” కథ మొదలు పెడదాం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 87

భక్తి టీవీ లో నేను చేరగానే ప్రోగ్రామింగ్ హెడ్ మేడపాటి రామలక్ష్మి గారు ఒక మాట అడిగారు … ” మేము ‘ య ఏవం వేద!’ అని ఒక ప్రోగ్రాం అనుకున్నాం. దానికి కంటెంట్ ఎలా ?”

నేను అప్పటికే హెరాల్డ్ అబ్రహాం మాస్లో అనే మనస్తత్వ శాస్త్రవేత్త ప్రతిపాదించిన ” హయరార్కీ ఆఫ్ నీడ్స్” గురించి చదువుతున్నాను. నాకు ఆయన ప్రతిపాదించిన ” మానవ జీవన అవసరాల”కు సమాధానాలు వైదిక సాహిత్యంలో ఉన్నాయని అర్థమైంది. నిజంగా వేదం సార్వకాలికమూ, సార్వజనీనమూ అయితే, మానవ కళ్యాణానికి మార్గదర్శి అయితే మాస్లో ప్రతిపాదించిన ” మానవ జీవన అవసరాల”ను పూర్తి చేయాలి. కనుక ఆయన ప్రతిపాదించిన ఆ అంశాలకు వేదంలో నుంచి సమాధానాలతో ఆ కార్యక్రమం రూపొందిస్తే అది అప్పటివరకూ ఎవరూ ముట్టుకోని కార్యక్రమం అవుతుంది. ఆ విషయమే రామలక్ష్మి గారికి చెప్పాను. మాస్లో ప్రతిపాదనను కూడా వివరంగా అందించాను.

” కరెక్టే! కానీ దీని గురించి చెప్పేవారు ఎవరున్నారు?” అని అడిగారు.

నాకు ఒకాయన గుర్తుకు వచ్చారు… ఆయన పేరు రాణి రామకృష్ణ. ఆయన ప్రసంగాలు నేను ఆంధ్రపత్రికలో ఉన్నప్పటి నుంచీ వింటున్నాను. అనంతర కాలంలో ఆయన ” స్వామీ తత్వవిదానంద” దీక్షానామంతో సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆయన ఉద్యోగ జీవితంలో సైంటిస్ట్. వంశ పారంపర్యంగా సంప్రదాయ వైదిక విద్యలో శిక్షణ ఉన్నవారు. ఆయన దీనికి తగినవారు అనిపించింది. అదే చెప్పాను.

భక్తి టీవీ లో లక్ష్మీ దివాకర్ బాబు అనే ప్రొడ్యూసర్ ఒకరు ఉన్నారు. ఆమె సినీ రచయిత దివాకర్ బాబు భార్య. భక్తి టీవీ లో సంగీత, నృత్య కార్యక్రమాలు చూసేవారు. రామలక్ష్మి గారు, లక్ష్మీ దివాకర్ బాబు ఇద్దరూ వెళ్ళి ఆయనను కలిశారు. నేను ఇచ్చిన పేపర్స్ తీసుకువెళ్ళారు. వారు అక్కడ ఏమి మాట్లాడారో నాకు తెలియదు. ఆయన ఏమి చెప్పారో తెలియదు. ఆ కార్యక్రమం ఖరారు అయింది.

తీరా మూడు నాలుగు ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి అయి, ఎడిటింగ్ కి వచ్చేసరికి అది నేను ఇచ్చిన ప్రతిపాదన కాదని అర్థమైపోయింది!

మానవ జీవన అవసరాలకు “వేదం” ఏ సమాధానం, ఏ పరిష్కారం చూపిస్తుంది అనే దాని నుంచి “ఇతిహాస”మైన శ్రీమద్రామాయణం లోని ఆదిత్యహృదయం కార్యక్రమంగా మారిపోయింది. ఆదిత్య హృదయం లోని సూర్య విజ్ఞాన వివరణ అయింది. అది అనవసరం అని నేను అనటం లేదు. సూర్యునికి ఎన్ని కిరణాలు ఉన్నాయి? వాటి తత్వం ఏమిటి? వంటివి ఈనాటి మనిషి మనసుకు ఎక్కవు. ఈనాటి మనిషి తన అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ అవసరాలకు వేదం లేదా మన ఇతర ఋషి దర్శనాలలో ఏమి సమాధానం ఉంది? అనేది చెప్పగలిగితే మన విజ్ఞానం పట్ల ఈనాటి మనిషికి ఆసక్తి కలుగుతుంది. వాటిని అనుసరించే అభిరుచి కలుగుతుంది. ఆ విధంగా మన సంస్కృతి, సంప్రదాయం బలపడతాయి అన్నదే నా ఉద్దేశ్యం. అది నెరవేరలేదు. అప్పుడే అనుకున్నాను… ఈ అంశం వదలకూడదు… ఎప్పటికైనా దీనిని కనీసం పుస్తకరూపంలో అయినా తీసుకు రావాలి… అని. ఆ పని కొంత వరకూ సాగి, ప్రస్తుతం విరామ దశలో ఉంది. శ్రీ గురు కృప ఉంటే… చూద్దాం!

” పేర్లు పోయాయి!” రేపు…


Leave a comment