స్వీయ అన్వేషణ – 80
ఒకసారి వెలుగు ప్రాజెక్ట్ లోని జిల్లా స్థాయి సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని సి ఈ ఓ విజయకుమార్ అనుకున్నారు. ఏర్పాట్ల బాధ్యత నాకు, పి ఆర్ ఓ బాబ్జీకి అప్పగించారు.
అన్ని జిల్లాల ప్రతినిధులు వచ్చారు. రెండు రోజుల సమావేశాలు. ఆ ప్రతినిధులు అందరికీ ఇతర విభాగాల స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్లు మార్గదర్శనం చేశారు. ఆ సమావేశాలలో నేను ఏమీ మాట్లాడలేదు.
రెండవ రోజు మధ్యాహ్నం లంచ్ అవర్ లో సి ఈ ఓ విజయకుమార్ అందరినీ పలకరిస్తూ మాట్లాడుతున్నారు.అప్పట్లో అన్ని సంఘాల కన్నా పరిష్ఠంగా ఉన్నది ఓర్వకల్లు. ఈ సంఘ ప్రతినిధులు శ్రీలంకలో పర్యటించి అక్కడ కూడా శిక్షణలు ఇచ్చారు. దాదాపు కోటి రూపాయల మూలనిధి ఉంది ఆ సంఘానికి!
ఆ సంఘ సభ్యులు అంటే ఒకరకంగా రాష్ట్ర స్థాయి అధికారులకు ఒకప్రక్క గౌరవం, మరో ప్రక్క కాస్తంత భయమూ కూడా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో నడుస్తున్న వెలుగు ప్రాజెక్ట్ కన్నా ముందే యు ఎన్ డి పి పథకం క్రింద ఏర్పడింది. అందువల్ల దాని పునాది, బలమూ ఎక్కువ.
విజయకుమార్ వారితో మాట్లాడుతుండగా వారిలో ఒకరు ( పేరు ఇప్పుడు గుర్తు లేదు) ఆయనతో ” వల్లభాచార్య సార్ ని మాకిచ్చేయండి! మేం తీసుకుపోతాం మా జిల్లాకి!” అన్నారు. నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు అలా అడగగానే నాకు ఆశ్చర్యం కలిగింది! “ఇదేమిటి వీళ్ళు ఇలా అడిగారు?” అనుకుంటూ విజయకుమార్ గారి వైపు చూశాను. ఆయన నవ్వుతూ నాతో ” ఏం మంత్రం వేశావయ్యా ?ఇప్పటికి వీళ్ళతో కలిపి నాలుగు జిల్లాల వాళ్ళు అడిగారు నిన్ను వాళ్ళకి ఇచ్చేయమని?” అన్నారు. నేనేం మాట్లాడగలను? ” You have won their hearts. Good” అని వాళ్ళతో ” సార్ ని మీకిచ్చేస్తే ఇక్కడ పని ఎవరు చూస్తారు? ” అంటూ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను పట్టుకున్నారు ” వచ్చేయండి సార్!” అంటూ. ” అమ్మా! ఇక్కడేదో సుఖంగా బతుకుతున్నాను. నన్ను వదిలేయండి. అయినా మీలాంటి రాక్షసులను భరించే శక్తి నాకు లేదు ” అని నేనూ జారుకున్నాను.
ఇంతకన్నా ఏమి కావాలి? అంతమంది అభిమానం సంపాదించుకోవడం కన్నా కావలసినది వేరే ఏముంటుంది? అంతకు మించిన ఆస్తి మాత్రం ఏముంటుంది? ఇరవై ఏళ్ల నాటి మాట ఇది! జీవితాంతం మరచిపోలేని అభిమాన మాధుర్యం కాదూ ఇది!
మరో సందర్భంలో నాకు తెలియకుండానే ఇరుక్కున్నాను. నా పై అధికారి మీరా అసంతృప్తికి అప్పుడే బీజాలు పడ్డాయి. ఒకసారి కమ్యూనికేషన్స్ విభాగంలో ఉన్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ల సమావేశం జరిగింది. అప్పటివరకూ గ్రామీణ విలేఖరుల శిక్షణకు ఒక నిర్దిష్టమైన సిలబస్ లేదు. దానిని తయారు చేయటానికి వాళ్ళ సలహాలూ, సూచనల కోసం ఆ సమావేశం. సి ఈ ఓ, నా పై అధికారి మీరా ఇద్దరూ ఆ సమావేశాన్ని ప్రారంభించి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వరకూ నేనూ, పి ఆర్ వో బాబ్జీ, కల్చరల్ వింగ్ చూస్తున్న ప్రవీణ్ వాళ్ళతో వివిధ అంశాల మీద చర్చించి, రికార్డు చేసుకున్నాం. లంచ్ అయిపోయింది. రెండవ సెషన్ మొదలైంది. మీరా వచ్చారు. నేను కొన్ని పేపర్స్ కోసం క్రిందికి వెళ్ళాను. వాటిని జిరాక్స్ తీసుకుని వచ్చేసరికి అరగంట పట్టింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరా ముభావంగా ఉన్నారు. కొద్ది సేపటికి ఆమె ప్రవీణ్ తో ” నాకు సార్ తో ఒక అరగంట పని ఉంది. నువ్వు చూసుకుంటూ వుండు” అని చెప్పి నన్ను తనతో రమ్మన్నారు. వెళ్ళాను. ఇద్దరం ఆమె కేబిన్ లోకి వెళ్లి కూర్చున్నాం. ఆమె ” నీకు నా పోస్ట్ కావాలా? కావాలంటే సి ఈ ఓ ని అడగాలి. అంతేకానీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ల దగ్గర ఎందుకు?” అన్నారు.
