” క్రొత్త దారి దొరికింది!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 77

ఆంధ్రపత్రిక డైలీ, ఆంధ్రప్రభ వీక్లీ ముగిసిపోయాయి. 1985 నుంచి దాదాపుగా 1998 వరకూ సాగిన ఒక రకమైన  జీవితానికి స్వస్తి! తరువాత మరొక రెండేళ్లు ప్రవాహ వాణి. అదీ అయిపోయింది. మళ్ళీ ఖాళీ!

నా భార్య ఉద్యోగస్తురాలే. కానీ ఆనాటి జీతాలు చాలేవి కావు. నేను ఆంధ్రప్రభలో మానివేశాక ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటికి వెళ్ళాను. అప్పటికే నేను ఉద్యోగం వదలి వేశానని ఆవిడకు తెలిసిపోయింది. ” మానేశావా?” అని అడిగారు. ” అవును!” అన్నాను. అప్పుడామె నవ్వుతూ ” అవునులే! మా అమ్మాయి ఉద్యోగం చేస్తోందిగా? ఎన్ని ఆటలైనా ఆడతావ్!” అన్నారు.

కొన్నాళ్ళకు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. ఒక ప్రాజెక్ట్ చేతికి వచ్చింది! నెలకు ఎనిమిది వేలు! అయితే మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ అందిస్తే అప్పుడు మూడు నెలలకు ఒకసారి ఇరవై నాలుగు వేలు వస్తుంది. అప్పుడు నేనూ, నా భార్య ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. నెల తిరిగేసరికి కట్టవలసిన ఫ్లాట్ అద్దె, మెయింటెన్స్, కరెంట్ బిల్లు ఆవిడ జీతంలో కట్టాలి. ఇంక కిరాణా సామానులు, పాలు వంటివన్నీ నేను కట్టాలి. నేను ఆ షాపుల వాళ్ళకి చెప్పేశాను… మూడు నెలలకు ఒకసారి ఇస్తానని. అది ఏడాది ప్రాజెక్ట్. అదీ అయిపోయింది. మళ్ళీ ఖాళీ!

ఇంక సంపాదనకి ఉన్న ఒక్కటే మార్గం. అనువాదాలు చేయటం. అది అలవాటైన పని. ఆ అనువాదాలు చేతి వ్రాతతో ఇస్తే డబ్బులు తక్కువ. అదే కంపోజ్ చేసి ఇస్తే ఎక్కువ. అప్పటి వరకూ కంప్యూటర్ ముట్టుకున్నదే లేదు.

ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. బ్యాంక్ లో అప్పు చేశాను. కంప్యూటర్, ప్రింటర్ కొన్నాను. ఆ అప్పుకు నా భార్య ష్యూరిటీ. ఆ కంప్యూటర్ లో ఉన్న తెలుగు సాఫ్ట్ వేర్ కీ బోర్డు ప్రింట్ ఔట్ తీసుకుని నేర్చుకున్నాను.

ఆ టైమ్ లో ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆయన నా భార్య మేనత్త రెండవ అల్లుడు వేదాల శ్రీనివాస్. ఆయన ఒక క్లెయర్వాయంట్. నేను సాధారణంగా పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్ళేవాడిని కాదు. ఇంట్లో జపం చేసుకుంటూ కూర్చునే వాడిని. నా భార్య వెళ్ళేది. రెండు మూడు సందర్భాలలో ” ఆయన రాలేదా?” అని శ్రీనివాస్ అడిగితే, ” ఏదో పని ఉండి రాలేదు” అని ఈవిడ సమాధానం చెప్పింది. మళ్ళీ ఒక సందర్భంలో ఆ ప్రశ్నే వస్తే అదే సమాధానం చెప్పింది. అప్పుడు శ్రీనివాస్ ” పని ఉందా? ఇంట్లో కూచుని జపం చేసుకుంటున్నారా?” అని అడిగాడు. నా భార్య ఇంటికి వచ్చాక ఈ సంగతి చెప్పింది. నాకు కుతూహలం కలిగింది ” ఎవరీ మనిషి? అతనికి ఎలా తెలిసింది?” అని.

