” రంగం మారింది!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 84

జాతకంలో ” పితృ దోషం” ఉంటే తండ్రితో కానీ, పై అధికారులతో కానీ తగువులు వస్తాయని చెబుతూ వుంటారు. నిజమేనేమో! మనకి ఈ రెండూ సంభవించాయి. నేను నన్నయ నవశతి ఉత్సవాలలో నా మొదటి ప్రసంగం చేసేవరకూ మా తండ్రికి నేనంటే చులకనే! అర్జునుడు కనుక పది మందిలో బభ్రువాహనుడిని అవమానించినట్టు ( నేను బభ్రువాహనుడు అంతటి వాణ్ణి కాదు లెండి!) పిలిచి మరీ తిట్టేవాడు. సో, పితృ దోషం కన్ఫర్మ్!

అలాగే ఆంధ్రపత్రిక డైలీలో, ఆంధ్రప్రభ వీక్లీలో, ” వెలుగు ప్రాజెక్ట్” లో అన్నిటిలో నా పై అధికారులతో తగువే! సో, ” పితృ దోషం” ఘట్టిగా కన్ఫర్మ్!

అయితే, ఎప్పటికప్పుడు ఒక దాని నుంచి బయట పడగానే మళ్ళీ ఎక్కడో దొరికేది అవకాశం! శ్రీ గురు కృప కాక మరేమిటి?

ఆంధ్రప్రభలో ఉన్నాన్నాళ్ళూ గురూజీ డాక్టర్ అనిల్ కుమార్ జోషిజీని కలుస్తూనే ఉండేవాడిని. కానీ ” వెలుగు ప్రాజెక్ట్” లో ఉన్న రెండున్నరేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా ఆయనను కలవలేదు! నెలలో దాదాపు పది, పదిహేను రోజులు ప్రయాణాలు, తిరిగి వచ్చాక రిపోర్టులు… అలా గడచిపోయింది కాలం!

” వెలుగు ప్రాజెక్ట్” అధ్యాయం అయిపోయాక ఆయన దగ్గరకు వెళ్ళాను రెండున్నరేళ్ల తరువాత. నిజానికి గురువును అంత కాలం కలవకుండా, అప్పుడు కలిస్తే గురువుకు ఎలా ఉంటుంది? కానీ నా గురువు ప్రేమమయ మూర్తి! వాత్సల్యానికి మారుపేరు!

అన్నేళ్ల తరువాత కలిసినా ఏదో నిన్ననే కలిసినట్టు మాట్లాడారు! విషయాలు అడిగి తెలుసుకున్నారు! అంతకన్నా శ్రీ గురు కృప వేరే ఏముంటుంది?

గురూజీని కలిసిన వారం, పది రోజులకే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు… “NTv మొదలు అవుతోంది. వాళ్ళే భక్తి టీవీ కూడా మొదలు పెడుతున్నారు. అక్కడ అడవి శ్రీనివాస్ అని ఉంటారు. ఆయన ఫోన్ నంబర్ ఇదీ. మీ గురించి చెప్పాను. ఫోన్ చేయండి” అదీ సారాంశం. ఫోన్ చేశాను. ఆయన ” భక్తి టీవీ లో మేడపాటిరామలక్ష్మి గారు ఉంటారు. నేను చెబుతాను. రేపు ఆవిడని కలవండి ” అని ఆవిడ నంబర్ ఇచ్చారు.

మరునాడు వెళ్ళాను. రామలక్ష్మి గారిని కలిశాను. భక్తి టీవీ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ అయింది. మళ్ళీ ఉద్యోగం వచ్చింది. భక్తి టీవీ లో       ” చీఫ్ కాపీ ఎడిటర్!” ఉద్యోగం! అప్పటివరకూ ప్రింట్ మీడియాలో ఉన్న నేను ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను!  అలా ” రంగం మారింది!”

గురువు చేయి వదిలేస్తాడా? NEVER!

” వెలుగు లో కొట్టుకుపోయిన మరో పి హెచ్ డి!” రేపు


Leave a comment