నాకు ఏమీ అర్థం కాలేదు. నేను మీరా పోస్ట్ ఆశించటం ఏమిటి? పైగా ఆ విషయం వాళ్ళ దగ్గర ప్రస్తావించటం ఏమిటి? అయోమయంలో పడ్డాను. ” ఎవరు చెప్పారు మీకు? అయినా నేను మీ పోస్ట్ కోరుకుంటున్నానని ఎవరో అంటే మీరెలా నమ్మారు?” అని కాస్త కోపంగానే అడిగాను. ఆమె” ఎవరు చెప్పారు అనేది కాదు. నీకు అనిపించిందా లేదా అన్నదే ముఖ్యం” అన్నారు. నాకు అర్థమైపోయింది. ఆమె ఆ మాటలు నమ్మారు. ” రండి. వెదదాం!” అన్నాను. ” అవసరం లేదు” అన్నారు. ” నాకు అవసరం ఉంది, రండి! మీరు రాకపోతే వాళ్ళందర్నీ మీ కేబిన్ కే రమ్మంటాను” అన్నాను. ఆమె అయిష్టంగానే మీటింగ్ హాల్ కి వచ్చారు.
” నేను మీరా పోస్ట్ కావాలని అనుకుంటున్నానని ఎవరు చెప్పారు?” అని అడిగాను. అదే ప్రశ్న ఒక్కొక్కరినీ అడిగాను. అప్పుడు అసలు కథ మొదలైంది. వారిలో చాలామంది చెప్పిన మాటలు మీరా కి ఇంకా కోపం తెప్పించాయి. వాళ్ళు చెప్పిన మాటల సారాంశం ఇదీ…
” మీరు అలా అన్నారని మాలో ఎవ్వరూ చెప్పలేదు. మీరా తో మాకు ఇబ్బందిగా ఉంది అని అన్నాము. ఆమెకు తెలుగు రాదు. ఆమె ఇంగ్లీష్, హిందీ మేము ఫాలో అవలేక పోతున్నాము. పైగా అవసరం వచ్చి ఫోన్ చేస్తే నేనిప్పుడు బిజీగా ఉన్నాను, తరువాత చేయండి అంటారు. మీరు మేము ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో వుంటారు. అందుకని మేము మీరు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే బాగుంటుందని అన్నాము. అంతే!”
నేను అడగలేదు, అడగమని వాళ్ళకి చెప్పలేదు. ఈ విషయం మీరా కి అర్థం అయింది. కానీ వాళ్ళు తనతో ఇబ్బందిగా ఉంది అనటం ఆమెకు నచ్చలేదు. మా ఇద్దరి మధ్య ఎంపిక చేసుకో వలసి వస్తే వీళ్ళకి నేను కావాలి. ఆమె అక్కరలేదు. అక్కడ ఆమె ఇగో హర్ట్ అయింది. సహజం కదా!
అప్పడు ఆమె నన్నేమీ అనలేదు కానీ ” వాళ్ళతో నువ్వే డీల్ చెయ్. పాలసీ మేటర్స్ ఉంటే మాత్రమే నాకు చెప్పు” అంటూ పరోక్షంగా బాధ్యత నా మీద వదిలేశారు.
మీరా మంచి మనిషి, సరదా అయిన మనిషి, ఉదార స్వభావం కూడా, ఎవరినైనా గౌరవించే సంస్కారం ఉన్న మనిషి. అయినా ” అహం” దెబ్బ తింటే? మానవ సహజమైన బాధ కలుగుతుంది కదా?
వెలుగు ప్రాజెక్ట్ ఇతర రాష్ట్రాల పై ప్రభావం చూపించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు వెళ్లి శిక్షణ ఇచ్చేవారు. ఒకసారి తమిళనాడు నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. అక్కడి ప్రాజెక్ట్ లో గ్రామీణ విలేఖరుల వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ, నెల రోజుల పాటు అక్కడి రాష్ట్ర స్థాయి వారికి శిక్షణ ఇవ్వాలని.
మీరా నన్ను పిలిచారు. విషయం చెప్పారు.
” వెడతావా?” అని అడిగారు.
” వెడతాను” అన్నాను.
” అయితే ఒక కండిషన్” అన్నారు.
” ఏమిటి?” అని అడిగాను.
” అక్కడ నువ్వు నేను చెప్పినట్టే పని చేయాలి. ఇండిపెండెంట్ గా ఏమీ చేయకూడదు. ఏ విషయం అయినా నాతో డిస్కస్ చేసి, నా డెసిషన్ మాత్రమే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. స్పాట్ డెసిషన్లు తీసుకో కూడదు” అన్నారు.
అదెలా సాధ్యం? ప్రతి దానికీ ఆమెను కన్సల్ట్ చేయటం ఎలా కుదురుతుంది? అక్కడి పరిస్థితులను బట్టి కమ్యూనికేషన్స్ వ్యూహాలు మార్చుకోవలసి వస్తుంది. అప్పటికప్పుడు ఆ పని చేయకపోతే కుదరదు. ఆమెతో సంప్రదించి అప్పుడు మాత్రమే చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది? శిక్షణ ఇచ్చే వాడికి స్వేచ్ఛ లేకపోతే ప్రతీదీ ” మేడమ్ తో మాట్లాడి చెబుతాను” అంటే ” మరి నువ్వెందుకు వచ్చావ్? మీ మేడమ్ నే పంపొచ్చు కదా?” అనరా?
అప్పటికప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ” నేను వెళ్ళను. వేరే ఎవరినైనా పంపండి” అని చెప్పి, లేచి వచ్చేశాను.
” స్త్రీ పర్వం 2.0 ! నాకు నచ్చలేదు!” రేపు…
Leave a comment