” వెలుగు’ లో కొట్టుకుపోయిన మరో పి హెచ్ డి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 85

“ప్రవాహ వాణి” సాహిత్య మాస పత్రిక నడుపుతున్న రోజులలో రచనల కోసం అనేక మందిని వ్యక్తిగతంగా కలుస్తూ వుండేవాడిని. ఆ క్రమంలో ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. అక్కడ ” తులనాత్మక అధ్యయన కేంద్రం” ఉంది. దానికి డైరెక్టర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ. అక్కడ శిఖామణి, మృణాళిని పని చేస్తున్నారు. ఆ రోజు యూనివర్సిటీ అంతా ఏదో హడావిడిగా ఉంది. ” ఏమిటి?” అని అడిగాను.

మృణాళిని చెప్పారు… ” పి హెచ్ డి అడ్మిషన్లు” అని. ఆ తరువాత మరో మాట కూడా చెప్పారు. ” మా డిపార్ట్మెంట్ లో ఒక సబ్జెక్టు పై చేయిద్దామని అనుకున్నాం. ఎవరూ ముందుకు రాలేదు. ఒకతను మొదలుపెట్టినా మధ్యలో వదిలేశాడు”.

” ఏమిటా టాపిక్?” అని అడిగాను.

” ఊర్వశి. రవీంద్రనాథ్ ఠాగూర్, రామ్ ధరీ సిన్హా ‘ దినకర్ ‘, కృష్ణశాస్త్రి  వ్రాసిన ఊర్వశి కావ్యాలపై కంపేరిటివ్ స్టడీ ” అన్నారు మృణాళిని.

” ఊర్వశి!” ఆ పేరు వినగానే నాకు ఉత్సాహం వచ్చింది. ఊర్వశి అందరికీ ఒక అప్సరస! కానీ నాకూ? ఆమె వశిష్ఠ, అగస్త్యుల తల్లి. మా గోత్ర ప్రవరలో మొదటి ఋషి వశిష్ఠుడు! అంటే ఊర్వశి మా ” గోత్ర మూలపురుషుడు” అయిన ఋషికి తల్లి! అంతకన్నా ” ఋషి ఋణం” తీర్చుకునే మార్గం ఏముంటుంది?

” నేను చేస్తాను!” అన్నాను.

” నాలుగు రోజులే టైమ్ ఉంది. సినాప్సిస్ తో సహా అప్లై చేయాలి” అన్నారు మృణాళిని.

అప్పటికే నేను కృష్ణశాస్త్రి, రవీంద్రనాథ్ ఠాగూర్ ( బెంగాలీ కవితకు హిందీ అనువాదం) చదివి ఉన్నాను. వాటికి తోడు శ్రీ అరవింద యోగి వ్రాసిన ” ఊర్వశి” కూడా చదివాను. కానీ రామ్ ధరీ సిన్హా ‘ దినకర్ ‘ కావ్యం చదవలేదు. ఒక మిత్రుడిని అడిగి తెప్పించుకుని చదివాను. దానికి తోడు ఊర్వశి గురించి వేదంలో  ఉంది. కనుక నిరుక్తం లో ఊర్వశి, పురూరవ శబ్దాల నిర్వచనాలు చూశాను. వాటన్నిటిని కలిపి సినాప్సిస్ తయారు చేసి అప్లై చేశాను.

ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. వెళ్ళాను. ఇంటర్వూ చేయటానికి ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం, ఆచార్య భీమసేన్ ‘ నిర్మల్ ‘ వచ్చారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ఉండనే ఉన్నారు.

ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం రావటం చూడగానే ” మనకి ఈ సీట్ రాదు!” అనుకున్నాను. ఎందుకంటే…

ప్రవాహవాణిలో ఆయన అనుంగు శిష్యుడు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య వ్రాసిన కొన్ని వ్యాసాలకు నేను ఖండనాత్మక విమర్శ వ్రాశాను.

ఇంటర్వ్యూ లో చాలా విశేషాలు జరిగాయి. “ఈ సీట్ రాదు” అనుకున్నాను కాబట్టి ఒకరకంగా ‘ అవినయం ‘ ప్రదర్శించాను.

