“భక్తి” కి గుడ్ బై!

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 92

భక్తి టీవీ లో హాయిగా ఉండేది. అంతా ఒక కుటుంబంలా ఉండేది. ఇతర ఛానల్స్ లో పని చేసి ఇక్కడ చేరిన ” ముదురు”లను ప్రక్కన పెడితే, క్రొత్తగా అప్పుడే కాలేజ్ చదువులు పూర్తి చేసుకుని వచ్చి, ట్రెయినీలుగా, తరువాత అసిస్టెంట్ ప్రొడ్యూసర్లుగా చేరిన వాళ్ళు మాత్రం “జెమ్స్!” అంటే ఆ “ముదురు”లు పనికిరాని వాళ్ళు అని కానే కాదు. వాళ్ళ టివీ అనుభవం ఈ క్రొత్త వాళ్ళకి… నాతో సహా… ఒక అద్భుతమైన పాఠం. శ్రీనివాసరావు వంటి సీనియర్ల గైడెన్స్ నాకు కూడా చాలా ఉపకరించింది. లావణ్య, వీణ మునిపల్లె, నితీశ్, రాజ్ కుమార్ ( ఇతనికి భక్తి క్రొత్త), జగదీశ్( స్క్రిప్ట్ రైటర్), సాయి ప్రసన్న, వీరబాబు ( గ్రాఫిక్స్ ఆర్టిస్టు) వంటి వాళ్ళ ఉత్సాహం, నిబద్ధత సీనియర్లకు కూడా ఉత్సాహాన్ని కలిగించేది. వాళ్ళతో పోటీ పడేట్టు చేసేవి. ఈ క్రొత్త వాళ్ళు అతి త్వరగానే ఇండిపెండెంట్ గా ప్రోగ్రామ్స్ చేశారు.

వీడియో ఎడిటర్లు రవి, సుబ్బు, వర్మల దగ్గర నేను అక్కడే ఎడిటింగ్ నేర్చుకున్నాను. భక్తి టీవీలో నేను నేర్చుకున్న పాఠాలు, టెక్నికల్ విషయాలు ఈ రోజు నేను యూ ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాక షూటింగ్, ఎడిటింగ్ అన్నీ స్వయంగా నేనే చేసుకునే పునాది వేశాయి. భక్తి టీవీలో పిల్లలు, పెద్దలూ కొందరు ఈ రోజుకీ నాతో మాట్లాడుతూనే ఉన్నారు అంటే అదంతా వారి అభిమానం. అంతకన్నా అదృష్టం ఏముంటుంది?

బహుశః రెండేళ్లు గడిచాయి అనుకుంటాను… ఇంక్రిమెంట్స్ టైమ్.

సాధారణంగా ఇంక్రిమెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎవరి ఉద్యోగ స్థాయిని బట్టి ఒక నిర్దిష్ట మొత్తం ఇవ్వటం కాగా రెండవది పెర్ఫార్మెన్స్ బేస్డ్.  ఉద్యోగుల  పని తీరును అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇంక్రిమెంట్ ఇవ్వటం.

పై నుంచి వచ్చిన సూచన ప్రకారం రెండవ విధానాన్ని అనుసరించాలి. అంటే ఉద్యోగుల పని తీరు, వారి ఔట్ పుట్, దాని క్వాలిటీ ఆధారంగా ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనేది నిర్ణయించాలి. ఆ రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ప్రోగ్రామింగ్ హెడ్. సరే! ఏదో నివేదిక వెళ్ళింది. చివరికి ఇంక్రిమెంట్స్ అనౌన్స్ అయాయి.

భక్తి టీవీలో నాతో పాటుగా డాక్టర్ రామకృష్ణ అని మరొక చీఫ్ కాపీ ఎడిటర్ ఉన్నారు.

వీడియో ఎడిటర్లకు, ప్రొడ్యూసర్లకు అందరికీ వారి పని తీరు, ఔట్ పుట్, దాని క్వాలిటీ ఆధారంగా ఇంక్రిమెంట్స్ వచ్చాయి.

నాకూ, రామకృష్ణ గారికి ఒకే రకమైన ఇంక్రిమెంట్ వచ్చింది! అది నాకు నచ్చలేదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా ” హర్ట్” అయాను. ఎందుకు?

నేను వారానికి 17 నుంచి 20 గంటల  కార్యక్రమాలు ఇచ్చేవాడిని. ఆయన 6 నుంచి 7 గంటల కార్యక్రమాలు ఇచ్చేవారు. ఇద్దరికీ ఒకే ఇంక్రిమెంట్ ఎలా ఇస్తారు? ఇది చేసిన పనికి అవమానం అనిపించించింది. వీడియో ఎడిటర్లకి, ప్రొడ్యూసర్లకు ఒక రూలు, మాకు ఒక రూలా?

ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారిని కలిసాను. ” నాకు ఈ ఇంక్రిమెంట్ వద్దు!” అని చెప్పాను. కారణం కూడా చెప్పాను.

ఆమె చేతిలో మాత్రం ఏముంది? “నేను మాట్లాడి చూస్తాను” అన్నారు.

” ఇంక్రిమెంట్ పెంచాలి అంటే మాట్లాడాలి కానీ ఇంక్రిమెంట్ వద్దు అనటానికి మాట్లాడేది ఏముంటుంది? కావాలంటే డైరెక్టర్ బి. ఎల్. రావు గారికి నేనే చెబుతాను” అన్నాను.

” తొందర పడకండి!” అన్నారు ఆమె.

నాకు తెలుసు… ఈ విషయంలో ఆమె చేయగలిగింది ఏమీ లేదు!

కొన్నాళ్ళు చూశాను. ఏమీ జరగలేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. ఆంధ్రప్రభలో వాకాటి వారు ఒక మాట చెప్పారు… ” జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడే రిజిగ్నేశన్ లెటర్ జేబులో పెట్టుకోవాలి!” అదే చేశాను. రాజీనామా చేయాలి అంటే  నెల రోజుల నోటీసు ఇవ్వాలి.

ఒక రోజు రాజీనామా లేఖ పట్టుకు వెళ్లి రామలక్ష్మి గారికి అందించాను. ” ఆలోచించండి మరోసారి!” అన్నారు. ” లేదు మేడమ్! ఇది ఫైనల్” అన్నాను. ” పంపేయమంటారా?” అని మళ్ళీ అడిగారు. ” పంపేయండి” అని చెప్పేశాను.

నెల రోజుల నోటీస్… లెటర్ పైకి పంపారు. ” వెంటనే రిలీవ్ చేయండి!” అని సమాధానం.

వచ్చేశాను. అలా భక్తి టీవీ అధ్యాయం ముగిసిపోయింది.

అక్కడ పనిచేస్తున్న వారందరితో ఏర్పడిన అత్మీయ అనుబంధాన్ని తెంచుకురావటం బాధాకరమే… కానీ… చేసిన పనికి గుర్తింపు లేదు సరికదా అవమానం జరిగిన చోట నిలువరాదు!

“ఎస్ వి బి సి లోకి…” రేపు


Leave a comment