” వద్దన్నాను … అయినా వచ్చారు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 100

మేడపాటి రామలక్ష్మి గారి నిర్వహణలో భక్తి టీవీ విజయవంతంగా నడిచింది. ఆమెకు “కంటెంట్” పట్ల ఉన్న శ్రద్ధ మంచి మంచి కార్యక్రమాల రూపకల్పనకు తోడ్పడింది. దానికి తోడు అనుభవజ్ఞులు అయిన ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు, వారికి కూడా కొద్ది ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటం, క్రొత్తగా ” ఫ్రెష్”గా చేరిన ప్రొడ్యూసర్ల ఉత్సాహం… ఇవన్నీ కలిసీ, టెలివిజన్ రంగంలో మొట్టమొదటగా వచ్చిన భక్తి సంబంధం అయిన ఛానల్ కావటం భక్తి టీవీ విజయానికి కారణాలు.

టెలివిజన్ రంగంలో మొట్టమొదట వచ్చినంత మాత్రాన విజయం సాధ్యం కాదు. దాన్ని నడిపేవారికి ఒక ” విజన్” ఉండాలి. ప్రజలకు అవసరమైన విషయాలకు సంబంధించిన ” కాన్సెప్ట్స్” గురించి ఆలోచించాలి. దానిని స్క్రీన్ మీద సమర్థంగా ఆవిష్కరించే సిబ్బంది ఉండాలి. ఇదీ భక్తి టివీ విజయానికి అసలు కారణం!

ఆ ” విజన్” ఉన్న మేడపాటి రామలక్ష్మి గారు ఇప్పుడు ఎస్ వి బి సి కి వచ్చారు. అప్పటి వరకూ ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్న వాళ్లకు స్వయంగా ఒక ” విజన్” అంటూ లేదు! ప్రొడ్యూసర్లు ప్రతిపాదించిన కార్యక్రమాలకు ” బడ్జెట్స్” లెక్క వేయటం తప్ప, స్వయంగా రూపకల్పన చేసిన కార్యక్రమాలు అంటూ ఏవీ లేవు. ఇది వాళ్ళకీ, రామలక్ష్మి గారికీ ఉన్న తేడా!

రామలక్ష్మి గారు భక్తి టివీ లో మానివేసిన తరువాత ఆమెకు రెండు ” ఆఫర్స్” వచ్చాయి. ఒకటి ఒక న్యూస్ ఛానల్ నుంచి, రెండవది ఎస్ వి బి సి నుంచి. అప్పటికే నేను ఎస్ వి బి సి లో కొంత కాలంగా పని చేస్తూ ఉండటం వల్ల ఆమె నాకు ఫోన్ చేశారు. ఈ “ఆఫర్స్” గురించి చెప్పారు.

” ఎస్ వి బి సి కి రావద్దు” అని చెప్పాను.

” అదేమిటి అలా అనేశారు?” అని అడిగారు. ఇక్కడి పరిస్థితులు వివరించాను.

” ఈ రాజకీయాలలో మీరు ఇమడలేరు. క్రొత్తగా వచ్చిన వారిని ఎన్ని పాట్లు పెట్టాలో అన్నీ పెడతారు. మీ మనస్తత్వానికి ఇది సరిపడదు. అంతే కాదు ప్రాక్టికల్ గా చూస్తే న్యూస్ ఛానల్ లో వచ్చే జీతంలో సగం కూడా రాదు. వద్దు!” అన్నాను.

” జీతం సంగతి ప్రక్కన పెట్టండి. ఇది స్వామి పిలుపు అనుకుంటున్నాను. కాదని ఎలా అంటాను?” అని అడిగారు.

” స్వామి పిలుపు రెండు రకాలుగా ఉంటుంది అమ్మా! ఒకటి దారి తప్పిన వారు సరైన దారిలోకి రావటానికి ఇచ్చే అవకాశం. దానిని వినియోగించుకొని దారి మార్చుకుంటే స్వామి అపార కృపకు పాత్రులు అవుతారు. లేదా ఆ పతనం ఊహకు అందదు! ఇక సరైన దారిలోనే ఉన్న వారి కర్మ శేషాన్ని తొలగించటానికి తోమి తోమి శుభ్ర పరచటం. అన్నీ భరిస్తాను అంటే రండి!” అన్నాను.

