స్వీయ అన్వేషణ – 101
తిరుమల తిరుపతి దేవస్థానాల కార్య నిర్వహణాధికారి ( ఈ ఓ) మారారు. ఐ. వై. ఆర్. కృష్ణారావు గారు ఈఓ గా వచ్చారు. రాగానే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే… ” బయటి వారి సీరియల్స్ ఆపివేయాలి!”.
కారణం… బయటి వారికి సీరియల్స్ ఇవ్వటంలో చాలా ” అవినీతి” జరిగిందని ఆయనకు తెలియటం. అయితే అప్పటికే ” ఏనుగులు” తమ పని తాము చేసేసుకుని వెళ్లిపోయాయి! ” చీమలు” చిక్కాయి!
ఈ సీరియల్ ఆపేయటానికి తగిన చర్యలు తీసుకోవటానికి టి టి డి కి సంబంధించిన ఐ ఎ ఎస్ అధికారి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యువరాజ్, చిత్తూరు జిల్లా ఎస్ పి రామకృష్ణలతో ఒక కమిటీ వేశారు. వారు విచారించి ఈ సీరియల్స్ నిలిపివేత కార్యక్రమాన్ని అమలు చేయాలి. తిరుపతి ఎస్ వి బి సి శాఖ నుంచి వచ్చే సీరియల్స్ ఏవీ లేవు. అన్నీ హైదారాబాద్ శాఖ నుంచే!
కె.ఎస్.శర్మ గారు మొదటి సి ఇ ఓ ఈ ఛానల్ కి. ఆయన ఈ సీరియల్స్ కి శ్రీకారం చుట్టారు. దానికోసం కొంతమంది సినీ ప్రముఖులతో ఒక కమిటీ వంటిది వేశారు. చివరికి జరిగింది ఏమిట్రా అంటే… ఈ పెద్దలలో కొంతమంది ఆ సీరియల్స్ , షార్ట్ ఫిల్మ్స్ తమలో తమకు కేటాయించేసుకున్నారు! ఒక్కొక్క ఎపిసోడ్ కి అయిదు నుంచి ఏడు లక్షలు! ఈ వ్యవహారం ఎలా ఉండేది అంటే…
ఒక ఔట్ సైడ్ ప్రొడ్యూసర్ గతంలో కొన్ని విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయనకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఆయన చేసింది ఏమిటయ్యా అంటే… అంతకుముందు తెలుగులో వచ్చిన భక్తి సినిమాల స్క్రిప్ట్ యథాతధంగా సమర్పించి అప్రూవ్ చేయించేసుకోవటం!
మరి కొందరికి భక్తి, ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో ఎలాటి అవగాహన లేదు. కేవలం సినిమా – సీరియల్ – టెలి ఫిల్మ్ ప్రొడక్షన్ వారికి ఒక ” బిజినెస్”. చవకగా వచ్చే ఎవరో ఒక రచయితను పట్టుకోవటం, ఆ రచయిత నాలుగు పుస్తకాలు దగ్గరేసుకొని, తనకు “అర్థమైనంత” వరకూ ఒక ” స్క్రిప్ట్ నామక పదార్థం” సమర్పించటం, అంతకన్నా ” మహా పండితులు” అయిన స్క్రిప్ట్ కమిటీ సభ్యులు దానిని అప్రూవ్ చేయటం… ఇలా సాగిపోయింది వ్యవహారం. దీనికి ఉదాహరణగా గతంలో ఒక సీరియల్ విషయంలో చెప్పిన ” లలితా దేవి హ్రీం అనటం, ఒక చెలికత్తె పరుగులు పెడుతూ రావటం” గుర్తు చేసుకోండి. ఇలాటి అనేక లోపాలు, వక్రీకరణలతో ఈ వ్యవహారం అంతా సాగుతూ వచ్చింది.
కృష్ణారావు గారు ఈ ఓ గా వచ్చేనాటికి దాదాపుగా ఇలాటి సీరియల్స్ అన్నీ ముగింపు దశకు వస్తున్నాయి. ఆయన నియమించిన కమిటీ సభ్యులు ఇద్దరూ… జె ఈ ఓ, ఎస్ పి… ఇద్దరూ ఒకరోజు హైదారాబాద్ కు వచ్చారు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ వేళలు అయిపోయాక ఒక సమావేశం జరిగింది. సి ఓ ఓ గా ఉన్న సి. జె. రెడ్డి, ఛీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రామలక్ష్మి గారు, హైదారాబాద్ శాఖలోని ప్రొడ్యూసర్లు అందరూ, నేను ఆ సమావేశంలో పాల్గొన్నాం.
ప్రతి సీరియల్, టెలి ఫిల్మ్ గురించి చర్చ జరిగింది. ” ఇక సీరియల్స్ ఆపేయండి” అని చెప్పారు యువరాజ్.
ఈ సందర్భంగా నేను ఒక సీరియల్, అయిదు ఎపిసోడ్స్ గా ఉండే ఒక టెలి ఫిల్మ్ విషయం ప్రస్తావించాను. ఒకటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం ” వశిష్ఠ – విశ్వామిత్ర” సీరియల్, రెండవది శ్రీవాణి క్రియేషన్స్ వారి అయిదు ఎపిసోడ్స్ టెలి ఫిల్మ్ ( పేరు గుర్తు లేదు).
దానికి నేను చెప్పిన కారణం… ” వశిష్ఠ – విశ్వామిత్ర ” సీరియల్ ఆ ప్రొడ్యూసర్లకు సంబంధించినంత వరకూ పూర్తి అయిపోయింది. నేను వారికి మరొక ఎపిసోడ్ ఇవ్వాలని అన్నాను.
” అయిపోయిన సీరియల్ కి అదనంగా ఇంకో ఎపిసోడ్ ఎందుకు ఇవ్వాలి?” అనే ప్రశ్న వచ్చింది. నిజమే కదా? ఒకప్రక్క సీరియల్స్ ఆపేద్దాం అంటూ ఉంటే అయిపోయిన సీరియల్ కి ఇంకో ఎపిసోడ్ అదనంగా ఇవ్వడం ఏవిటీ? సమంజసమైన ప్రశ్నే!
దానికి నేను చెప్పిన సమాధానం ఇదీ…
” విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటం, ఆ మాటను వశిష్ఠుడే స్వయంగా అనటం తో సీరియల్ పూర్తి అయింది నిజమే! కానీ విశ్వామిత్రుని జీవితంలో ప్రధానమైన విషయం ఒకటి ఇప్పటి వరకూ రాలేదు. ఇప్పుడు మనం జపిస్తున్న గాయత్రీ మంత్రానికి ద్రష్ట విశ్వామిత్రుడు. గాయత్రిని మించిన మంత్రం లేదు అని పెద్దల మాట. సంధ్యావందనం అయినా, ప్రాణాయామం అయినా, అర్ఘ్య ప్రదానం అయినా, నైవేద్య సందర్భంలో అయినా ