” మంచి జరగలేదా?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 99

ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పని ఎలా ఆపుతాను? ఇంత నెగిటివిటీ మధ్యలోనూ చాలా మంచి పనులూ జరిగాయి.

కార్యక్రమాల రూపకల్పనలో నా ప్రతిపాదనలూ ఉంటాయి. అయితే అప్పటికే ప్రసారం అవుతున్న కార్యక్రమాలు ఆగవు కదా? వాటి మధ్యలో ఎస్ వి బి సి లక్ష్యానికి అనుగుణంగా క్రొత్త కార్యక్రమాల రూప కల్పన చేయాలి.

ఎస్ వి బి సి లక్ష్యం ఏమిటి? ప్రజలలో శ్రీవేంకటేశ్వరుని పట్ల భక్తిభావాన్ని పెంపొందిచటం, సనాతన ధర్మంలోని సమస్త శాఖల విషయాన్ని పరిచయం చేయటం, ధర్మ ప్రచారం… ఇవీ ప్రధాన లక్ష్యాలు.

శ్రీవేంకటేశ్వరుని తిరుమల క్షేత్రం ప్రధానంగా శ్రీవైష్ణవ క్షేత్రం. దివ్య దేశాలలో ఒకటి. అయితే శ్రీనివాసుడు ఒక్క శ్రీవైష్ణవుల సొత్తు మాత్రమే కాదు. హిందువులు అందరికీ ఆరాధ్య దైవమైన కలియుగ ప్రత్యక్ష దైవం. సనాతన ధర్మంలో ప్రధాన శాఖలు మూడు… ఒకటి శ్రీ ఆది శంకర భగవద్పాదుల అద్వైతం, రెండవది భగవద్ రామానుజుల విశిష్టాద్వైతం, మూడవది శ్రీ మధ్వాచార్యులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆనంద తీర్థుల ద్వైతం. ఈ ముగ్గురు ఆచార్యులు తమ సిద్ధాంతాలలో ఏమి చెప్పారు? సామాన్య ప్రేక్షకులకు సులువుగా వారి సిద్ధాంతాన్ని ఎలా అందించాలి? అని ఆలోచించి ” ఆచార్య వాణి” కార్యక్రమానికి రూప కల్పన చేశాను. సోమ, మంగళవారాల్లో అద్వైత విశేషాలు, బుధ, గురు వారాలలో శ్రీ విశిష్టాద్వైత వివరాలు, శుక్ర, శని వారాలలో ద్వైత వివరాలపై ఆయా సిద్ధాంతాలలో పండితుల ప్రవచనాలు ప్రసారం చేయటం మొదలైంది. ఇది నేను రూపకల్పన చేసిన వాటిలో నాకు ఇష్టమైన కార్యక్రమాలలో ఒకటి. ( నేను ఎస్ వి బి సి నుంచి బయటకు వచ్చేసిన తరువాతి వారమే ఈ కార్యక్రమం ఆగిపోయింది!!!)

శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్ లకు ప్రముఖ స్థానం ఉంది. వారు పన్నెండు మంది. వారిలో ఒక్కరు కూడా తిరుమల ఎక్కి స్వామిని దర్శించుకోలేదు. ఆ పర్వతమే స్వామి స్వరూపమని వారి భావన! వారు కొండ క్రింద నుంచే స్వామిని తమ భక్తి భావనా బలంతో దర్శించి, ఆయనను కీర్తిస్తూ పాశురాలను గానం చేశారు.

ఆ పాశురాల భావాన్ని తెలియజేయటం ద్వారా స్వామి వైభవం తెలుస్తుంది. దీని కోసం రిసోర్సెస్ మేనేజర్ గా ఉన్న హరిప్రియ గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఫలించలేదు. ఏమి చేయాలి? వ్యూహం ఏమిటి?

నేను చేరిన ఏడాది బ్రహ్మోత్సవాలు వచ్చాయి. నేనూ, హరిప్రియ గారూ ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పాశురాల కార్యక్రమం మొదలు పెట్టించాలని ఆలోచించాము. హరిప్రియ ఆ కార్యక్రమ ప్రతిపాదన సిద్ధం చేశారు. దానిని నేను ప్రోగ్రామింగ్ హెడ్ శశిధర్ దగ్గరకు తీసుకువెళ్ళాను.

” ఇది జస్ట్ బ్రహ్మోత్సవాలలో మాత్రమే కదా?” అని ప్రశ్న!

” ముందు ఈ సందర్భంగా మొదలు పెడదాము. క్రమంగా కొనసాగిద్దాం. ప్రతిపాదన బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రారంభిస్తాం అని మాత్రమే పంపిద్దాం” అన్నాను.

