స్వీయ అన్వేషణ – 93
భక్తి టీవీ నుండి బయటకు వచ్చాక మళ్ళీ ఖాళీ! మొదట్లో ఆరు, ఆరున్నరేళ్ళకు ఒకసారి విరామం వచ్చేది…ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ అంతే! తరువాత రెండు, రెండున్నరేళ్ళకు షిఫ్ట్ అయింది! ఇదో సైకిల్!
ఎస్ వి బి సి లోకి రమ్మని సి ఇ ఓ కె.ఎస్. శర్మ గారు అన్నారు కదా? అదో పెద్ద ప్రహసనం అయిపోయింది. ఆయనతో మాట్లాడి నాలుగు నెలలు అయింది. ఈ నాలుగు నెలలు నాకు నరకం!
నెలకు ఒకసారి లేదా రెండు సార్లు ఈఓ రమణాచారి హైదారాబాద్ వచ్చేవారు. ఆయనతో పాటు వేంకట శర్మ కూడా వచ్చే వారు. అలా వచ్చినప్పుడల్లా వేంకట శర్మ నాకు ఫోన్ చేసేవారు. ” ఈఓ వచ్చారు. ఒకసారి రండి!” అని. రమణాచారి తో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకొని వెళ్లే వాడిని. ఏవో కాలక్షేపం కబుర్లు సాగేవి. చివర్లో ఒక మాట మాత్రం వచ్చేది… నీ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంది! అంతే. ఆ నాలుగు నెలలు ఇలాగే కలవటాలూ, కబుర్లు చెప్పుకోవటాలూ, చివరలో ఈ మాట వినటం! ఒక్కొక్కసారి చివరి డైలాగ్ మారేది… ” ఏమిటో వల్లభా! ప్రతి మీటింగ్ లో నీ ప్రస్తావన వస్తుంది. మళ్ళీ ఎందుకో డైవర్ట్ అయిపోతోంది!”. అది ఎందుకో నాకూ తెలుసు, ఆయనకీ తెలుసు!
నాకు చాలా విసుగ్గా ఉండేది. మా ఇంటి దగ్గర సరూర్ నగర్ లో ఒక శ్రీవేంకటేశ్వరాలయం ఉంది. తరచుగా అక్కడికి వెళ్ళటం నాకు అలవాటు. ఈ విసుగులోనే ఒకసారి వెళ్ళినప్పుడు ” ఏమిటయ్యా ఈ గోల? ఏదో ఒకటి తేల్చెయ్!” అనుకున్నాను.
ఆ మరునాడు హైదారాబాద్ హిమాయత్ నగర్ లో ఉన్న బాలాజీ భవన్ లో ఒక గొడవ జరిగింది. అక్కడ ఉన్న కాటేజెస్ లో మందు సీసాలు దొరికాయి. మీడియా గగ్గోలు పెట్టింది. ఈఓ వచ్చారు. షరా మామూలే… ఆయనతో పాటు వేంకట శర్మ కూడా వచ్చారు. ఆ గొడవ జరిగిన మరునాడు వీరిద్దరూ వచ్చారు.
ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని సి ఇ ఓ కె.ఎస్. శర్మ గారు ఇంటికి వెళ్లిపోయారు. నేను విన్నది ఏమిటంటే “ఆయన ఇంటికి వెళ్ళిపోయాక ఒక అటెండర్ చేత ఆయన నెల జీతం ఇంటికి పంపారని, దానితో పాటుగా ” రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదు” అనే టెర్మినేషన్ లెటర్ కూడా పంపార”ని విన్నాను. ఇది ఎస్ వి బి సి లో ఉన్నవారు చెప్పిన విషయం. అదే నిజం అయిఉంటే శర్మ గారి వంటి వారికి జరిగిన ఆ అవమానం ఘోరమైనది.
ఆ మరునాడు వేంకట శర్మ నాకు ఫోన్ చేశారు. వెళ్ళాను. ఉదయం పది గంటలకు రమ్మన్నారు. వెళ్ళాను. పదకొండు, పన్నెండు, ఒంటి గంట… వెయిటింగ్. లోపల ఏదో మీటింగ్ ట! మధ్యలో వేంకట శర్మ బయటకు వచ్చారు. ” నేను వెళ్ళిపోతున్నాను. పది గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు ఒంటి గంట. నా భోజనం వేళ. సో, వెడుతున్నాను” అని చెప్పేశాను.
” భోజనం చేసి వచ్చేయ్. ఈఓ ఇవాళ నిన్ను కలవాలి అన్నారు” అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. భోజనం చేసి వెళ్ళాను. నాకు కూడా ఏదో ఒకటి తేలిపోతే ఈ గోల వదలిపోతుంది అనిపించి.
మూడు గంటలకు వేంకట శర్మ బయటకు వచ్చి ” ఈఓ పిలుస్తున్నారు” అంటూ లోపలికి తీసుకువెళ్ళారు. లోపల ఈఓ, సిఓఓ సి.జె.రెడ్డి, వేంకట శర్మ, నేనూ… అంతే. ఈఓ చేతిలో ఒక కాగితం. అదేమిటో నాకు తెలుసు. దానిని ఇంతకుముందు నేను చూశాను. అది కె.ఎస్.శర్మ గారు తయారు చేసిన నా అపాయింట్మెంట్ ఆర్డర్.
” సో, ఎస్ వి బి సి కి వస్తున్నావ్?” అన్నారు ఈఓ.
“అది మీ డెసిషన్” అన్నాను
” భక్తిలో ఎంత వస్తోంది?”
” పాతిక వేలు”.
” ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్?”
” నేను వేంకటేశ్వర స్వామితో బేరాలాడను!”
