” శ్రీమహాలక్ష్మి ఒప్పుకోలేదు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 83

” వెలుగు ప్రాజెక్ట్” లోకి రాకముందే శ్రీమహాలక్ష్మీ అష్టోత్తరశత నామావళి లోని ప్రతి నామానికీ వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించి, మొదలు పెట్టాను. శ్రీమహాలక్ష్మీ స్తోత్రాలతో ” శ్రీకోశము” మొదటి భాగం మొదలు పెట్టినప్పుడే మొత్తం నాలుగు పుస్తకాలు వ్రాయాలని అనుకొన్నాను. ఒకటి స్తోత్రాలకు తాత్పర్యాలు – పారాయణ విధానం, రెండవది శ్రీమహాలక్ష్మీ అష్టోత్తరశత నామావళిలో ప్రతి నామానికీ వ్యాఖ్యానం, మూడవది సంస్కృతంలో ఉన్న శ్రీ లక్ష్మీ తంత్రమునకు తెలుగు అనువాదం, చివరగా నాలుగవది శ్రీ మహాలక్ష్మీ సహస్ర నామావళిలో ప్రతి నామానికీ వ్యాఖ్యానం. ఇదీ ప్రణాళిక.

రెండవ పని శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశత నామావళిలోని నామాలకు వ్యాఖ్యానం మొదలు పెట్టిన కొద్ది రోజులకే ” వెలుగు ప్రాజెక్ట్”లో ఉద్యోగం వచ్చింది. అయినా ఆ పని నా వీలును బట్టి సాగిస్తూ ఉన్నాను. పేపర్ మీద పెట్టకుండా నేరుగా కంప్యూటర్ లో టైప్ చేసేవాడిని. 16 నామాలకు వ్యాఖ్యానం పూర్తి అయింది.

ఒక రోజు ఆనుకొని ఘటన జరిగింది. నా కంప్యూటర్ క్రాష్ అయిపోయింది. ఈ వ్యాఖ్యానం తో సహా సేవ్ చేసుకున్న మెటీరియల్ అంతా పోయింది!

మళ్ళీ మొదలు పెట్టాను. ఈసారి ఆ పొరపాటు చేయకుండా ఒక నోట్ బుక్ లో వ్రాయటం మొదలు పెట్టాను. ఆ నోట్ బుక్ ను ఆఫీస్ కు కూడా తీసుకువెళ్ళి ఖాలీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండేవాడిని. మొదటి 16 నామాలకు వ్రాసిన అర్థానికీ, ఇప్పుడు వ్రాసిన దానికీ తేడా ఉంది! అలా 64 నామాల వ్యాఖ్యానం పూర్తి అయింది. అప్పుడు ఒకసారి మిత్రుడు ధూర్జటి కరుణాకర్ చూశాడు. అతను సి ఈ ఓ విజయకుమార్ కు పర్సనల్ అసిస్టెంట్. మంచి జ్యోతిష ప్రతిభ ఉన్నవాడు కూడా. అతని ఇంటిలో కంప్యూటర్ ఉంది. చాలా ఫాస్ట్ గా కంపోజ్ చేయగలదు. అతను నన్ను అడిగాడు… ” అన్నా! ఈ స్క్రిప్ట్ నేను కంపోజ్ చేస్తాను” అని. సరే అని ఇచ్చాను. మళ్ళీ అదే జరిగింది… అతని సిస్టమ్ క్రాష్ అవటమే కాదు… 64 నామాల వరకూ సాగిన వ్యాఖ్యానం స్క్రిప్ట్ ఎక్కడో మిస్ అయిపోయింది!!!

మళ్ళీ మొదటికి వచ్చింది. వదలలేదు… మళ్ళీ మొదలు పెట్టాను. 108 నామాలకూ వ్యాఖ్యానం పూర్తి చేశాను. కొన్ని నామాల వ్యాఖ్యానం  దగ్గర సంప్రదాయాన్ని ఉల్లంఘించానా? అనిపించింది. ఎలా? అలాటి సందర్భాలలో శ్రీ పరాశర భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్ర నామాలకు చేసిన వ్యాఖ్యానం చూసే వాడిని. నాకు తెలియకుండానే సరైన దారిలోనే నడిచింది. మొత్తానికి పూర్తి అయింది.

మొదటి రెండుసార్లు చేసిన వ్యాఖ్యానానికి చాలా భిన్నంగా ఉంది మూడవసారి చేసినది! అప్పుడు అర్థం అయింది… మొదట చేసిన వ్యాఖ్యానాలు శ్రీ మహాలక్ష్మికి నచ్చలేదు! శ్రీ మహాలక్ష్మి వాటిని ఒప్పుకోలేదు! ముచ్చటగా మూడవసారి తానే నన్ను ఒక పరికరం చేసుకొని “వ్రాయించుకుంది!”  అనిపించింది. అదే నిజం కదూ? ఆ తల్లి అనుగ్రహం లేకుండా మనం చేసేది ఏముంటుంది కనుక? ” నేను వ్యాఖ్యానం చేస్తాను” అంటే ” నువ్వెవడివిరా నా అనుమతి లేకుండా వ్రాయటానికి?” అనుకుందా? చివరికి ” పోనీలే… ఏదో తంటాలు పడుతున్నాడు” అని ఆమే నా చేతికి తోడు నిలిచింది! అలాగే ఈ పుస్తక ప్రచురణకు కూడా ఆ తల్లియే దారి చూపింది! కొందరు మిత్రులు ఆ బాధ్యత తీసుకుని ఆ పుస్తకాన్ని ప్రచురించారు! డాక్టర్ పింగళి జగన్నాథ రావు అనే మిత్రుడు అలా ప్రచురించిన పుస్తకాలలో సగం పుస్తకాలు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం వారికి అందించారు! అమ్మ వ్రాయించిన పుస్తకం అమ్మే తీసుకుంది!

అమ్మ చరణాలను ఆశ్రయించటం కంటే మనం ఏమి చేయగలను?

” భగవతీం, శ్రియం, దేవీం, నిత్యానపాయినీం, నిరవద్యాం, దేవదేవ దివ్యమహిషీం, అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం, అశరణ్య శరణ్యం, అనన్య శరణశ్శరణ మహం ప్రపద్యే!”

” రంగం మారింది!” రేపు…


Leave a comment