” ఆరోపణలు ఆరంభం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 98

మన దారికి ఎవడైనా అడ్డొస్తే ఏం చేస్తాం? వాడిని మన దారికి రప్పించుకోవటానికి ప్రయత్నిస్తాం. కుదరకపోతే అడ్డు తప్పించటానికి ప్రయత్నిస్తాం. ఎస్ వి బి సి లో నా విషయంలో మొదటి రకం ప్రయత్నాలు ఫలించలేదు. ఇక మిగిలింది రెండవ దారే.

ఆ రెండవ దారిలో ప్రయత్నాలు మొదలు అయ్యాయి. అదే ఆరోపణల వ్యూహం. ఏవిటవి?

ఒకటి… ఔట్ సోర్స్ ప్రొడ్యూసర్లతో కుమ్మక్కు అయిపోయాడు. రెండవది… ఔట్ సోర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు. మూడవది… అలా ఇవ్వనివాళ్ళ స్క్రిప్ట్స్ కి ఏవో అర్థం లేని అడ్డంకులు పెడుతున్నాడు. నాలుగవది… ఔట్ సోర్స్ ప్రొడ్యూసర్లకి తానే స్క్రిప్ట్స్ వ్రాసి, వాటిని తానే అప్రూవ్ చేసి డబ్బు తీసుకుంటున్నాడు.

ముందుగా సిబ్బందిలో ఈ ప్రచారం మొదలు పెట్టారు. అలా అలా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సి జె రెడ్డి దగ్గరకు వెళ్లి ” ఆఫీస్ లో ఇలా అనుకుంటున్నారు!” అంటూ వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టుగా చెప్పడం మొదలు పెట్టారు. ఒకరిద్దరు ఇన్ హౌస్ ప్రొడ్యూసర్లు నాకు ఈ విషయాలు చెప్పారు.

ఒకటి… నేను ఔట్ సోర్స్ ప్రొడ్యూసర్స్ తో కుమ్మక్కు అయి వుంటే వారు ఇచ్చిన స్క్రిప్ట్స్ వేటికీ అభ్యంతరం చెప్పేవాడిని కాదు.

అయితే ఈ మాట రావటానికి ఒక కారణం ఉంది. స్క్రిప్ట్ కమిటీ వారి ” విషయ పరిజ్ఞాన శూన్యత” వల్ల సరిగ్గా ఉన్న విషయాలకు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే నేను సరిగ్గా ఉన్న ఆ విషయాలను సమర్ధించాను. ఈ కమిటీ “మోడస్ ఆపరాండై” ఒకటి ఉన్నది. అభ్యతరాలు చెప్పటం, వాటిని అడ్డం పెట్టుకుని ” ప్రయోజనాలు” పొందటం. అది కుదరటం లేదు. నేను కొన్ని విషయాలను సమర్ధించడం నుంచి ఈ ఆరోపణ పుట్టుకొచ్చింది. సి జె రెడ్డి నన్ను అడిగారు. నేను సమర్ధించిన అన్ని విషయాలకూ గ్రంథస్థ ప్రమాణాలు చూపించాను. ఈ ఆరోపణ తేలిపోయింది.

రెండవది, మూడవది… నేను ఔట్ సోర్స్ ప్రొడ్యూసర్లు దగ్గర డబ్బు తీసుకుంటున్నాను, ఇవ్వకపోతే వాళ్ళ స్క్రిప్ట్స్ కు అడ్డం పెడుతున్నాను. నేను చెప్పే ప్రతి అభ్యంతరానికీ ఆధారాలతో సహా రిపోర్ట్ వ్రాస్తాను కాబట్టి ఇదీ తేలిపోయింది. సి జి రెడ్డి కూడా కమిటీ సభ్యులను ( కొందరిని… ప్రధానంగా ఇద్దరిని) పిలిచి, వారికి నా రిపోర్ట్ చూపించకుండా, నేను చెప్పిన అభ్యంతరాలను గురించి, చూపించిన ప్రమణాల గురించీ ప్రశ్నించే వారు. నా అభ్యంతరాల విషయంలో వారికున్న అభ్యంతరాలు ఏమిటి అని  అడిగేవారు. అక్కడ విషయం తెలిపోయేది. So, రెండు, మూడు ఆరోపణలు కూడా తేలిపోయాయి.

ఇక నాలుగవది… నేనే స్క్రిప్ట్ వ్రాసి, అప్రూవ్ చేసి, డబ్బు తీసుకుంటున్నాను.

ఇది ” రంతిదేవుడు” స్క్రిప్ట్ దగ్గర వచ్చింది.

