స్వీయ అన్వేషణ – 88
సాధారణంగా ఛానల్ లో ఒక కార్యక్రమం చేయాలి అంటే ఒక ప్రొడ్యూసర్, ( ఒక్కొక్కసారి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తో కలిసి, ఒక్కొక్కసారి కేవలం అసిస్టెంట్ ప్రొడ్యూసర్ ఒక్కరే ), కార్యక్రమం స్వరూపాన్ని బట్టి ఒకరిద్దరు లేదా ఇంకా ఎక్కువమంది కెమెరామెన్ ( ఛానల్స్ లో ఉన్న వాళ్ళు ” కెమెరామెన్” అనరు… ” కెమెరామేన్స్” అంటూ ఉంటారు. వాళ్ళకి పాఠాలు చెప్పిన ఇంగ్లీషు టీచర్ కి దణ్ణం పెట్టాలి), ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక ఎడిటర్, ఇన్ పుట్ ఎడిటర్, ఔట్ పుట్ ఎడిటర్, పి సి ఆర్, ప్రోగ్రామింగ్ హెడ్ ఇంతమంది కలసి పని చేయాలి, కష్టపడాలి. వాళ్ళకి ఆ కార్యక్రమం క్రెడిట్స్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి! అది కనీస మర్యాద.
హోదా రీత్యా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అయినా ఒక కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహిస్తే దాని వరకూ ప్రొడ్యూసర్ క్రిందే లెక్క. మొదట్లో ఆ క్రెడిట్స్ అందరికీ ఉండేవి భక్తి టీవీ లో. ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారికి ఆ మర్యాద తెలుసు కనుక ఆ క్రెడిట్స్ దక్కేవి.
NTv, భక్తి టీవీ ప్రక్క ప్రక్క బిల్డింగ్స్ లో ఉండేవి. ఒక రోజు పదకొండు గంటల వేళ ఆ ఛానల్ ” యజమాని” నరేంద్ర చౌదరి భక్తి టీవీ కి వచ్చారు. హాల్ లో ఒక టీవీలో భక్తి టివి కార్యక్రమాలు ప్లే అవుతూ ఉండేవి. ఆయన వచ్చే వేళకు ఒక కార్యక్రమం అప్పుడే అయిపోయి క్రెడిట్స్ పడుతున్నాయి. ప్రొడ్యూసర్ అని ఒకమ్మాయి పేరు కనిపించింది. “ఎవరిది?” అని అడిగారు ప్రక్కన ఉన్న వారిని. ” అసిస్టెంట్ ప్రొడ్యూసర్” అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు.
మరునాడు ఉదయం ఆఫీస్ ప్రారంభం కాగానే ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారు స్టాఫ్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో చెప్పిన విషయం ఏమిటీ అంటే “అప్పటినుంచీ ఎవరి పేర్లూ పడవు. కేవలం ‘ నిర్మాణ నిర్వహణ నరేంద్ర చౌదరి ‘ అని మాత్రమే ఉండాలి”!
అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి అనుకున్నారు. ఆమె చెప్పారు…” ఇది ఛైర్మన్ డెసిషన్”.
“అలా అయితే మేము ఈ కార్యక్రమం చేశాము అని ఎలా చెప్పుకుంటాం? ఒకవేళ వేరే ఛానల్ కి వెడితే చెప్పుకోవడానికి ఏముంటుంది?” అని ఉద్యోగుల ప్రశ్న.
ఆమె మాత్రం ఏమి చెప్పగలరు? ఆమె కూడా ఉద్యోగియే! కాకపోతే మా అందరికన్నా పైనుండే పెద్ద ఉద్యోగి! ఛైర్మన్ చేసిన పాలసీ డెసిషన్! ఆనాటి నుంచీ కార్యక్రమాలలో ఎవరి పేర్లూ లేవు. ” నిర్మాణ నిర్వహణ నరేంద్ర చౌదరి ” అంతే!
ఆయన తీరే వేరు. డే షిఫ్ట్ వాళ్ళు సాయంత్రం అయిదు కాగానే వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు ఆ టైమ్ కి వచ్చి టైమ్ ఆఫీస్ లో కూర్చునే వారు. టైమ్ ఆఫీస్ అంటే ఏమీ లేదు. భక్తి టీవీ ఎంట్రెన్స్ దగ్గర ఒక కుర్చీ, టేబుల్. ఆ టేబుల్ మీద ఒక రిజిస్టర్. డ్యూటీకి వచ్చినప్పుడు, అయిపోయిన తరువాత వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఉద్యోగి తన పేరు, వచ్చిన లేదా వెడుతున్న టైమ్ వేసి సంతకం పెట్టాలి. ఈయన వచ్చి ఆ కుర్చీలో కూర్చునేవారు. ఎవడు వెడతాడు ఆయన ఎదురుగా? అంత ” దమ్ము” ఎవడికి ఉంటుంది? ఒకవేళ వెడితే సంతకం పెట్టేలోపు పెద్ద ఇంటరాగేషన్ మొదలవుతుంది కదా? అందరూ ఆయన అక్కడినించి వెళ్లేవరకూ కుక్కిన పేనుల్లా లోపలే పడి ఉండేవాళ్ళు! ఎప్పుడో, ఎవడో నాలాంటి వాడు ( ఆయన దృష్టిలో పొగరుబోతు) ఆ ” లక్ష్మణ రేఖ” దాటేవాడు! ఎప్పుడో, ఎవడో కాదు… ఎప్పుడూ నేనే! బొత్తిగా భయభక్తులు లేవు మరి నాకు.
