” నెగిటివిటీ ప్రారంభం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 95

ఎస్ వి బి సి ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్) లో ఒక విభాగం ఉంది. దానిని ” స్క్రిప్ట్ అండ్ ప్రివ్యూ కమిటీ” అంటారు. సీరియల్స్ కి సంబంధించిన స్క్రిప్టులను , ఎపిసోడ్లను పరిశీలించి, తగిన సలహాలు – మార్పులు – చేర్పులు సూచించటం ఈ కమిటీ బాధ్యత! దీనిలో నలుగురు సభ్యులు ఉన్నారు. సాయిబాబా, రాజా రవిచంద్ర (?), పసుమర్తి రామలక్ష్మి, మరొకరి పేరు గుర్తు లేదు.

నా బాధ్యత కూడా అదే. దానికి తోడు కార్యక్రమాల రూపకల్పనలో కూడా నా పాత్ర ఉంటుంది. ఎలాటి కార్యక్రమాలు రూపొందించాలి? వాటిని చేయటానికి ఏ ప్రొడ్యూసర్ తగిన వారు? ఇలాటి విషయాలలో ప్రోగ్రామింగ్ హెడ్ కి సహకారం అందించాలి. అంతేకాక క్రొత్త కార్యక్రమాలకు ప్రతిపాదనలు కూడా నేను ఇవ్వాలి.

నేను చేరేవరకూ ఆ నలుగురిదే ఏకచ్ఛత్రాధిపత్యం! స్క్రిప్ట్ విషయంలో కానీ, ఎపిసోడ్ ప్రివ్యూ విషయంలో కానీ వారు చెప్పినదే వేదం! క్రొత్త కార్యక్రమాల ప్రతిపాదనలు, వాటి స్క్రిప్ట్స్ వీరి పరిధిలో లేవు.

నేను చేరాను. అప్పుడు ఏమి జరుగుతుంది? ఈ కమిటీ సభ్యులు సీరియల్ స్క్రిప్ట్స్, ఎపిసోడ్స్ మీద ఇచ్చిన రిపోర్టులు నేను చూస్తాను. వారి రిపోర్ట్ తో నేను ఏకీభవించవచ్చు, ఏకీభవించక పోవచ్చు. నా రిపోర్ట్ ఫైనల్! బయటివారి ఔట్ సోర్సింగ్ సీరియల్స్ ఎపిసోడ్లు చూసి వారే అప్రూవ్ చేసేవారు. నేను కూడా చూడటం మొదలు పెట్టాను. దానితో ఇటు ఈ కమిటీ సభ్యులకూ, అటు ఔట్ సోర్సింగ్ ప్రొడ్యూసర్స్ కి ఇబ్బందులు మొదలు అయ్యాయి. ఛానల్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఉన్నవాళ్లు  కావటం వల్ల వీరికి ఆ ప్రొడ్యూసర్లతో మంచి “సంబంధ బాంధవ్యాలు” కూడా ఏర్పడ్డాయి.

అప్పటి వరకూ సాగిన వారి “సామ్రాజ్యాధిపత్యా”నికి గండి పడటం మొదలైంది. అది ఎవరైనా ఎలా సహిస్తారు? సో, నెగిటివిటీ ప్రారంభం! మనుష్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండటం మంచిదే! పనులు సజావుగా సాగుతాయి. నిజమే!

సమస్య ఎక్కడా అంటే ఈ కమిటీ సభ్యులు ఎవరికీ ఈ ఛానల్ కి అవసరమైన “పౌరాణిక జ్ఞానం” లేదు. ఈ మాట చెప్పటంలో నాకు ఎలాటి శషభిషలూ అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు.

చిన్న ఉదాహరణ చెబుతాను… నేను చేరటానికి ముందే సీరియళ్లు అన్నీ ఓకే అయ్యాయి. అప్పటి వరకూ వాటి స్క్రిప్ట్స్ అన్నీ ఎలాటి అభ్యంతరాలూ లేకుండా ఆమోదం పొందాయి. ఒక సీరియల్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ స్క్రిప్ట్ ఆమోదం పొంది, ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రివ్యూ కి వచ్చింది. అందరమూ చూస్తున్నాము. అందులో ఒక చోట లలితాదేవి  ” హ్రీం” అని అంటుంది. వెంటనే ఒక చెలికత్తె పరుగున వస్తుంది! నాకు మతి పోయింది! అక్కడ ఆపి స్క్రిప్ట్ తీసుకుని చూశాను. అందులో అలాగే ఉంది! ఆ స్క్రిప్ట్ అప్రూవ్ అయింది!

