“మునిగిపోయిన                                      మూడో పిహెచ్ డి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 94

ఈ తతంగాల మధ్యలో మరో సంఘటన జరిగింది. మిత్రులు పింగళి జగన్నాథరావు ” ద్వ్య ర్ధి – అనేకార్థ కావ్యాల”పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆ గ్రంథాన్ని అచ్చు వేయాలని సంకల్పించారు. దానికి ముందుమాట అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి చేత వ్రాయించాలని కోరుకున్నారు. శివారెడ్డి గారు నాకు బాగా పరిచయం ఉండటం వల్ల నన్ను అడిగారు.

” దానికేముంది? వెళ్లి అడుగుదాం. కాదనరనే నమ్మకం నాకుంది” అన్నాను.

ఇద్దరం కలిసి వెళ్లాం. శివారెడ్డి గారిని కలిసి విషయం చెప్పాను. ఆయనా అంగీకరించారు.

ఆ తరువాత ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆ మాటల మధ్యలో శివారెడ్డి గారు…

” అందరూ పి హెచ్ డి చేస్తున్నారు. మీరెందుకు చేయటం లేదు? అని అడిగారు.

గతంలో జరిగినవన్నీ చెప్పాను.

” ఇప్పుడు చేయండి. తొందరలో ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. అప్లై చేయండి. అదే ఊర్వశి టాపిక్కే చేయండి” అన్నారు ఆయన.

ఊర్వశి! మళ్ళీ ఊర్వశి! సరే అన్నాను. అప్లై చేశాను. ఎంట్రన్స్ పరీక్షకు వెళ్ళాను. లోపలికి వెడుతుంటే శిఖామణి చూశారు.

” ఏమిటిలా?” అని అడిగారు.

” పి హెచ్ డి ఎంట్రన్స్ వ్రాయడానికి వచ్చా!” అన్నాను.

” మీరు ఎంట్రన్స్ రాయటం ఏమిటీ?”

” పద్ధతి… తప్పదు కదా!” అన్నాను.

అలా ఎంట్రన్స్ వ్రాశా. పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. వెళ్ళాను.

అక్కడ వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్పాను. కొన్ని కౌంటర్ క్వెశ్చన్స్ వచ్చాయి. చెప్పాను. అయిపోయింది. అక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఒకామె వున్నారు. ” స్వీట్స్ రెడీ చేసుకోండి. మీకు సీట్ కన్ఫర్మ్” అన్నారు. సర్టిఫికెట్స్ ఇచ్చాను. ఆ తరువాత ఏ సమాచారమూ లేదు.

మూడు నెలలు గడిచాయి. ఒకరోజు యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ వచ్చింది… ” మీరు ఫలానా సబ్జెక్ట్ తో పి హెచ్ డి కి అప్లై చేశారు. ఫలానా తేదీన ఇంటర్వ్యూకు రావాలి” అని.

నాకు ఏమీ అర్థం కాలేదు. అన్నీ అయిపోయాయి కదా? మళ్ళీ ఇదేం ట్విస్ట్ అనుకున్నాను. ఆచార్య మృణాళిని గారికి ఫోన్ చేశాను.

” ఇలా లెటర్ వచ్చింది. అర్థం కాలేదు” అన్నాను.

” మరి వస్తున్నారా?” అని అడిగారు.

” లెటర్ వచ్చాక రావాలి కదా?” అన్నాను.

” రావద్దు!” అన్నారు.

అర్థం కాలేదు. ” అదేమిటి? ఎందుకు?” అని అడిగాను.

” మీకు సీట్ రాదు… అందుకని!” అన్నారు.

” ఎందుకు?” అని అడిగాను.

” రెండే సీట్లు ఉన్నాయి. ఒకటి ఎస్ సి కేండిడేట్ కి, ఇంకొకటి ఎస్ టి కేండిడేట్ కి రిజర్వ్డ్. సో, వచ్చి లేదనిపించుకోవడం ఎందుకు?” అన్నారు.

వదిలేశాను.

అలా ” ముచ్చట”గా మూడో సారి నా పిహెచ్ డి ” ముచ్చట” ముగిసింది!

” నెగిటివిటీ ప్రారంభం…” రేపు…


Leave a comment