“సి ఇ ఓ కి ఏం తెలుసు?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 82

నాకూ, ప్రవీణ్ కి సి ఇ ఓ విజయకుమార్ ఒక పని అప్పగించారు. కొన్ని ఊళ్లకు వెళ్లి, అక్కడ సంఘాల సమావేశాలను యథాతధంగా రికార్డు చేయాలి. ఆ సమావేశాలలో మేము ఏ మాత్రమూ కల్పించుకోకూడదు. ఆ సంఘాల సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రమే రికార్డు చేయాలి అంతే!

అలా మొదటి విడతలో సి ఇ ఓ ఎంపిక చేసిన ఊళ్ళు శ్రీకాకుళం, కాకినాడ. ముందుగా శ్రీకాకుళం వెళ్లాం. అక్కడ పొదుపు సంఘం సమావేశాన్ని రికార్డు చేశాము. మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముందుగా ఆ నెల జమాఖర్చులు చూసుకున్నారు. తరువాత ఎవరికి ఎంత ఋణం కావాలి? ఆ ఋణం దేనికి? అనేవి చర్చించుకున్నారు. ఎవరికి ఎంత ఇవ్వగలరు అనేది నిర్ణయించుకున్నారు. తిరిగి చెల్లించ వలసిన వాయిదా సొమ్ము, వాయిదాల సంఖ్య నిర్ణయించారు. ఆ తరువాత వారి వారి వ్యక్తిగత సమస్యలు చర్చించుకుని, వాటికి పరిష్కారాల గురించి ఆలోచించుకున్నారు. ఇదంతా మేము సాక్షులుగా చూస్తూ రికార్డు చేసుకున్నాం. అలాగే కాకినాడలో కూడా చేశాం.

తిరిగి హైదారాబాద్ వచ్చేశాం. ఆ నివేదిక ఇవ్వటానికి సి ఈ ఓ ఒక ఫార్మట్ ముందుగానే మాకు ఇచ్చారు. ఆ ఫార్మట్ ప్రకారం నేనూ, ప్రవీణ్ విడివిడిగా రిపోర్ట్స్ తయారు చేశాం. ఇద్దరం మూడేసి కాపీలు తీసి ఒకటి సి ఇ ఓ కి పంపించాం. ఒక కాపీ ఆఫీస్ ఫైల్ లో ఉంచాం.మరొక కాపీ అప్పుడు కమ్యూనికేషన్స్ విభాగానికి క్రొత్తగా అధికారిగా వచ్చిన జమునకు పంపాము.

ఆ కాపీ తీసుకువెళ్లిన వ్యక్తి ఆ కాపీతో పాటు తిరిగి వచ్చాడు. ” మిమ్మల్నే వచ్చి ఇమ్మన్నారు!” అని చెప్పాడు మా ఇద్దరికీ! మీరా ఎప్పుడూ ఇలా అనలేదు!

సరే, ఇద్దరం ఎవరి కాపీ వారు తీసుకుని వెళ్లాం.

” రిపోర్ట్ సబ్మిట్ చేయటానికి మీరు రావక్కర్లేదా? అటెండర్ తో పంపిస్తారా?” ఇది ఆమె మొదటి ప్రశ్న.

” మీరాకి ఎప్పుడూ అలాగే పంపేవాళ్ళం” అన్నాను.

” ఇప్పుడు మీరా లేదు. పద్ధతులు మార్చుకోండి!” అన్నారు ఆమె.

నాకు ఆ మాటతో మంట మొదలైంది. అయినా ఏమీ మాట్లాడలేదు. రిపోర్ట్స్ ఆమె చేతికి ఇచ్చాం. ముందుగా నా రిపోర్ట్ తీశారు. నాలుగు పేజీలు అటూ ఇటూ తిరగేసి, దానిని టేబుల్ పై విసిరినట్టు పడేశారు. మంట పెరుగుతోంది నాకు.