ఆ కాగితం సి.జె.రెడ్డి కి అందిస్తూ ” ముప్ఫై వేలు. ఆర్డర్ ఇచ్చేయండి. అపాయింట్ మెంట్ తిరుపతిలో!” అన్నారు ఈఓ.
నేనేమీ మాట్లాడలేదు. కాసేపు ఏవో మాటలు అయాక బయటకు వచ్చేశాను. మరొక గంటలో ఆర్డర్ రెడీ. ” రేపు బయలుదేరి వెళ్లి జాయిన్ అయిపొండి!” సి జె రెడ్డి అన్నారు.
అదీ సంగతి! అప్లికేషన్ ముందు సిఇఓ కి ఇచ్చి, దాని కాపీ ఈఓ కి ఇచ్చాను. దాని మీద ఏదో వ్రాయటానికి పెన్ చేతిలోకి తీసుకొని , ఆ విషయం తెలియగానే పెన్ పక్కన పెట్టేసినప్పుడే ఒక సంగతి అర్థమైంది. చివరికి సిఈఓ వెళ్ళిపోయాక, ఈ ఓ తన చేతుల మీదుగానే ఆర్డర్ అందేట్టు చేశారు! అదీ ఐ ఎ ఎస్ దెబ్బ!
ఇంటికి వచ్చేశాను. తిరుపతిలో ఉద్యోగం. ఆఫీస్ అలిపిరి దగ్గర భూదేవి కంప్లెక్స్ ఎదురుగా ఆఫీస్. తిండి తినాలంటే రెండు మూడు కిలోమీటర్లు పోవాలి.
సరూర్ నగర్ ఆలయానికి వెళ్ళాను. ” తేల్చేశావ్ బానే ఉంది. కానీ తిండి దొరకని అడవిలో పారేశావేమిటీ?” అనుకున్నా. అక్కడి నుంచి వెళ్లి మరునాటి రాత్రికి తిరుపతికి బస్ టికెట్ బుక్ చేసుకున్నాను.
మరునాడు మళ్ళీ సి జె రెడ్డిని కలిసి ఆ రోజు సాయంత్రం వెడుతున్నాను అని చెబుదామని ఆటోలో బయలుదేరాను. సరిగ్గా భవన్స్ కాలేజ్ దగ్గరకు వెళ్లేసరికి ఒక ఫోన్ వచ్చింది… ” టెక్నికల్ ఇష్యు వల్ల బస్ కేన్సిల్ అయింది. మీరు టికెట్ బుక్ చేసిన చోటికి వెళ్లి డబ్బులు వాపస్ తీసుకోండి”. మళ్ళీ ఇదో ట్విస్ట్!
ఆఫీస్ కి వెళ్లి సి జె రెడ్డిని కలిశాను. జరిగింది చెప్పాను. ఆయన ” కాస్త వెయిట్ చేయండి” అన్నారు. రెండు గంటలు గడచిపోయాయి. రెడ్డి గారు పిలిచారు. ” మీరు తిరుపతి వెళ్ళ వలసిన అవసరం లేదు. ఇక్కడే మీ పోస్టింగ్. రేపు జాయిన్ అయిపొండి ” అంటూ క్రొత్త ఆర్డర్ చేతిలో పెట్టారు!
” స్వామీ” అనుకున్నాను. పోస్టింగ్ ఇక్కడే… హైదారాబాద్ లోనే… హిమాయత్ నగర్ లోనే… చుట్టూ ” తిండే”! అలా హైదారాబాద్ లో ఎస్ వి బి సి లో చేరాను. “కంటెంట్ మోనిటర్ హెడ్” అని పోస్టింగ్. అడగ్గానే కోరికలు తీర్చేస్తాడు ఆ శ్రీనివాసుడు!
రేడియోలో ప్రఖ్యాతులైన ప్రయాగ రామకృష్ణ గారికి నేను రిపోర్ట్ చేయాలి. ఆయన ఒక స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు. అది నటుడు అశోక్ కుమార్ సీరియల్ కోసం సమర్పించిన స్క్రిప్ట్. ” భక్త పోతన సీరియల్! ” ఇది చదివి మీ రిపోర్ట్ రాసి ఇవ్వండి” అన్నారు ప్రయాగ.
చదివాను. చాలా అభ్యంతరాలు కనిపించాయి. మంచి సన్నివేశాలూ ఉన్నాయి. అవన్నీ వ్రాసి ఒక రిపోర్ట్ వ్రాశాను. అది అందిద్దామంటే ప్రయాగ ఆఫీస్ కి రాలేదు. మూడు నాలుగు రోజులు గడిచినా రాలేదు. చివరికి వారం గడచిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. సిజె రెడ్డికి చెప్పాను. ” ఆయన మానేశారు. ఇవాళ్టి నుంచీ ప్రోగ్రామింగ్ హెడ్ శశిధర్ కి రిపోర్ట్ చేయండి” అన్నారు. ఆ సీరియల్ రిపోర్ట్ శశిధర్ కి ఇచ్చాను. ఆ తరువాత ఆ స్క్రిప్ట్ సబ్మిట్ చేసిన అశోక్ కుమార్ తో మాట్లాడి, నా దగ్గర ఉన్న వీరభద్ర విజయం కావ్యం కూడా ఇచ్చి, కొన్ని మార్పులు చేయించాం.
అలా వారం పది రోజులు గడచిపోయాయి. మరో మార్పు… హిమాయత్ నగర్ బాలాజీ భవన్ లో ఉన్న ఎస్ వి బి సి ఆఫీస్ అక్కడి నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణం లోకి షిఫ్ట్ అయిపోయింది!
” మునిగిపోయిన మూడో పి హెచ్ డి!” రేపు…
Leave a comment