” ఇదేమిటి?” అని అడిగాను.

” తప్పేముంది?” అని ఎదురు ప్రశ్న వేశారు కమిటీ సభ్యులు.

” అమ్మవారు ‘ హ్రీం ‘ అనటం ఏమిటి? వెంటనే ఒక చెలికత్తె రావటం ఏమిటి?” అని అడిగాను.

” హ్రీం అమ్మవారి చెలికత్తె కదా?” అని ఆ నలుగురిలో పౌరాణిక విజ్ఞానం అధికం అనుకున్న వ్యక్తి అడిగారు.

“అలా ఎక్కడ ఉంది? ” అని అడిగాను.

” వాళ్ళు దానికి ఆధారం చూపించారు” అన్నారు ఆయన.

” ఆ ఆధారం ఏదో మళ్ళీ తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు అప్రూవ్ చేద్దాం” అన్నాను.

ఆ ప్రొడ్యూసర్ కి సంబంధించిన మేనేజర్ అక్కడే ఉన్నారు. ఆయనకు చెప్పాను… ” అదేదో రేపు తీసుకురండి” అని.

” స్క్రిప్ట్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది కదా సర్?” అన్నాడు.

” రేపు తీసుకురండి! అప్పుడు చూద్దాం!” అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను.

కాస్సేపటికి కమిటీలో ఉన్న సాయిబాబా నా దగ్గరకు వచ్చారు. ” అదికాదు సర్! స్క్రిప్ట్ అప్రూవ్ అయిపోయింది. ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేయటం ఏమిటి? బాగుండదు. అందులోనూ ఆ ప్రొడ్యూసర్ సినిమా నటుడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. అతనితో గొడవ ఎందుకు? ఇబ్బంది పడతారు!” అన్నారు. అది సలహానా? హెచ్చరికా? నేను పట్టించుకోలేదు.

“సారి సర్! నాకు దానికి ఆధారం కావాలి. తప్పదు. అది పూర్తిగా తప్పు. ఎస్ వి బి సి లో పౌరాణిక సీరియల్ లో అమ్మవారికి సంబంధించి అలాటి తప్పు వ్యూయర్స్ కి అందించటం ఇంకా పెద్ద తప్పు” అన్నాను.

మరునాడు ఒక పుస్తకంలో నుంచి కొన్ని పేజీల జిరాక్స్ కాపీలు తెచ్చారు. కమిటీలో ఉన్న ఆ పౌరాణిక పండితుడు వాటిని చూసి కొన్ని అండర్ లైన్ చేసి నాకు చూపించారు.

” చూడండి. కరెక్ట్ గానే ఉంది” అన్నారు. తీసుకుని చూశాను. దానిలో ఉన్న విషయం ఏమిటంటే…

” హ్రీం, శ్రీం అమ్మవారి శక్తులు, బీజాలు”

అమ్మవారి “శక్తులు” అంటే అమ్మవారి ” చెలికత్తెలు” అనుకునే అజ్ఞానులు స్క్రిప్ట్ అండ్ ప్రివ్యూ కమిటీని నడిపారు!

ఋషులు అరటి పండ్లు ఎడమ చేతిలో పట్టుకొని కొరుక్కు తినే సీన్లు, ఎడమ చేతితో జపమాల తిప్పే సీన్లు, ఋషుల యజ్ఞోపవీతాలు కుడిభుజాన ఉండటం… ఇలాటివన్నీ వీళ్ళు అప్రూవ్ చేసేశారు. గుడ్ రిలేషన్స్!

ఇలాటి ధోరణికి నా రాక అడ్డం పడింది. నిజం చెప్పాలంటే వారికి “అనేక ప్రయోజనాలు” అందటంలో కూడా ఇబ్బంది ఏర్పడింది.

నెగిటివిటీ రాక ఏమవుతుంది?

” తిరుపతి రాజకీయం” రేపు…


Leave a comment