” అంటే తరువాత కూడా కంటిన్యూ చేస్తారన్న మాటేగా?” మళ్ళీ ప్రశ్న!

” తప్పేముంది? శ్రీనివాసుడు శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చిన స్వామే కదా? పన్నెండు మంది ఆళ్వార్లు గానం చేసిన నాలుగు వేల పాశురాలు ఆ స్వామి వైభవాన్ని చాటి చెప్పేవే కదా?”

” మొత్తం మీద మీరూ, హరిప్రియ కలిసి పెద్ద స్ట్రాటజీయే వేశారు. బ్రహ్మోత్సవాలు అంటే ఎవరూ కాదనరు. కానివ్వండి” అని అప్రూవ్ చేసి, సి జె రెడ్డికి పంపారు. ఆయన దగ్గర కూడా అప్రూవ్ చేయించుకున్నాను.

తమాషా ఏమిటంటే తిరుమలలోనే ఆ స్వామిని కీర్తించే సాహిత్య ప్రసారానికే ఇన్ని అడ్డంకులా? దానికి ఇన్ని ప్లాన్స్ వేయాలా?

తరువాత కొద్ది కాలానికే ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్న శశిధర్ ఛానల్ నుంచి వెళ్ళిపోయారు. భక్తి టీవీలో ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్న మేడపాటి రామలక్ష్మి గారు ఎస్ వి బి సి  లో ఛీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ గా వచ్చి చేరారు. నేను భక్తి టీవీలో చేరటానికి ఆమె కారణం. ఆమె రాకతో కార్యక్రమాలకు క్రొత్త ఊపు వచ్చింది. దాదాపు రెండేళ్లు భక్తి టీవీలో కలసి పని చేయటం వల్ల మాకు ఒక అవగాహన ఉన్నది. అలా ఆమె వచ్చాక రూపొందిన వాటిలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

వాటిలో ఒక కార్యక్రమం ” వేద సూక్తం!”. ఇది చాలా ప్రత్యేకమైనది. నాలుగు వేదాలలో అధర్వ వేదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దీనిలో మనిషి జీవితానికి అవసరం అయిన ఓషధీ విజ్ఞానం, దాని ప్రయోగ విధానాలూ ఉన్నాయి. అలాగే దీర్ఘ జీవన రహస్యాలు ఉన్నాయి. ఇలా చాలా చాలా విషయాలు నేరుగా మనిషి జీవితానికి సంబంధించినవి ఉన్నాయి. నేను హైదారాబాద్ రాక మునుపు నుంచీ అంటే 1985కు ముందు నుంచీ దీనిని అధ్యయనం చేస్తున్నాను. ఆ విశేషాలతో ఒక కార్యక్రమాన్ని రూపొందించాను. మూడు భాగాలుగా ఉంటుంది అది.

ఆ అధర్వ వేదం నుంచి ఒక్కొక్క సూక్తం తీసుకొని, దానిని ఆ వేద శాఖకు చెందిన పండితుని చేత పఠనం చేయించటం, ఆ సూక్తానికి శ్రీ విద్యారణ్య స్వామి అందించిన భాష్యాన్ని శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారి చేత చెప్పించటం,  చివరిగా దానిలోని విశేషాలను ఆధునిక వైద్య విజ్ఞానానికి అన్వయించి చెప్పటం… ఇదీ ప్రణాళిక! ఈ మూడు భాగాలలో చివరి భాగానికి స్క్రిప్ట్ నేనే వ్రాసేవాడిని. సీనియర్ ప్రొడ్యూసర్ రవీంద్ర ఈ కార్యక్రమం ప్రొడ్యూస్ చేసేవారు.

ప్రతిరోజూ మధ్యాహ్నం గంటపాటు ప్రసారం అయ్యే ” రమణీయం” మేము చేసిన మరో మంచి కార్యక్రమం. నాలుగు విభాగాలుగా సాగే ఈ కార్యక్రమంలో ఒక విభాగం మహిళల విజయ గాథలు. ఒక విభాగం ఆయుర్వేద విశేషాలు. ఒక భాగం యోగ – ధ్యాన విశేషాలు. ఒక భాగం నక్షత్ర –  జ్యోతిష – వాస్తు విజ్ఞానం. వీటిలో మొదటి మూడు విభాగాలలో పూర్తిగా మహిళలకే ప్రాధాన్యం.

ఎస్ వి బి సి లో గతంలో పని చేసిన ప్రోగ్రామింగ్ హెడ్స్ కీ, ఇప్పుడు ఛీఫ్ ప్రోగ్రామింగ్ హెడ్ గా వచ్చిన రామలక్ష్మి గారికి ఒక తేడా ఉంది!

” వద్దన్నాను… అయినా వచ్చారు!” రేపు…


Leave a comment