స్వీయ అన్వేషణ – 75
నా పాత్రికేయ జీవితం 1985 లో ఆంధ్రపత్రిక దిన పత్రికతో మొదలైంది. అంతకు ముందు రాజమహేంద్రవరంలో ఉన్న కాలంలో, నా సాహిత్య యాత్రలో “భారతి” మాస పత్రిక ఒక భాగం.
నేను ఆంధ్ర పత్రికలో చేరిన దాదాపు ఏడేళ్ల తరువాత ఆంధ్రపత్రిక ఆగిపోయింది. దానితో పాటు ఆంధ్రపత్రిక వీక్లీ, భారతి మాస పత్రిక కూడా ఆగిపోయాయి. అలాటి సాహిత్య పత్రిక మరొకటి లేదు. కేవలం సాహిత్యం మాత్రమే కాదు… ఆర్థిక, సామాజిక, పురావస్తు, విజ్ఞాన శాస్త్ర విషయాల వంటివి ఎన్నో ఉండేవి. అదొక విజ్ఞాన ఖని!
నేనూ, మిత్రుడు వివేకానందం ఇద్దరికీ చాలాకాలంగా ఒక ఆలోచన ఉంది. “భారతి” లాంటి మాస పత్రిక మళ్ళీ కావాలి, రావాలి. మాలాంటి ఇద్దరం ఆ పని చేయగలమా? నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను అప్పటికి. నాకు వచ్చే జీతం ఏ మూలకూ చాలదు. వివేకానందంకి ఉద్యోగమూ లేదు. ఎలా అని ఆలోచిస్తున్న కాలంలోనే నేను ఆంధ్రప్రభ వీక్లీ నుంచి బయటకూ వచ్చేశాను. ఇంక ఇద్దరమూ నిరుద్యోగులమే!
శ్రీకాంత శర్మ గారు ఒక మాట అంటూ ఉండేవారు ” బట్టల షాప్ లో పని చేసి బయటకు వచ్చిన వాడు ఏం చేస్తాడు? కట్ పీస్ షాప్ పెట్టుకుంటాడు. మరోటి ఏదీ తెలియదు కదా?”
అదే ” తారక మంత్రం!”. సాహసించడం తప్ప మరొక మార్గం లేదు.
అలా పుట్టింది ” ప్రవాహ వాణి” సాహిత్య మాస పత్రిక! దానికి ఆదర్శం ” భారతి” మాస పత్రిక!
నా సాహిత్య నేపథ్యం, భావ జాలం అప్పటికే రచయితలకు, విమర్శకులకు, కవులకు, సాహిత్య కారులకూ అందరికీ తెలిసినవే! ఎంతమంది సహకరిస్తారు? ఎంతమంది రచనలు పంపిస్తారు? విభిన్న భావజాలాల వారు మా ప్రయత్నంలో కలసి వస్తారా? తెలియదు. అయినా ఒక సాహసం చేశాం!
నాకు తెలిసిన సాహిత్యకారులు అందరికీ ఉత్తరాలు వ్రాశాను… సిద్ధాంత వైరుధ్యాలు ప్రక్కన పెట్టేసి. ఈ పత్రిక అన్ని సాహిత్య మార్గాలకు సమగ్ర వేదిక అని చెప్పాను.
నాకు ఆశ్చర్యం కలిగే విధంగా అందరూ సహకరించారు. రచనలు పంపారు! కేతు విశ్వనాథ రెడ్డి, ఏటుకూరి ప్రసాద్ వంటి వారు ప్రోత్సాహక వచనాలు పలికారు. తరుచుగా ఉత్తరాలు వ్రాస్తూ సూచనలు చేశారు, అభినందనలు తెలిపారు.
” ప్రవాహ వాణి” మాస పత్రికలో ప్రధానంగా ఒక విషయాన్ని తీసుకొని, 48 పేజీలకు తగ్గకుండా ఒక బుక్ లెట్ ను కూడా చేర్చాం. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య వంటి వారు ఆ చిరు పొత్తానికి రచనలు పంపారు. ” ఒకనాటి కథ’ పేరుతో పాత రచయితల కథలు వేసేవాళ్ళం… శ్రీశ్రీ, జరుక్ శాస్త్రి, చింతా దీక్షితులు వంటి వారి కథలు వేశాం. కవితా విభాగంలో “ఆర్ష వాణి” పేరిట వేద సూక్తం, ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, వచన కవిత, అనువాద కవిత… ఇలా ప్లాన్ చేశాం. ఒక్కొక్కసారి రచనలు తక్కువ పడేవి. అలాటి సందర్భాలలో నేనే రకరకాల పేర్లతో చెయ్యి చేసుకునే వాడిని. అలా రెండేళ్లు సాగింది ” ప్రవాహ వాణి”. ఆ రెండేళ్లలో 24 పత్రికలు రావలసింది, కానీ కేవలం 17 మాత్రమే తీసుకు రాగలిగాము.
” ప్రవాహ వాణి”కి మంచి పేరే వచ్చింది. కానీ, ఆ పత్రికను మేము నిలబెట్టుకో లేకపోయాం. దానిని సరిగా, సమర్థంగా ” మార్కెటింగ్” చేయలేకపోయాము. వాణిజ్య ప్రకటనలు తెచ్చుకోలేక పోయాం. ఆ పత్రికను రాజమహేంద్రవరం లో ఆవిష్కరించినప్పుడు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఆ సభలో ఒక మాట చెప్పారు… ” ఇంటికి కరెంట్ కట్ చేస్తాము అనే దాకా బిల్లు కట్టని మనవాళ్ళు పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్లి మీకు చందా మనీ ఆర్డర్ చేస్తారా? ప్రతి ఊరిలో మీకు సబ్స్క్రిప్షన్స్ సమీకరించే వారు ఉండాలి” అని. ఆ పని మేము చేయలేక పోయాం. చివరకు ఆ పత్రిక ప్రింట్ చేసే ప్రెస్ కి బకాయి పడి పోయాం. చేసేదేముంది? ఆపేశాం! అలా ” ప్రవాహ వాణి” ప్రవాహానికి శాశ్వతంగా అడ్డుకట్ట పడిపోయింది.
మళ్ళీ ఖాళీ!
” షాక్ ట్రీట్మెంట్ అంటే ఇదీ!” రేపు…
Leave a comment