స్వీయ అన్వేషణ – 86
భక్తి టీవీ… తెలుగు ఛానల్ ప్రపంచంలో ఒక సరిక్రొత్త ఆవిష్కరణ, ప్రయోగం, సంచలనం.
ఏ రంగంలో అయినా ” Early Bird Theory” ఒకటి ఉంటుంది. ఆ రంగంలో మొట్టమొదటగా అడుగు పెట్టిన వాడికి ఉండే అడ్వాంటేజ్ వేరు. అదే భక్తి టీవీ కి దక్కింది. ఆ తరువాత ఎన్ని భక్తి ఛానల్స్ వచ్చినా దానంత సక్సెస్ రాలేదు… చివరకు టి టి డి నడుపుతున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కి కూడా!
భక్తి టీవీ ఒక Fresh Air! దానిలో చేరిన ట్రెయినీలు అందరూ అప్పుడప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. వాళ్ళతో పాటు టివీ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. ఈ ప్రొడ్యూసర్స్ ” ముదుర్లు” అయినా, ట్రెయినీలు మాత్రం బుర్రలో ఏ చెత్తా, తుప్పూ లేని వాళ్ళు.
అలాటి చోట నేను చేరాను. నా పని ప్రధానంగా స్క్రిప్ట్స్ వ్రాయటం. చేరగానే నన్ను ప్రొడ్యూసర్ టి. శ్రీనివాస రావుకి అప్పగించారు. అతడు అప్పటికే పలు ప్రాంతాలలోని షిర్డీ సాయి మందిరాలను షూట్ చేసుకొని వచ్చాడు. వాటికి స్క్రిప్ట్ ఇవ్వటం నా మొదటి పని.
నిజానికి అంతకన్నా సులువైన పనీ ఉండదు, విసుగొచ్చే పనీ మరొకటి ఉండదు. ఎందుకు? దేశంలో ఎక్కడ చూసినా షిర్డీ సాయి మందిరాలు ఒకేలా ఉంటాయి. అవన్నీ శిర్డీలోని మందిరం నమూనాలోనే ఉంటాయి. ఏ మార్పూ ఉండదు. ఒక శిల్పం ఉండదు, ఒక వైచిత్రి ఉండదు, ఒక వైలక్షణ్యం ఉండదు. ఏమి వ్రాయాలి? ఆ మందిరం ఏ ఊరిలో ఉంది? ఎవరు కట్టారు? అంతే… ఇక ఏ మందిరంలో జరిగే కార్యక్రమాలు అయినా ఒకేలా, షిర్డీ పద్ధతిని అనుసరిస్తూ ఉంటాయి కనుక అక్కడ కూడా క్రొత్తగా చెప్పేది ఏమీ వుండదు.
So, ఏదో క్రొత్తగా చెప్పాలి! ఏం చెప్పాలి? సాయి సచ్చరిత్ర ఆధారం చేసుకున్నాను. ఆ మందిర విశేషాలు చెప్పేటప్పుడు సాయి చరిత్రలోని సంఘటనలు అన్వయిస్తూ స్క్రిప్ట్ తయారు చేశాను. సరి పోయింది.
ఒక ఛానల్ లో పని చేయటం అదే మొదటిసారి నాకు. ప్రొడ్యూసర్ శ్రీనివాస రావు నాకు చాలా విషయాలు చెప్పాడు.
ఎక్కడ చేరినా దానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటం అలవాటు. కనుక వీడియో ఎడిటింగ్ దగ్గర ప్రొడ్యూసర్ తో పాటు నేనూ ఉండేవాడిని. అలా వీడియో ఎడిటింగ్ గురించి ఒక అవగాహన ఏర్పడింది.
నా గురించి అలా ఉంచి, ట్రెయినీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దాదాపు ఎక్కువమంది యువతులే. నేను ఎక్కువగా పని చేసినది ప్రొడ్యూసర్ శ్రీనివాస రావు, ట్రైనీ లావణ్య లతో. నాతో పాటు మరొక చీఫ్ కాపీ ఎడిటర్ గా డాక్టర్ రామకృష్ణ కూడా చేరారు.
ఎడిటింగ్ దగ్గర నేను ఎక్కువగా కలసి పని చేసినది సుబ్బు ( సుబ్రహ్మణ్యం), రవి, గణేశ్ లతో. తరువాత ఆ జాబితాలో వర్మ చేరాడు.
కాలక్రమంలో నేను చూసే కార్యక్రమాల జాబితా పెరిగింది. ప్రతిరోజూ తిరుమల నుంచి వచ్చే ఫుటేజ్ తో ” నిత్యోత్సవం”, ఆదివారం నుంచి శుక్రవారం వరకూ దేవాలయాల విశేషాలతో ” దర్శనం”, శని, ఆదివారాల్లో ” మహా దర్శనం” ఇలా ఎన్నో కార్యక్రమాలు నా చేతికి వచ్చాయి. కాలక్రమంలో వారానికి 22 గంటల కార్యక్రమాలు నా చేతికి వచ్చాయి. ఇవి కాక కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వచ్చేవి. ఇది భక్తి టీవీ లో నా ప్రవేశ ఉపోద్ఘాతం మాత్రమే!
” కథ మొదలు పెడదాం!” రేపు
Leave a comment