మరొక సందర్భంలో వెళ్ళాను. అతనూ వచ్చారు. ఆ రోజు కొన్ని గంటలు మాట్లాడుకున్నాం. అప్పటి నుంచీ ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు.

నేను మా అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాడిని. మా అపార్ట్మెంట్ అంతా తిరిగి చూసి, ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ చూపించి ” మీరు అందులోకి మారిపొండి!” అన్నాడు. అప్పుడు ఆ ఫ్లాట్ ఖాళీ గా లేదు. ఎవరో టెనెంట్ వున్నారు. అదే అన్నాను. ” లేదు. మీరు అందులోకి వెడతారు!” అన్నాడు. నవ్వుకుని వదిలేశాను. తరువాత ” మీరు శ్రీమహాలక్ష్మి గురించి ఏదైనా చేయండి” అన్నాడు.

ఏమి చేయాలి? అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు చాలా ఉన్నాయి. చాలా మంది భక్తిగా చదువుతూ ఉంటారు. చాలా స్తోత్ర గ్రంథాలలో అచ్చుతప్పులు ఉంటున్నాయి. అంతే కాదు… స్తోత్రం ఉంటుంది కానీ దాని అర్థం ఉండదు. కనుక కొన్ని శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు ఎంచుకొని వాటికి తాత్పర్యాలు వ్రాసి పుస్తకం వేయాలి అనుకున్నాను.

అప్పుడే ఒకసారి ఒక బుక్ షాప్ కి వెళ్ళాను. అక్కడ ” శ్రీవచన భూషణము” అనే గ్రంథం శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి వ్యాఖ్యానంతో కనిపించింది. ఆయన వచన శైలి, వ్యాఖ్యాన విధానం నాకు చాలా ఇష్టం. ఆయన ” తిరుప్పావై” తెలుగు వ్యాఖ్యానం ఆధారంగానే నేను ఆంధ్రప్రభలో శ్రీ లక్ష్మణ యతీంద్రులు వదలివేసిన చివరి మూడు పాశురాలకు వ్యాఖ్యానం  పూర్తి చేశాను. శ్రీ వచన భూషణం పుస్తకం చేతిలోకి తీసుకుని మధ్యలోకి తెరచాను. అక్కడ ఒక తమిళ వాక్యం ఉంది. దాని అర్థం ఇదీ… ” శ్రీమన్నారాయణుని చేరుటకు శ్రీ మహాలక్ష్మియే మార్గము”. ఇదీ ఆ వాక్యం.

ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఈ పుస్తకం నా చేతికి రావటానికి కొద్ది కాలం ముందు నాకు ఒక కల వచ్చింది. దానిలో ఒక శ్రీవైష్ణవ యతి ఏదో ఒక తమిళ వాక్యాన్ని చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఉదయం నిద్ర లేచాక కూడా ఆ వాక్యం గుర్తు ఉంది. నాకు తమిళం రాదు. నా భార్య చిన్నప్పుడు ఢిల్లీ లో ఒక తమిళ్ స్కూల్ లోనే చదువుకుంది. అందుకని ఆమెను అడిగాను. ఆమె ” ఈ తమిళం నాకు తెలియదు. మా స్కూల్ తమిళం వేరు. ఇదేదో బుక్స్ లో తమిళంలా ఉంది” అంది. అప్పుడు ఆ సంగతి వదిలేశాను.

ఇప్పుడు ఈ శ్రీ వచన భూషణం పేజీలో సరిగ్గా అదే వాక్యం కనిపించింది. కొనేశాను. ఇంటికి వచ్చి చదవటం మొదలు పెట్టాను. పగలు, రాత్రి అదే పని. ఒక్క రోజులో ముగించాను. నాకు అప్పటి వరకూ శ్రీవైష్ణవం గురించి పెద్దగా తెలియదు. ఈ పుస్తకం క్రొత్త ” జ్ఞానం” ప్రసాదించింది.