” ఇదేనా రిపోర్ట్ అంటే? ఇలాగానే రిపోర్ట్ రెడీ చేసేది?” అన్నారు ఆమె.

నాకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ ” దాన్లో ఏం డిఫెక్ట్ ఉంది?” అని అడిగాను.

” అసలు రిపోర్ట్ తయారు చేసే ఫార్మట్ ఇదేనా? ఇన్నాళ్ళ నుంచీ చేస్తున్నారు! ఇలాగే చేస్తున్నారా? యూజ్లెస్ రిపోర్ట్!” అన్నారు జమున.

ఇంక నాకు కోపం ఆగటం లేదు. అయినా కోపాన్ని అణచుకుంటూ ” అది సి ఈ ఓ ఇచ్చిన ఫార్మట్!” అన్నాను కొంచెం కటువుగానే.

” సి ఇ ఓ ఇచ్చాడా? సి ఇ ఓ కి ఏం తెలుసు?” అని రెట్టించారు ఆమె.

” అది సి ఈ ఓ ఇచ్చిన ఫార్మట్ అని చెబుతున్నాను కదా? మేము దాన్ని ఫాలో అవాలి కదా?” అన్నాను కోపంగా.

” అదే చెబుతున్నా. సి ఇ ఓ కి ఏం తెలుసు?” అన్నారు మళ్ళీ.

ఇంక నిగ్రహం అనవసరం అనిపించింది. సి ఇ ఓ కి ఏం తెలుసు అని అడిగాక ఇంకా ఆగేది ఏం ఉంటుంది?

” సి ఇ ఓ కు తెలియక పోతే మీకు తెలుసా?” అన్నాను.

ఆమె ఆ ప్రశ్న ఊహించి ఉండరు. ఒక్క క్షణం నా వైపు చూసి, ” అవును. సి ఇ ఓ కి ఏమీ తెలియదు. మీరు వెళ్ళేముందు నన్ను అడిగివుంటే రిపోర్ట్ ఎలా వ్రాయలో చెప్పేదాన్ని. మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాసేసి తెచ్చేస్తే నేను అప్రూవ్ చేయాలా? ఇదొక యూజ్లెస్ రిపోర్ట్” అన్నారు.

ఇన్నేళ్లలో నేను చేసిన పని ” Useless” అని అన్న మొట్టమొదటి మనిషి జమున. ఆ మాట విన్నాక ఇంకా సహించ వలసిన అవసరం లేదని తేలిపోయింది. “రిపోర్ట్ మేమే స్వయంగా పట్టుకువెళ్లి ఇవ్వాలి” అన్నప్పుడే ఆ “అహంకారం” ఏ స్థాయిలో ఉందో అర్థం అయింది. ఇంకా ఊరుకునేది ఏముంది? తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాను.

కుర్చీ నుంచి లేచాను. ” మీరు నా రిపోర్ట్ అప్రూవ్ చేయ వలసిన అవసరం లేదు. ఈ రిపోర్ట్ నేను సి ఈ ఓ కి పంపేసాను. ఈ పని నాకు చెప్పినది ఆయన… మీరు కాదు. ఆ రిపోర్ట్ అప్రూవ్ చేయాలా, వద్దా అనేది నిర్ణయించ వలసినది సి ఇ ఓ కానీ మీరు కాదు. మీరు ఈ విభాగానికి ఎస్ పి ఎం కాబట్టి, ఆ గౌరవంతో మీకు ఒక కాపీ పంపాను అంతే కానీ మీ అప్రూవల్ కోసం కాదు. You have nothing to do with this report, bye!” అని బయటకు వచ్చేశాను. నా వెనుకే ప్రవీణ్ కూడా వచ్చేశాడు. అప్పటికే సాయంత్రం అయిదు అయిపోయింది. ఆ రోజుకు డ్యూటీ అయిపోయింది. ఇంటికి బయలు దేరాను.

