” ఇది మొదటి స్త్రీ పర్వం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 79

ఇప్పటి వరకూ ఎక్కడ ఉద్యోగం అనేది చేసినా నా పై అధికారి పురుషుడే. ఇదిగో… ఈ ” వెలుగు ప్రాజెక్ట్” తో నా జీవితంలో ” స్త్రీ పర్వం” మొదలైంది. నేను  కమ్యూనికేషన్ విభాగంలో కన్సల్టెంట్ అయితే నా పైన స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ ( ఎస్ పి. ఎం) మీరా షినాయ్. ఆమెకు తెలుగు రాదు. హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతారు.

పని చేసేది గ్రామీణ మహిళలతో. జిల్లా స్థాయి అధికారులు సాధారణంగా ఎం ఆర్ ఓ లు. వీరిలో ఎవరూ ఆమె ఇంగ్లీషును అందుకోలేరు… ఆంధ్ర, సీమ ప్రాంతాలలో హిందీ నడవదు. కమ్యూనికేషన్స్ విభాగంలో ఆమె కాక నేనూ, ప్రవీణ్ ( కళాజాతా – కల్చరల్ వింగ్) ఉన్నాం అంతే! ఆమె భాషను ప్రవీణ్ కూడా సగం సగం అందుకోగలడు. మిగిలినది నేను!

ఈ పరిస్థితిలో జిల్లాలలో పాత్రికేయ శిక్షణ కారణంగానూ, అందరితో వారికి వచ్చిన భాషలో మాట్లాడ గలగటం వల్లనూ నేను వారికి బాగా దగ్గర కాగలిగాను ఎస్ పి ఎం మీరా కన్నా!

ఇది ఎప్పుడూ పై అధికారికి ఇబ్బంది కలిగే అంశమే కదా? ఏదో సందర్భంలో ” నీకు ఇంగ్లీష్ రాదు కదా? నువ్వు తెలుగు ఎం ఎ చేశావ్! ఇంగ్లీష్ కాదు కదా?” అన్నది మీరా! ఎవడైనా ఏదైనా నాకు రాదు అంటే మనకి నచ్చదు. అదేదో చేసి చూపించే వరకూ నిద్ర పట్టదు. అంతే! ఆమెకు సమాధానం చెప్పటానికి ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుండి ఎం ఎ ఇంగ్లీష్ పూర్తి చేసి, ఆ సర్టిఫికెట్ మీరాకు చూపించాను. ఆమె ” నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావనుకోలేదు! నీతో జాగ్రత్తగా ఉండాల్సిందే!” అన్నారు.

వెలుగు ప్రాజెక్ట్ లో పని చేస్తున్న కాలంలో ఒకటి, రెండు సార్లు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం దొరికింది. వెలుగు ప్రాజెక్ట్ రాష్ర్ట గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది. దానికి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంత్రి.  వెలుగు సి ఈ ఓ విజయ్ కుమార్ గారు ఆ సమీక్షా సమావేశాలకు నన్నూ, పి ఆర్ ఓ బాబ్జీని తీసుకువెళ్ళేవారు! మొత్తం ప్రాజెక్ట్ వివరాలు మా ముగ్గురి దగ్గర ఉండేవి. స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఉన్నా వారి దగ్గర వారి వారి విభాగాల సమాచారం మాత్రమే ఉంటుంది. నిజానికి నా దగ్గర కమ్యూనికేషన్స్ విభాగం వివరాలు ఉంటే చాలు… కానీ మహిళలకు పాత్రికేయ శిక్షణ ఇచ్చే పనిలో భాగంగా వారు వారి గ్రామాలలో వెలుగు ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని పనులు, వాటి పురోగతి, వైఫల్యాలు, విజయ గాథలు సేకరించాలి. అందువల్ల వారికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఆయా విభాగాల పని తీరు, వాటి లక్ష్యం అన్నీ నాకు తెలియాలి అనుకుని సమస్త సమాచారమూ సేకరించాను. ఆ విషయం సి ఈ ఓ కి తెలుసు. అందువల్ల ఆయన నన్ను వెంటబెట్టుకొని వెళ్లేవారు.

ఈ శాఖకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరిగేవి. ఆ సమీక్ష నిజంగా అయితే బొజ్జల నిర్వహించాలి. కానీ ఆ సమీక్షలు అన్నీ చంద్రబాబే చేసేవారు. ఆ శాఖ మంత్రి బొజ్జల ఆ సమేశాలలో ఉన్నా కేవలం మౌన ప్రేక్షకుడు మాత్రమే!

ఆ సమావేశాలలో చంద్రబాబు అధ్యయనం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను. ఏ విషయం అయినా ఆయనకు ” ఫింగర్ టిప్స్” అంటారే అలా ఉండేది. ఆ శాఖలో వివిధ హోదాలలో ఉన్న ఐ ఎ ఎస్ అధికారుల దగ్గర కూడా లేని సమాచారం ఆయన దగ్గర ఉండేది! ఆయన చెబుతున్న విషయాలు వింటూ, ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాల కోసం తడబడే వారు!

ఒకసారి సమీక్షా సమావేశంలో  ఇలా జరిగింది. స్వయం సహాయక సంఘాల లీడర్లకు సెల్ ఫోన్స్ ఇవ్వాలని చంద్రబాబు అంతకుముందు ఆదేశించారు. మూడు నెలలు అయింది. ” ఎంతవరకూ వచ్చింది?” అని ఆయన ప్రశ్న!  దానికి గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలా చెప్పారు… ” సర్! ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్ నెట్ వర్క్ బాగుంది. రాష్ట్రం అంతా వివిధ నెట్ వర్క్స్ ఉన్నాయి. దేనిని ఎంచుకోవాలి అనేది స్టడీ చేస్తున్నాం. తొందరలోనే నిర్ణయం తీసుకొని చెబుతాము” .

ఆ సమాధానం విని చంద్రబాబు అసహనంగా కదిలారు. తరువాత మాట్లాడటం మొదలు పెట్టారు. ఏ జిల్లాలో ఏ సెల్ ఫోన్ నెట్ వర్క్ బాగా ఉందో ఏకరవు పెట్టారు. ” ఎక్కడ ఏ నెట్ వర్క్ బాగుంటే ఏముంది? ఏ సెల్ నుంచి అయినా ఏ నెట్ వర్క్ కి అయినా కాల్ వెడుతుంది కదా? దీనికి ఓ స్టడీ అవసరమా? వెంటనే సెల్ ఫోన్స్ ఇవ్వండి” అని ఆదేశించారు.

ఆ తరువాత చంద్రబాబు ఒక మాట అన్నారు… ” ఈసారి ఎలెక్షన్స్ లో నేను ఓడిపోతే అది ప్రజల వల్ల కాదు. అధికారులు, ఉద్యోగుల వల్లనే!”. ఎంత మాట అన్నారు అనుకున్నా కానీ ఆ ఎలక్షన్స్ లో అదే జరిగింది!

” సార్ నీ మాకిచ్చేయండి!” రేపు…

“వెలుగు ”  సమావేశాలు

Leave a comment