ఆమె జీతం కన్నా స్వామి పిలుపుకే ప్రాధాన్యం ఇచ్చారు! అన్నిటికీ సిద్ధపడి ఎస్ వి బి సి కే వచ్చారు!

ఇలాటి శ్రద్ధాభక్తులు ఉన్నాయి కనుక, ” కాన్సెప్ట్స్” గురించి ఆలోచించటం, అవగాహన ఉండటం వల్ల నేను గతంలో చెప్పిన నా ప్రతిపాదనలు    ” ఆచార్య వాణి” కానీ, ” వేద సూక్తం” కానీ, ” రమణీయం” కానీ ఆమోదించారు. వాటిని చేయగలిగాం. వీటిలో ” వేద సూక్తం”, ” రమణీయం”, ” సిరిసిరి మువ్వలు” ( నృత్య కార్యక్రమం)  ప్రొడ్యూసర్ రవీంద్ర చేశారు. వాటికి స్క్రిప్ట్, ప్రశ్నలు నేను అందించాను.

అప్పటికే ప్రొడ్యూసర్ టి. శ్రీనివాసరావు చేస్తున్న ” యాత్ర” , ” యువత” కార్యక్రమాలకు కొత్త రూపు వచ్చింది. వాటికీ స్క్రిప్ట్స్ నేను అందించాను.

అన్నిటికన్నా మేము చేసిన పని ఒకటి ఉంది… ఛానల్ టైటిల్ వచ్చిన తరువాత వెంటనే ఒక కార్డ్ వేయటం మొదలు పెట్టాం. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం లో నాలుగు భాగాలు ఉంటాయి. మొదటిది సుప్రభాతం, రెండవది స్తోత్రం, మూడవది ప్రపత్తి, నాలుగవది మంగళాశాసనం. వీటిలో “ప్రపత్తి” అనే భాగంలో స్వామికి సర్వస్వ శరణాగతి చేయటం ఉంటుంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ కి అంతకన్నా పరమ లక్ష్యం ఏముంటుంది?

కనుక ప్రపత్తి భాగంలోని ఒక్కొక్క శ్లోకమూ ఒక్కొక్క కార్డ్ చేశాం. దానిని ఛానల్ టైటిల్ అయిపోగానే వేసేవాళ్ళం. ఆ శ్లోకాలు ఒక రోజులో వచ్చే అన్ని కార్యక్రమాలకు ముందు వచ్చేవి.

రామలక్ష్మి గారూ, నేనూ ఛానల్ నుంచి బయటకు వచ్చేశాక ( నేనే ముందు బయటకు వచ్చేశాను) ఆ ప్రపత్తి కార్డ్స్ వేయటం ఆపివేశారు. అదీ స్వామి పట్ల ఆ ఛానల్ కు ఉన్న నిబద్ధత.

అంతేకాదు, ఛానల్ మొదలు అయిననాటి నుంచీ టైటిల్ లో ” వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన! వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అనే శ్లోకం వచ్చేది. అది కూడా తీసేశారు! స్వామి వైభవం పట్ల ఎలాటి శ్రద్ధాభక్తులు లేని వ్యక్తుల చేతిలో ఎస్విబిసి పడటం? స్వామి పారమ్యానికి ఏ మాత్రమూ గౌరవం ఇవ్వని ” భక్తి రహితు”ల నిర్వహణ, నియంత్రణలో ఆ ఛానల్ పడటం? ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి లేనే లేదు. ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరూ అంగీకరించని విషయాలు ఇవి! ఇదంతా ” స్వామి లీల” అని సద్ది చెప్పుకోవటం తప్ప చేయగలిగినది ఏముంది? రాజకీయ ప్రాబల్యాలు, ఆశ్రిత పక్షపాతం తప్ప మరొకటి సాగని పరిస్థితులలో అంతకన్నా ” సాంత్వన” వేరే ఏముంటుంది?

” సీరియల్స్ నిలిపేశారు!” రేపు…


Leave a comment