నాకు ఒక దురలవాటు ఉందని ముందే చెప్పాను కదా? నా పై అధికారి ఎదురు పడితే విష్ చేస్తాను. అలా మరో రెండు సార్లు… అంతే… ఆ మూడు సందర్భాలలో కనీసం ఒక చిరునవ్వు అయినా నవ్వితే విష్ చేయటం కంటిన్యూ చేస్తాను. ఆ మూడు సందర్భాలలో నన్ను నెగ్లెక్ట్ చేస్తే… అంతే… మళ్ళీ ఎన్నిసార్లు ఎదురుపడినా ఆ వ్యక్తిని నేనూ నెగ్లెక్ట్ చేసేస్తాను. ” నన్ను పట్టించుకోని వాడు ఎంతటి వాడైనా నాకేవిటీ?నేనూ పట్టించుకోను”. మర్యాద అనేది వన్ సైడ్ కాదు. డిమాండ్ చేస్తేనో, భయం కలిగిస్తేనో వచ్చేది కాదు. దానిని సంపాదించుకోవాలి. క్రింది ఉద్యోగుల నుంచి గౌరవ మర్యాదలు పొందే “అర్హత” సాధించుకోవాలి.
” అలా వెళ్లి పోతారేమిటీ?” అని అడిగారు కొందరు.
“మహా అయితే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది? అంతేగా!” అన్నది నా జవాబు. అంతే కానీ ఆ మనిషి వాష్ రూమ్ లో ఉన్నాడని ఎంత అర్జెన్సీ ఉన్నా ఉగ్గబట్టుకొని బయట దూరంగా ” ఎప్పుడు బయటకు వస్తాడో?” అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చునే బ్యాచ్ కాదు కదా మనం?!
అసలు మాట్లాడే తీరే వేరు! బహుశః మీడియా సంస్థల ” యజమానులు” అందరూ అంతేనేమో! ఎదుటివాడు మనిషిలా కనపడదు. ఆసామి ఇంటి ” పాలేరులే” అందరూ అక్కడ.
భక్తి టీవీ హాల్ లో ఒకవైపు మూడు, వాటిని ఆనుకొని ఎదురుగా ఒకటి… మొత్తం నాలుగు ఎడిట్ సూట్లు ఉండేవి. ఆ నాలుగో ఎడిట్ సూట్ నా అడ్డా! ఒకరోజు సాయంత్రం నాలుగు గంటల వేళ నేను, సహోద్యోగి జగదీశ్, అప్పట్లో కుసుమ హరనాథ్ కి సంబంధించిన కమర్షియల్ ప్రోగ్రాం చేస్తున్న బయటి వ్యక్తి మాట్లాడుకుంటున్నాం. ఏదో సబ్జెక్ట్ మీద మా మధ్య డిస్కషన్ సాగుతోంది. అప్పుడు వచ్చారు ఆయన. మేమందరం ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం అనుకున్నట్టున్నారు.
” ఏవయ్యా! ఏం చేస్తున్నారక్కడ?” అని దురుసుగా అడిగారు. కుసుమ హరనాథ్ ప్రోగ్రాం చేస్తున్న వ్యక్తికి ఆయన ఎవరో తెలియదు. నేను కుర్చీ లోనుంచి లేవలేదు. అతను ఎడిట్ సూట్ గుమ్మ దగ్గర నిలబడి ” వి యార్ డిస్కసింగ్ ఎ ప్రోగ్రాం. ఏం? ఏం కావాలి?” అన్నాడు. నాకు నవ్వు ఆగటం లేదు. జగదీశ్ సూట్ లోపలి వైపు వెళ్ళిపోయాడు.
ఆయనకు ఖచ్చితంగా ఎక్కడో కాలిపోయే ఉంటుంది. ” నువ్వెవరు?” అన్నారు. ” స్పాన్సర్డ్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ని” అన్నాడు ఇతగాడు. ఇంకేమంటాడు? డబ్బులిస్తున్న వాడాయే! విసవిసా బయటకు వెళ్ళిపోయాడు. స్పాన్సర్ సొమ్ము వదలుకుంటాడా ఏ పెట్టుబడిదారుడు అయినా? ఆయన అటు వెళ్ళగానే నాలుగో ఎడిట్ సూట్ నవ్వులమయం అయిపోయింది. ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారు అప్పుడు లేరు కనుక ఆమెకు ఇదేమీ తెలియదు. ఇప్పటివరకూ ఆమెకు తెలియదు కూడాను. ఎవరు చెబుతారు? చెప్పరు కదా?
” గర్ల్ ఫ్రెండ్ మొహం ఎంతసేపు చూస్తావ్? విసుగెత్తదా?” రేపు…
Leave a comment