” తిరుపతి రాజకీయాలు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 96

” మీరు తిరుపతి ఆఫీస్ కి వెళ్ళాలి. అక్కడి ప్రొడ్యూసర్స్ తో మీటింగ్ ఎరేంజ్ చేస్తున్నాను. మీరు వెళ్లి వాళ్ళందరినీ కలవండి. వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోండి. ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి. అక్కడికి వెళ్ళాక అక్కడ టెక్నికల్ హెడ్ ఉంటారు. ఆయన్ని కలవండి. ఏర్పాట్లు అన్నీ చేస్తారు” ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సి. జె. రెడ్డి ఆదేశం. ప్రయాణపు ఏర్పాట్లు చేశారు.

ఈ విషయం ప్రోగ్రామింగ్ హెడ్ శశిధర్ కి చెప్పాను. హైదారాబాద్, తిరుపతి శాఖలలో విడి విడిగా ప్రోగ్రామింగ్ హెడ్స్ అన్నారు. తిరుపతిలో ప్రోగ్రామింగ్ హెడ్ పేరు బాలాజీ అని గుర్తు. ఆయన్ని కలవమని శశిధర్ చెప్పారు.

తిరుపతి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ప్రోగ్రామింగ్ హెడ్ ఇంకా రాలేదు. టైమ్ వేస్ట్ ఎందుకని టెక్నికల్ హెడ్ ని కలిశాను. మీటింగ్ రూమ్ లో ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ హెడ్ ” వెడదాం రండి!” అన్నారు.

” ప్రోగ్రామింగ్ హెడ్ ని కలిసి వస్తాను” అని ఆయన దగ్గరకు వెళ్ళాను.

” టెక్నికల్ హెడ్ ని కలిశారుట కదా?” మొదటి ప్రశ్న. అప్పుడే ఎవరో ఉప్పందించేశారు!!

” అవును సర్! మీరు రాలేదని ఆయనను కలిశాను. ప్రొడ్యూసర్స్ మీటింగ్. వాళ్ళు రెడీగా వున్నారుట. రండి” అన్నాను.

” నేను వస్తాను. మీరు వెళ్లి మొదలు పెట్టండి. పది పదిహేను నిమిషాల్లో వస్తాను” అన్నారు.

సరేనని వెళ్ళాను. మీటింగ్ పూర్తి అయింది కానీ ఆయన రాలేదు! నేను మరునాడు కూడా ఉన్నాను. మరునాడు ఆయన అసలు ఆఫీస్ కే రాలేదు. ప్రొడ్యూసర్స్ మీటింగ్ ప్రోగ్రామింగ్ హెడ్ లేకుండానే జరిగింది!

ఇంక నేను హైదారాబాద్ కి బయలుదేరాను. ప్రోగ్రామింగ్ హెడ్ కి ఫోన్ చేశాను. ” సర్! నేను ఇవాళ హైదారాబాద్ వెడుతున్నాను. మిమ్మల్ని కలవటమే కుదరలేదు” అన్నాను.

” మీ పని పూర్తి చేసుకున్నారు కదా? వెళ్ళిరండి” అన్నారు. వచ్చేశాను.

నాకు ఏమీ అర్థం కాలేదు. ప్రొడ్యూసర్స్ మీటింగ్ కి ప్రోగ్రామింగ్ హెడ్ రాకపోవటం ఏమిటి?

హైదారాబాద్ కి వచ్చేశాక ఇక్కడి వారు అసలు రహస్యం చెప్పారు. టెక్నికల్ హెడ్ కి, ప్రోగ్రామింగ్ హెడ్ కి ” ఉప్పూ నిప్పు”! నేను ఆయన వచ్చే వరకూ వేచి చూడకుండా ముందుగా టెక్నికల్ హెడ్ ని కలవటం ఆయనకు నచ్చలేదు! ఇగో ప్రాబ్లెమ్!

సరే! నా రిపోర్ట్ సి.జె.రెడ్డికి ఇచ్చాను. దాని కాపీలు ఇక్కడి శశిధర్ కి, అక్కడ బాలాజీకి అందించాను.

అవి అందిన తరువాత బాలాజీ ఇక్కడి శశిధర్ కి ఫోన్ చేశారు. ” వీడు ఎవడు మధ్యలో తిరుపతి ప్రొడ్యూసర్స్ మీద అసెస్మెంట్ ఇవ్వడానికి? నాకు తెలియదా ఎవరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో?” అని మండిపడ్డారు. ఈ విషయం శశిధర్ నాకు చెప్పారు.

” మీరు తప్పు చేశారు. ముందుగా ఆయన్నే కలవాల్సింది. పైగా నేను చెప్పాను కూడా ఆయన్ని కలవమని” అన్నారు.

నేను వెళ్ళింది ఒక పని మీద. సిజె రెడ్డి ఆదేశాలతో మీటింగ్ ఏర్పాట్లు చేసినది టెక్నికల్ హెడ్. ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరుగుతుంటే హాజరు కావలసిన బాధ్యత ప్రోగ్రామింగ్ హెడ్ ది. ఆయన ఇగో ప్రాబ్లెమ్ తో గైర్ హాజరు అయితే నా తప్పేముంది?

నేనూ పట్టించుకోలేదు. అయితే కారణం తెలియదు కానీ అతి కొద్ది రోజులలోనే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ప్రోగ్రాం అప్రూవల్స్ అన్నీ హైదారాబాద్ ఆఫీస్ నుంచే జరిగేవి.

ఎస్ వి బి సి లో రాజకీయాలు ఎలా ఉంటాయో ఇది ఒక చిన్న ఉదాహరణ.

ఎస్ వి బి సి లో సి ఇ ఓ, సి ఓ ఓ కన్నా ప్రొడ్యూసర్లే అధిక శక్తివంతులుగా ఉండేవారు. వారి నియామకాల వెనుక ఉన్న ” శక్తులు” అటువంటివి. ఆ విషయం ప్రొడ్యూసర్ల పని తీరు, వారి ప్రవర్తన చూస్తే సులభంగానే అర్థం అవుతుంది. ఎక్కడ జాగ్రత్త పడాలో ఈ సంఘటనతో నాకు అర్థం అయింది. అయితే అక్కడి ఉద్యోగులకు అర్థం కాని విషయం ఒకటి ఉంది… నేను ఇలాటివి లెక్క చేయను!

” లోపలి ముళ్ళు!” రేపు…


Leave a comment