” ఎలాగైనా బ్రతికేయగలను!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 78

” గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ” … ” వెలుగు ప్రాజెక్ట్”. ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఒక ప్రత్యేక సంస్థగా నడుస్తున్న సంస్థ.

దానిలో కమ్యూనికేషన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి కన్సల్టెంట్ గా చేరాను. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా గ్రామీణ నిరుపేద, పేద ఎస్ సి, ఎస్ టి, బి సి మహిళలకు సంబంధించిన అభ్యున్నతికి పని చేసే సంస్థ ఇది. ప్రతి గ్రామంలో పదేసి మంది మహిళలు ఒక సంఘంగా ఏర్పడుతారు. అలా ఆ గ్రామంలో ఎన్నైనా సంఘాలు ఉండవచ్చు. ఆ సంఘాలు అన్నిటి నుంచి ప్రతినిధులతో గ్రామ స్థాయి సంఘం, అలాటి గ్రామ స్థాయి సంఘాల ప్రతినిధులతో మండల స్థాయి సంఘం, ఆ మండల స్థాయి సంఘాల ప్రతినిధులతో జిల్లా స్థాయి సంఘం ఏర్పడుతాయి.

ఈ సంఘాలలోని మహిళలు అందరూ ఇందాక చెప్పినట్టు నిరుపేద, పేద వర్గాలకు చెందిన వారు. నూటికి ఎనభై శాతం మంది పదవ తరగతి కూడా దాటని వారే! వీటినే ” పొదుపు సంఘాలు” అని కూడా అనేవారు.

ప్రతి మహిళా తమ సంపాదనలో కొంత పొదుపు చేయాలి, ఆ సొమ్మును సంఘం దగ్గర జమ చేస్తారు. ఏ ఒక్కరికి అవసరం వచ్చినా సంఘం దగ్గర అప్పు తీసుకుని వాయిదాలలో చెల్లించవచ్చు. ఆ సంఘాలు వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదన సాధిస్తాయి.

ఈ సంఘాల నుండి జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన మహిళలు కొందరికి ” పాత్రికేయ శిక్షణ” ఇవ్వటం నా బాధ్యతలలో ప్రధానమైనది. ఇందాక చెప్పినట్టు వీరిలో చాలా మంది పదవ తరగతి కూడా దాటలేదు. తెలుగు మాట్లాడటంలో ఇబ్బంది లేదు కానీ వ్రాయటంలో చాలా ఇబ్బంది ఉంది. ” అమ్మ” అనే పదం వ్రాయాలి అంటే ” అంమ్మ” అని వ్రాసేవారు ఎక్కువ.

వీరిని విలేఖరులుగా తయారు చేయాలి! వారు సేకరించిన వార్తలను సరైన విధానంలో వ్రాసేటట్టు చేయాలి! ఏ వార్త ప్రచురించాలి, ఏది కూడదు అని నిర్ణయించుకునే స్థాయి కల్పించాలి! విలేఖరులుగా తయారు చేయాలి కానీ వార్తల ఎంపికలో జోక్యం చేసుకోకూడదు. అలా వారు సేకరించి, నిర్ణయించుకున్న వార్తలలో జిల్లా స్థాయిలో ” వెలుగు మాస పత్రిక” తీసుకురావాలి. ఇదీ ప్రణాళిక. ఇదీ ” కమ్యూనిటీ జర్నలిజం!”. ప్రతి నెలా మూడు రోజులు వారికి శిక్షణ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని దాదాపు అన్ని జిల్లాలలో తిరిగాను ఈ శిక్షణ అందించటానికి.

ఈ శిక్షణ కాలం నాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని చూపించింది. ఆ శిక్షణ కాలంలో మూడు రోజులు ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్లాసెస్. సాయంత్రం క్లాసెస్ అయిపోయాక అందరమూ ఫ్రెష్ అయి కూర్చునే వాళ్ళం. రాత్రి భోజనం టైమ్ వరకూ కబుర్లు. కబుర్లు అంటే ఏదో సరదా కాదు. ఒక్కొక్కరి జీవితాల గురించి అందరూ తెలుసుకోవటం నాతో సహా! అక్కడ నాకు ఆంధ్రప్రభలో వాకాటి వారు ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగించింది. ఆయన ఎవరికి పరిచయం చేయవలసి వచ్చినా ” నా దగ్గర పని చేస్తున్నాడు” అనే వారు కాదు… ” నాతో పని చేస్తున్నాడు” అనే వారు. ఇక్కడ “రాష్ట్ర స్థాయి అధికారం కాదు… వాళ్ళలో ఒకడిని” అనే భావనకు ఆయనే మార్గదర్శి!

ఒక్కొక్కరి జీవితం తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యం, బాధ కలగలసి ముంచేసేవి. ఎన్ని కష్టాలు పడ్డారు? ఎంత బాధ పడ్డారు? ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు? కుటుంబం నుంచి… చివరకు భర్త నుంచి కూడా… సమాజం నుంచి ఎన్ని అవమానాలు పడ్డారు? రూపాయి రూపాయికి చేయి చాచి ఎంత ఆత్మ న్యూనతకు గురయ్యారు?

ఇవన్నీ వింటూ ఉంటే నా జీవితంలో ఎదుర్కొన్నవి నిజంగా కష్టాలేనా? ఇబ్బందులేనా? అవమానాలేనా? ఎంత మాత్రమూ కానే కావు! వాళ్ళ జీవితాల ” పెద్ద గీత” ముందు నా జీవితం చాలా ” చిన్న గీత!”

వీళ్ళే ఇంత ఆత్మ స్థైర్యం తో బ్రతుకుతో పోరాటం చేస్తూ, తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, తమకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సాధించుకుంటూ ఉంటే… ఒక్క రోజు జేబులో రూపాయి లేకపోతే సతమతం అయిపోయే మన బ్రతుకులు ఎంత?

వాళ్ళ జీవితాలు నాకు నేర్పిన పాఠం… “ఎలాగైనా బ్రతికేయగలను!”

” ఇది మొదటి స్త్రీపర్వం!” రేపు..


Leave a comment