” లోపలి ముళ్ళు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 97

నేను ఎస్ వి బి సి లో చేరేసరికి కొందరు అధికారులు శలవులో వున్నారు, కొందరు టూర్స్ లో వున్నారు. నేను ఛానల్ లో చేరిన విషయం వాళ్ళందరికీ ఫోన్లు వెళ్లిపోయాయి. ” వీడు ఎవడో కొత్తగా వచ్చాడు. కంటెంట్ మానిటర్ హెడ్ ట! ఇంక ప్రోగ్రామ్ ప్రపోజల్స్ అన్నీ ముందుగా వీడికి చూపించాలట! వాడి రిపోర్ట్ ను బట్టి ప్రోగ్రాం అప్రూవల్ ఉంటుంది!” అనే సమాచారం వెళ్ళిపోయింది.

అప్పటివరకూ ఏదో ప్రోగ్రాం ప్రపోజ్ చేయటం, టెక్నికల్ అనుభవం తప్ప ” విషయ పరిజ్ఞానం” లేని ప్రోగ్రామింగ్ హెడ్ అప్రూవ్ చేయటం! ఆడింది ఆట! పాడింది పాట! అయితే ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు దానికి అపవాదం!

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను… ఈ సంఘటనతో ఒక ప్రసిద్ధ సినీ గీత రచయిత కూడా వున్నారు… ” యువత” అని ఒక యువజన కార్యక్రమం. దానికి ఒక టైటిల్ సాంగ్. ” యువతా! నీకు నమస్తే!” పాట అప్రూవ్ అయిపోయింది. రికార్డింగ్ అయిపోయింది. అది వినటానికి ఆ గీత రచయిత, ప్రోగ్రామింగ్ హెడ్, ప్రొడ్యూసర్, నేనూ కూచున్నాము. పల్లవిలో మొదటి పంక్తి వినగానే నాకు నవ్వొచ్చింది.

” ఎందుకు నవ్వుతున్నారు?” ప్రోగ్రామింగ్ హెడ్ ప్రశ్న.

” తరువాత చెబుతాలెండి!” అన్నాను.

” పాట మొదలు కాగానే నవ్వారంటే ఏదో ఉంటుంది కదా? చెప్పండి” అన్నారు ప్రొడ్యూసర్.

” పల్లవిలో మొదటి పంక్తిలోనే తప్పు ఉంది ” అన్నాను. అవతల ప్రసిద్ధ సినీ గీత రచయిత!

” తప్పేముంది?” అని అడిగారు ఆయన.

” నీకు నమస్తే అనటం తప్పు” అన్నాను.

“అదేమిటి! అందరూ అలాగే అంటారు కదా?” ఎదురు ప్రశ్న.

” ఎవరు అన్నా తప్పే!” అన్నాను.

ప్రొడ్యూసర్ అడిగారు ” అసలు తప్పేమిటో చెప్పండి”

” నమస్తే అనే పదాన్ని విడదీస్తే నమః + తే అని వస్తుంది. తే అంటే నీకు, నమః అంటే నమస్కారం. ఇప్పుడు చెప్పండి. నీకు నమస్తే అంటే ‘ నీకు నీకు నమస్కారం ‘ అని. తప్పా, కాదా?” అడిగాను.

ఆ ప్రసిద్ధ గీత రచయిత ” అంత ఎవరికి తెలుస్తుంది సర్?” అన్నారు.

“అదే సర్! రచయితల ధైర్యం. ఎవరికి తెలుస్తుందిలే అని రాసేస్తారు. నా పాయింట్ ఎవరికి తెలుస్తుంది అని కాదు… రచయితకి భాష తెలియాలి అన్నది నా మెయిన్ పాయింట్. ఎస్ వి బి సి లో తప్పు రాకూడదు అన్నది నా రెండో పాయింట్” అన్నాను.

ప్రోగ్రామింగ్ హెడ్ శశిధర్ గొప్ప క్రైసిస్ మేనేజర్. వాతావరణం వేడెక్కే సూచన గమనించాడు.

” వదిలేయండి . రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడేం చేయలేం” అని నాతో అని,

” ఒకే సర్! ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఉంది. మళ్ళీ కలుద్దాం” అని ఆ గీత రచయితతో అని కుర్చీ లోనుంచి లేచాడు. ఆ గీత రచయితను బయట వరకూ సాగనంపాడు ప్రొడ్యూసర్.

” అదేమిటి ఆయన మొహం మీదే అలా అనేశారు?” అడిగాడు శశిధర్.

” ఇప్పుడేమీ చేయలేము అని తెలుసు కాబట్టే తరువాత చెబుతాను అన్నాను. ప్రొడ్యూసర్ ఊరుకోలేదు. అయినా ఆయన ‘ అంత ఎవరికి తెలుసు?’ అనేసరికి నాకు ఒళ్ళు మండింది. అయినా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పాలి. This is my day” అన్నాను.

శశిధర్ “మీతో కష్టమే!” అన్నారు. ఆ విషయం అనంతర కాలంలో మరో ఛానల్ లో కూడా ఆయనకి, అదే గీత రచయితకు మళ్ళీ బాగా తెలిసి వచ్చింది!

సరే… నేను చేరిన సంగతి తెలిసిన కొందరు తిరిగి వచ్చాక కొంత దూరంగానే వున్నారు. వాళ్ళతో కూడా కలసి పని చేయాలి నేను. అక్కడ ఆంధ్రప్రభ వీక్లీలో వాకాటి వారి శిక్షణ నాకు బాగా ఉపయోగ పడింది. ” నా దగ్గర పని చేస్తున్నాడు” అని ఆయన ఎప్పుడూ అనలేదు… ” నాతో పని చేస్తున్నాడు” అనే పరిచయం చేసేవారు. అవును… అందరి”తో” పని చేయాలి!

స్క్రిప్ట్ కమిటీలో కొందరు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కు సన్నిహితులు. వారికి నా వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే వుండేవారు. కొందరు నాతో ” లంచ్ డిప్లమసీ” కి ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాదని కొద్ది రోజులకే వారికి అర్థమై ఆ ప్రయత్నం వదలి వేశారు.

ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సి జె రెడ్డి కూడా తక్కువ వాడేమీ కాదు. స్క్రిప్ట్స్ మీద, సీరియల్ ప్రివ్యూల మీద స్క్రిప్ట్ కమిటీలో ప్రతి ఒక్కరి రిపోర్ట్ అడిగే వారు. నా రిపోర్ట్ కూడా ఉండేది. అన్నీ చదివి కంపేర్ చేసి చూసేవారు. ఏ సందర్భంలోనూ నా రిపోర్ట్ కి నిరాకరణ ఎదురు కాలేదు. ఇది కమిటీ సభ్యుల ” వేదన”కు తోడయింది.

ప్రొడ్యూసర్లతో నేను “కుమ్మక్కు” అయాయని ఆరోపణలు చేయటం మొదలు పెట్టారు!

” ఆరోపణల అధ్యాయం మొదలు!”


Leave a comment