స్వీయ అన్వేషణ – 81
చివరకు ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా వెలుగు ప్రాజెక్ట్ వ్యవహారాలలో వేలు పెట్టలేదు. ఒక్కడు కూడా వెలుగు ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చివరకు ఆ ప్రాజెక్ట్ ను అజమాయిషీ చేసే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా నేను పని చేసిన రెండు, రెండున్నరేళ్లలో ఒకసారో, రెండుసార్లో ఆఫీస్ కి వచ్చారు. అంతే!
కాంగ్రెస్ పాలన మొదలైంది. ఒకరోజు ఒక వ్యక్తి అయిదారుగురుని తీసుకుని ఆఫీస్ కి వచ్చాడు. సి ఇ ఓ ను కలవాలి అన్నాడు. “దేనికి?” అని అడిగాడు పి ఆర్ ఓ బాబ్జీ. ” పని ఉంది” అంతే జవాబు. ఇంతకీ పని ఏమిటయ్యా అంటే తన వెంట తీసుకువచ్చిన వారికి ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలి… ఇదీ డిమాండ్! ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. అయితే సి ఇ ఓ విజయకుమార్ పరమ లౌక్యుడు. కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరిస్తూ వారి బారి నుండి తప్పించుకునే వారు!
నిరుపేద, పేదల జీవితాల్లో వెలుగు నింపటం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. కనుక ఆ ప్రాజెక్ట్ కు ” వెలుగు” అనే పేరే తగినది. కానీ, ప్రభుత్వం మారింది కదా! పేరూ మార్చేయమని ఆదేశాలు వచ్చాయి! మార్చవలసిన పేరు కూడా ఆదేశంగా వచ్చేసింది! ” వెలుగు” కాస్తా ” ఇందిరా క్రాంతి పథం” ( ఐ కా ప)గా మారిపోయింది! ఎవరికీ ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఆదేశం … తప్పదు కదా?
ఈ మార్పులతో పాటుగా లోపల మరొక మార్పు చోటు చేసుకుంది. కమ్యూనికేషన్స్ హెడ్ గా ఉన్న మీరా మరొక క్రొత్త పని మొదలు పెట్టారు. అదే ” ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్”. దీని లక్ష్యం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం. ఉద్దేశ్యం చాలా మంచిది. కానీ అమలు చేసే వ్యూహం నాకు నచ్చలేదు. ఎందుకు?
గ్రామాలలో టెన్త్, ఇంటర్ చదువుకున్న యువతీ యువకులను సమీకరించి, వారికి కొన్ని నైపుణ్యాలు నేర్పించి, నగరాలలో ఉద్యోగాలు కల్పించటం వ్యూహం.
ఆ వ్యూహంలో ఎంపిక చేసిన ఉద్యోగాలు ఏమిటి? పైకి పేర్లు చాలా గొప్పగా ఉంటాయి. హాస్పిటాలిటీ రంగం, కంప్యూటర్ శిక్షణ … అలా.
ఏమిటి హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలు? దేనిలో శిక్షణ?
నగరాలలోని హోటళ్లలో కస్టమర్ల ఆర్డర్లు తీసుకునే స్టీవర్డ్స్, ఆ ఆర్డర్లను సప్లయి చేసే సర్వర్లు!
నగరాలలోని సంస్థలలో సెక్యూరిటీ గార్డులు!
ఎం ఎస్ ఆఫీస్ లో జస్ట్ వర్డ్, ఎక్సెల్ నేర్చుకునే డేటా ఎంట్రీ ఆపరేటర్స్!
ఉద్యోగాలు ఎక్కడ?
హైదారాబాద్, బెంగలూరు, చెన్నై వంటి నగరాలు!
జీతాలు ఎంత?
నెలకు అయిదు నుంచి పది వేలు!
ఎలా బ్రతుకుతారు ఆ నగరాలలో… ఆ జీతాలతో?
అంతకన్నా అదే సంపాదన వాళ్ళు ఉన్న గ్రామాల్లోనే వస్తే?
ఈ వ్యూహంలో ఇంకొక ప్రమాదం ఉంది… గ్రామీణ ప్రాంతాలలో టెన్త్, ఇంటర్ చదివిన యువతీ యువకులు నగరాలకు తరలి పోతారు. గ్రామంలో యువ జనాభా, యువ శక్తి తగ్గిపోతుంది. పిల్లలు, నడివయసు వారు, వృద్ధులు మిగులుతారు!
నేను గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు వ్యతిరేకిని కానే కాదు. వారు సంపాదించుకోవాలి. వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. వారు వృద్ధిలోకి రావాలి.
ఆ ఉపాధి అదే గ్రామంలో కల్పిస్తే? యువశక్తి గ్రామంలోనే ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అన్నది నా ఆలోచన!
అదే మీరా కు చెప్పాను. ఆమె ఒప్పుకోలేదు. బెంగళూరులో పది వేలకు పని చేసే సెక్యూరిటీ గార్డ్ ఎలా బతుకుతాడు? అక్కడి అద్దెలు ఎక్కువ కదా? అంటే ” నో ప్రాబ్లెమ్. నలుగురైదుగురు కలిసి ఒక రూం తీసుకుంటారు” అన్నారు ఆమె.
ఆమె ఈ వ్యూహం విషయంలో పట్టుదలగా ఉన్నారని అర్థం అయింది. ఆమెతో మాట్లాడి ప్రయోజనం లేదు అనీ తెలిసింది. పైగా ఆమె ఆ మిషన్ స్వయంగా అప్రూవ్ చేయించుకున్నారు. అది ఆమె డొమెయిన్. నేను మాట్లాడటానికి లేదు. వదిలేశాను. కానీ నాకు నచ్చలేదు!
ఈ మిషన్ రావటంతో మీరా పూర్తిగా దానిపై దృష్టి పెట్టారు. సి ఇ ఓ కూడా కమ్యూనికేషన్స్ విభాగాన్ని ఆమె నుంచి తప్పించి, ప్రాజెక్ట్ లో జెండర్ విభాగానికి స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్న జమునకు అప్పగించారు. ఆమె, నేనూ ఒకే రోజు ప్రాజెక్ట్ లో చేరాం. ఆమె గతంలో ఉదయం డైలీ లో పని చేశారని మాత్రమే నాకు తెలుసు. ఇంకేమీ తెలియదు. ఇప్పుడు నా బాస్ మీరా కాదు… జమున.
” స్త్రీ పర్వం 3.0 – సి ఇ ఓ కి ఏం తెలుసు?” రేపు…
Leave a comment