ఇంటర్వ్యూ పూర్తి అయాక ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం నాకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట అన్నారు… ” తులనాత్మక అధ్యయనానికి మంచి సబ్జెక్ట్ దొరకటం కష్టం . సబ్జెక్ట్ దొరికినా మంచి కేండిడేట్ దొరకటం కష్టం. ఇప్పుడు మంచి సబ్జెక్ట్, మంచి కేండిడేట్ రెండూ దొరికాయి మీకు” అని లక్ష్మీనారాయణ గారితో చెప్పి, ” మంచి సబ్జెక్ట్. మీరు చేయగలరు, నాకు తెలుసు” అని నాతో అన్నారు.

అలా రెండవసారి పి హెచ్ డి కి తయారయ్యాను. ప్రీ పి హెచ్ డి అయిపోయింది. లక్ష్మీనారాయణ గారు స్కీమ్ ఆఫ్ స్టడీ ఇచ్చారు. అది నాకు మరొక మలుపు!

” వైదిక సాహిత్యంలో పురా ప్రతీకలు” మొదటి అధ్యాయం. ఆ రెండూ నాకు క్రొత్తవే! ” పురా ప్రతీకగా ఊర్వశి” రెండవ అధ్యాయం!

అప్పటి వరకూ వైదిక సాహిత్యం వైపు చూడలేదు. అలాగే పురా ప్రతీకలు గురించీ చదవలేదు. క్రొత్త అధ్యయనం ప్రారంభం అయింది.

చదువుతూనే ఉన్నాను. ఆ అధ్యయనం ఇంతకీ ఆగటం లేదు. వేద నిఘంటువు నిరుక్తం చూస్తున్న కొద్దీ దానిలో మునిగి పోతున్నాను కానీ బయట పడలేక పోతున్నాను.

ఒకసారి ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య మా ఇంటికి వచ్చారు. ఆయన నాకు చాలా చాలా సన్నిహితులు, హితైషి, సాహిత్య విషయాలలో మా గురువుగారు శరభయ్య గారి తరువాత మార్గదర్శి.

ఆయన అడిగారు… ” ఎంతవరకూ వచ్చింది?”

” తెమలటం లేదు సర్! చదువుతున్న కొద్దీ ఇంకా ఇంకా లోతులు కనిపిస్తున్నాయి” అన్నాను.

ఆయన నవ్వేసి ” మనకున్న జబ్బే అది! మునుగుతూనే ఉంటాం. అది మనం మనకోసం చదువుకునేటప్పుడు చేయాల్సిన పని. ఇప్పుడు కాదు. ఎక్కడో ఒకచోట ఆపి ముందుగా ఒక ఛాప్టర్ అయినా సబ్మిట్ చెయ్. అప్పుడు కానీ దారిలో పడవ్!” అన్నారు. నిజమేనని అనిపించింది. మొదటి ఛాప్టర్ వ్రాసి లక్ష్మీనారాయణ గారికి చూపించాను. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు.

రెండవ ఛాప్టర్ మొదలు పెట్టాను. ఇంతలో ” వెలుగు ప్రాజెక్ట్” లో ఉద్యోగం వచ్చింది! అంతే! ప్రయాణాలు, రిపోర్టులు, సమావేశాలు, శిక్షణలు… కాలం గడచిపోయింది!

అలా కాలం గడచిపోయి ఒక లెటర్ వచ్చింది… ” సమయం ముగిసి పోతోంది. ఫలానా తేదీ లోగా రెన్యువల్ కి అప్లై చేసుకోండి” అని. అప్పుడు నేను హైదారాబాద్ లో లేను. వెలుగు పని మీద టూర్ లో ఉన్నాను. ఆ తేదీకి తిరిగి రాలేక పోయాను. రెన్యువల్ చేసుకోలేక పోయాను.

అలా రెండవసారి పి హెచ్ డి ప్రయత్నం గాలిలో కలిసిపోయింది. “వెలుగు” వెలుగులో నా పి హెచ్ డి కి చీకటి కమ్మేసింది!

” భక్తి టీవీ ఒక క్రొత్త లోకం!” రేపు…


Leave a comment