రంతిదేవుడు అడవుల పాలు అయ్యాడు. నలభై రోజులు అడవిలో ఆహారం లభించలేదు. చివరికి ప్రక్కన ఉన్న గ్రామంలో భిక్షాటన చేస్తే, అన్నం, పాయసం, నీరు దొరికాయి. స్వీకరిద్దాం అనుకుంటూ ఉండగా ఆకలిగొన్న వారుఒక్కొక్కరుగా వచ్చి యాచించారు. అన్నీ ఇచ్చేశాడు. సరే…చివరికి అది పరీక్ష అని  తేలుతుంది. ఇదీ కథ.

దీనిలో అన్ని రోజులు రంతిదేవునికి అడవిలో ఆహారం ఎందుకు దొరకలేదు? అనేది ప్రశ్న! అడవిలో కందమూలాలకు ఏమి కొదువ? పోనీ అవి కాదు అనుకుంటే అతడు క్షత్రియుడు. ఆహారంగా స్వీకరించ దగిన మృగాలను వేటాడి కడుపు నింపుకోవచ్చు. అడవిలో మృగాలు లేవా? ప్రకృతి విరుద్ధం అయిన విషయం కదా? మరి అన్ని రోజులు ఆహారం ఎందుకు లభించలేదు?

ఇక్కడ ఆ స్క్రిప్ట్ రచయిత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకొని, ఒక లాజిక్ ప్రవేశ పెట్టాడు. ఇదంతా రంతిదేవునికి పరీక్ష. ఆ పరీక్షలో భాగంగా దుర్వాస మహర్షి తన ప్రభావంతో అటు కందమూలాలు కానీ, ఇటు ఆహారానికి పనికి వచ్చే మృగాలు కానీ లభించకుండా చేశాడు అని!

కమిటీ వారి అభ్యంతరం “ఇది మూల గ్రంథంలో లేదు, కనుక ససేమిరా అంగీకరించరాదు” అని! నేను ఈ కల్పనను సమర్ధించాను. కనుక నేనే ఈ స్క్రిప్ట్ వ్రాసి, సమర్ధించాను అని ఆరోపణ.

సి జె రెడ్డి దీనిని కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. నన్ను పిలిచి అడిగారు… ” ఈ స్క్రిప్ట్ మీరే రాశారా?” అని.

” లేదు” అని చెప్పాను.

ఆ రోజు మధ్యాహ్నం ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ను పిలిచి అడిగారు… ” ఈ స్క్రిప్ట్ వల్లభాచార్య రాశారా?” అని.

“లేదు” అని చెప్పారు ఆయన.

సాయంత్రం రెడ్డి మళ్ళీ నన్ను పిలిచారు… ” నేను ఆ ప్రొడ్యూసర్ ను అడిగాను. ఆ స్క్రిప్ట్ మీరే రాశారని చెప్పారు” అని ప్రశ్నార్థకంగా చూశారు నన్ను.

” సరే! నేను ఇక్కడే ఉంటాను. పిలిపించండి” అన్నాను.

ఆయన నవ్వేసి ” సరేలెండి! ఇక్కడితో వదిలేయండి. నేను నమ్మటం లేదు” అన్నారు.

ఇంతకీ నా సమర్థన ఏమిటి?

ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్య, నాటక అధ్యయనం చేసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. మూల గ్రంథంలోని ఒక విషయాన్ని ఆధారం చేసుకుని ఎన్నో కల్పనలతో అనంతర రచనలు ఉన్నాయి. పెద్ద ఉదాహరణ “కవికుల గురువు” కాళిదాసు ” అభిజ్ఞాన శాకుంతలం”. భాస నాటక చక్రంలోని ” ఊరు భంగం”… ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదే సంప్రదాయంతో ఈ రచయిత రంతిదేవునికి అన్ని రోజుల పాటు ఆహారం దొరకక పోవటానికి ఒక కారణాన్ని ఊహించి, కల్పించాడు. అది సాహిత్య సంప్రదాయానికి అనుగుణంగానే ఉంది కనుక నేను ఆ స్క్రిప్ట్ ను సమర్ధించాను!

” పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి” లేని స్క్రిప్ట్ కమిటీ సభ్యుల దయాదాక్షిణ్యాల మీద, ” ప్రయోజన పరిపూర్తి” మీద ఆధారపడి పబ్బం గడుపుకునే వారికీ నా వల్ల ఇబ్బందే! ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికీ ఇబ్బందే!

” మంచి జరగలేదా?” రేపు…


Leave a comment