నిలబడ్డాను. ఆయన స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు.
మరొక సందర్భంలో…
దేవీ నవరాత్రులు సందర్భంలో దుర్గాష్టమి నాడు మా బావగారి అమ్మాయిని ఆశ్రమానికి తీసుకుని రమ్మన్నారు. నేను ఆ రోజు నా పూజా మందిరం శుద్ధి చేసుకుందాం అనుకున్నాను. దుర్గాష్టమి ముందు రోజు రాత్రి మా బావగారు ఫోన్ చేసి, తనకు ఆరోగ్యం బాగా లేదని మా మేనకోడలిని ఆశ్రమానికి తీసుకు వెళ్ళమని అన్నారు. నేను నా భార్యతో ” గురూజీ నన్ను ఇరికించేశారు” అన్నాను.
మరునాడు మా చెల్లెలిని, మేన కోడలిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాను. గురూజీ మా చెల్లెలితో ” రాత్రంతా నన్ను స్తోత్రాలు చేస్తూనే ఉన్నాడుగా మీ అన్నగారు? నా వెనకాల స్తోత్రాలు చేసినా నాకు తెలుస్తుంది” అన్నారు. పైగా ” ఈయన ఆశ్రమానికి రమ్మంటే గుర్రం మీద వస్తాడు. వెంటనే వెళ్ళిపోతాడు ” అని, ” ఇవాళ నేను చెప్పేదాకా కదలటానికి వీల్లేదు” అన్నారు.
గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ తో వ్యవహారం అలా ఉంటుంది. ఒళ్లు , నోరు, బుద్ధి అన్నీ అదుపులో పెట్టుకుని ఉండకపోతే ” చురకలు” తప్పవు.
అలా అని ఆయన ” కఠినుడు” కానే కాదు! విశ్వనాథ వారు తమ గురువు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి గురించి ఒక మాట అన్నారు…
“తన ఎద ఎల్ల మెత్తన…తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన…”
సరిగా ఈ మాటలు మా గురూజీకి కూడా వర్తిస్తాయి! ఆయన మనసు మెత్తనిది! శిష్యులంటే ఆయన మనసులో ఉండే ప్రేమ చెప్పలేనంత మెత్తనిది! ఒక ” చురుకు” మాట విసిరినా అది “దారి తప్పిన గుర్రా”న్ని తిరిగి దారిలో పెట్టడానికే!
” ప్రవాహ వాణి’ ప్రారంభం” రేపు…
Leave a comment