స్వీయ అన్వేషణ -76
గురువు మాటే మంత్రం! “అల్పాక్షరం…అనల్పార్థం” అన్నట్టు ఉంటుంది శ్రీ గురు బోధ! పలికేది ఒక్క మాటే కానీ అది అనుచరుడి జీవన దృక్పథాన్ని మార్చివేస్తుంది!
ఒకసారి గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ దగ్గరకు వెళ్ళాను.
“ఎలా ఉన్నారు?” ఆయన ప్రశ్న.
” రోటీన్” నా జవాబు.
“అంతకన్నా అదృష్టం ఏముంటుంది?” ఆయన స్పందన!
అదేమి ప్రశ్న? అదేమి స్పందన?
ప్రతి మనిషీ ఏదో రకంగా ఉన్న స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో సతమతం అయిపోతూ ఉంటాడు. దానివల్ల జీవితం అతలకుతలం అయిపోతూ వుంటుంది. ఏ ఎదుగూబొదుగూ లేకుండా జీవితం ఒకేలాగ సాగిపోతూ ఉంటే ” రోటీన్” అయిపోతుంది. అదే స్థితిలో ఉన్న నేను ఆయన ” ఎలా ఉన్నారు?” అని అడిగితే ” రోటీన్” అన్నాను. దానికి ఆయన అన్న మాట ” అంతకన్నా అదృష్టం ఏముంటుంది?” అని. నాకు అర్థం కాలేదు! ” రోటీన్ లైఫ్ అదృష్టం ఎలా అవుతుంది? ఈయనేవిటి ఇలా అంటున్నారు?” అనుకున్నాను. కానీ…
గురూజీ అలా అన్నారు అంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది! ఏమిటది? ఇదే ఆలోచన కొన్నాళ్ళు నన్ను తొలిచి వేసింది. చివరికి ” జ్ఞాన బుగ్గ” వెలిగింది.
” రోటీన్ లైఫ్” అంటే ఏమిటి? ఎటువంటి ఎగుడుదిగుళ్ళూ లేకుండా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రలోకి జారుకునే వరకూ ఒకేలా “ప్రశాంతం” గా సాగిపోవటం! ఎలాటి సంఘర్షణలు లేకపోవటం! ఇది కొందరికి ” బోర్” కొట్టేస్తుంది. ” ఇది కాదు లైఫ్ అంటే! ఇంకా ఏదో కావాలి!” అనుకుంటారు. ఈ ” ఇంకా ఏదో కావాలి!” అనే భావనలోనే అసలు కీలకం ఉంది. అదే ” అశాంతి” కి మూలం! అలాటి ” అశాంతిమయ, సంఘర్షణయుత జీవితం” లో మనిషి కొట్టుకులాడుతూ ఉంటాడు.
ఇక్కడ మరొక రహస్యమూ ఉంది. మనిషికి వాడి ” అర్హత”కు సరిపోయిన జీవితం లభిస్తుంది. జీవితంలో ఎదగాలి అంటే ఆ ఎదుగుదలకు కావలసిన ” అర్హత” సంపాదించుకోవాలి. ఆ ” అర్హత” కోసం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ” ఇష్టం” తో చేయాలి, “అంకిత భావం” తో చేయాలి. అది చేయడు మనిషి! ఉన్న చోటనే ఉండి ఉన్నత స్థాయి కోరుకుంటాడు. అప్పుడే అసలు “అశాంతి” ముంచేస్తుంది!
” రోటీన్ లైఫ్” లో ఈ సంఘర్షణ లేదు! నిజంగా ఉన్నత స్థాయి కోరుకుంటే దానికి తగిన ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
ఇదంతా ” అంతకన్నా అదృష్టం ఏముంటుంది?” అనే మూడు ముక్కల్లో చెప్పేశారు గురూజీ!!!
మరొక సందర్భం…
రాజమహేంద్రవరంలో మా కుటుంబానికి ఒక ఆస్తి ఉంది. అది కొన్ని కారణాల వల్ల మా తమ్ముడి చేతిలో ఉంది. అతని ” అపరిపక్వ నిర్ణయా”ల కారణంగా కోర్టు కేసులలో చిక్కుకుంది. ఆ విషయం చెబుతూ గురూజీతో ” అదేదో తేలిపోతే, దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఆ డబ్బు వస్తే సుఖంగా ఉండొచ్చు” అన్నాను.
గురూజీ ” డబ్బు వస్తే సుఖంగా ఉంటారా?” అని అడిగారు.
డబ్బుతో సుఖం రాదా? ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు పోతాయి కదా? స్థిర పడవచ్చు కదా? ఈయనేవిటి ఇలా అంటున్నారు? నేనేదో ఇబ్బందులు చెబితే ఏదో ఒక పరిష్కారం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేస్తారేమిటి? కొన్ని రోజులు అదే ఆలోచన.
“అవును నిజమే! డబ్బు ఉంటే సుఖం రాదు! డబ్బుతో పాటు కొత్త కష్టాలు వస్తాయి. తగువులు పుట్టుకొస్తాయి. ” మాతా పుత్ర విరోధాయ కాంచనాయ నమో నమః” … తల్లికీ, కొడుక్కీ విరోధాన్ని కలిగించే బంగారానికి నమస్కారం. అదీ డబ్బు మహిమ! సుఖం రాదు సరికదా… అప్పటి వరకూ లేని ఇబ్బందులు వచ్చి నెత్తినెక్కుతాయి.
ఇదంతా ఆ ఒక్క ప్రశ్నలో లేదూ? అనంతర కాలంలో అన్నమాచార్యుల వారి కీర్తన పరిచయం అయింది… ” ఎంత విభవము కలిగిన అంతయును ఆపద అని తెలిసినది కదా తెలివి!”
అదే గురూజీ పరోక్షంగా చెప్పారు కదూ? అదే కదూ ” షాక్ ట్రీట్మెంట్” అంటే? అదీ శ్రీ గురు లక్షణం! అల్పాక్షరముల అనల్పార్థ బోధ!
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!
” క్రొత్త దారి దొరికింది!” రేపు…
Leave a comment