ఆటోలో ఇంటికి వెడుతుంటే ఒళ్ళంతా వణుకుతోంది. బాగా జ్వరం వచ్చినట్టుగా వుంది. ఇంటికి వచ్చాక అది ఇంకా ఎక్కువ అయింది.

ఇక లాభం లేదని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. 103 జ్వరం ఉంది!

” బి పి చూస్తాను” అన్నారు డాక్టర్.

” నాకు బిపి లేదు” అన్నాను.

డాక్టర్ నవ్వేసి ” సరే, లేదు లెండి, ఓసారి చూద్దాం సరదాగా” అన్నారు. డాక్టర్ బిపి చెక్ చేశారు.

180/ 140 !

” లేదన్నారూ?” అన్నారు డాక్టర్.

నేను ఏమీ మాట్లాడలేక పోయాను.

” ఈ మధ్య ఏమైనా ఎక్జైట్ అవుతున్నారా బాగా?” అని అడిగారు డాక్టర్.

ఆ రోజు జరిగినది అంతా గుర్తుకు వచ్చింది. క్లుప్తంగా చెప్పాను.

” మరింకేం? అయినా అన్నీ అలా సీరియస్ గా తీసుకుని ఉద్రేకపడి పోతే ఎలా? ఏ సిచుయేషన్ అయినా కూల్ గా తీసుకోవాలి” అన్నారు డాక్టర్.

” మీరు ఇన్నేళ్లు కష్టపడి చదివి డాక్టర్ అయారు. ఇన్నేళ్ళ నుంచీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని యూజ్లెస్ డాక్టర్ అంటే ఎలా ఉంటుంది మీకు?” అని ఎదురు ప్రశ్న వేశాను.

” ఇంకా ఎవరూ అనలేదు. అన్నప్పుడు చెబుతాను” అంటూ ఏవో మందులు రాసి ” రెగ్యులర్ గా వాడండి” అన్నారు. ( ఆ రోజు మొదలు పెట్టిన బి పి మందులు ఈనాటి వరకూ నన్ను వదలలేదు!)

ఇంటికి వచ్చిన వెంటనే కంప్యూటర్ ముందు కూర్చున్నాను. రిజిగ్నేషన్ లెటర్ రాసి సి ఇ ఓ కి మెయిల్ చేసేశాను! అరగంటలో రిప్లై వచ్చింది… ” Meet me tomorrow morning by 10am”.

మరునాడు వెళ్లి ముందుగా ఆఫీస్ నాకు ఇచ్చిన కంప్యూటర్ హాండ్ ఓవర్ చేసేశాను. అకౌంట్స్ విభాగానికి వెళ్లి నా టి ఏ బిల్స్ సెటిల్ చేసేశాను. ఇద్దరి దగ్గరా ” No Due Certificates” తీసుకున్నాను. అవి తీసుకుని సి ఇ ఓ దగ్గరకు వెళ్ళాను.

” ఎందుకు?” అడిగారు ఆయన.

జరిగినది అంతా చెప్పాను. No Due Certifucates ఆయన ముందు పెట్టాను. చూశారు.

” So, మీ డెసిషన్ మారదన్న మాట?” అన్నారు.

” సారీ సర్! మారదు!” అని లేచి, ” సర్! ఇన్నాళ్లూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్!” అని నమస్కారం చేసి బయటకు వచ్చేశాను. సి ఇ ఓ పర్సనల్ అసిస్టెంట్ ధూర్జటి కరుణాకర్ నాకు మంచి మిత్రుడు. అతనికి, బాబ్జీకి, ప్రవీణ్ కి, మీరాకి చెప్పేసి ఇంటికి వచ్చేశాను.

అలా ” వెలుగు” అధ్యాయం ముగిసింది!

” శ్రీ మహాలక్ష్మి ఒప్పుకోలేదు!” రేపు…


Leave a comment