సరే, శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు పని మొదలు పెట్టాను. చేతిలో కంప్యూటర్ ఉంది. 13 స్తోత్రాలు ఎంపిక చేసుకొని, వాటికి తాత్పర్యాలు వ్రాశాను. నాకు ఇన్కమ్ టాక్స్ లో ఒక మిత్రుడు ఉన్నారు. దాదాపుగా వారానికి రెండు మూడు సార్లు కలిసే వాళ్ళం. ఈ పనిలో పడి కలవలేదు. ఈ పని పూర్తి అయాక ఒకసారి వెడితే ” ఇన్నాళ్లూ ఏమైపోయారు?” అని అడిగాడు. చెప్పాను. ” నాకొక ప్రింట్ ఔట్ ఇవ్వకూడదూ?” అని అడిగాడు. ఆ మరునాడు ఇచ్చాను. మూడు నాలుగు రోజుల తరువాత మళ్ళీ కలిసినప్పుడు ” ఈ బుక్ ప్రింటింగ్ ఖర్చు నాదే!” అన్నారు. అలా ” శ్రీకోశము” మొదటి భాగం వచ్చింది.

సరిగ్గా ఈ పని చేస్తున్నప్పుడే అంతకు ముందు  వేదాల శ్రీనివాస్ చెప్పిన ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఖాళీ అయిపోయింది. మేము అందులోకి మారిపోయాము. ఏవో చిన్న చిన్న అనువాదాలు చేయటం, సంపాదించుకోవడం సాగుతూ ఉండగా వాకాటి పాండురంగ రావుగారి మూడవ కుమార్తె వాకాటి కరుణ ఫోన్ చేశారు. కుశలాలు అయ్యాక ” ఇప్పుడు ఏమి చేస్తున్నారు?” అని అడిగారు. చెప్పాను. ఆమె అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యవంలో నడుస్తున్న ” గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ” ( వెలుగు ప్రాజెక్ట్) లో పని చేస్తున్నారు  దానిలో ఒక విభాగానికి స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో. అప్పుడు ఆమె ” మాకు కూడా ట్రాన్స్లేషన్స్ చేస్తారా?” అని అడిగారు. ” చేస్తాను” అన్నాను. వెళ్లి కలిశాను. ఆమె విభాగంలో కాకుండా మరొక విభాగంలో ఆ అవసరం  ఉంది. వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అనువాదం చేయవలసిన మెటీరియల్ సేకరించి ఇవ్వటానికి నెల రోజులు పట్టింది. ఈ నెలలో మరొక విచిత్రం జరిగింది.

అక్కడ కమ్యూనికేషన్స్ విభాగంలో రాష్ర్ట స్థాయి కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పుడు కరుణ ” చేరిపోకూడదూ?” అని అడిగారు. మనకీ ఏదో ఉద్యోగం కావాలి కదా? సరేనన్నాను.

ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరిగింది. ఆంధ్ర పత్రికలో ఎడిటర్ గా పని చేసిన శ్రీరామమూర్తి కూడా అదే ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టున్నారు. ఆయనా ఇంటర్వ్యూకి వచ్చారు. చివరికి ఆ ఉద్యోగం నాకు వచ్చింది.

అలా ఒక క్రొత్త దారి దొరికింది! నేను చేసిన ఉద్యోగాలు అన్నిటిలో ఈ ఉద్యోగం నాకు ప్రత్యేకమైనది. అప్పటి వరకూ చేసిన ఉద్యోగాలలో నాకు నేరుగా ప్రజలతో సంబంధం లేదు. ఈ ఉద్యోగం అలా కాదు… నేరుగా ప్రజలతో… అది కూడా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద, పేద మహిళల ” స్వయం సహాయక సంఘాల” తో పని!

ఈ ఉద్యోగం ఎందుకు ప్రత్యేకం అన్నానో కొంత వివరంగా చెప్పాలి. చాలా మందికి తెలియని ఒక లోకం అది!

” ఎలాగైనా బ్రతికేయగలను!” రేపు…


Leave a comment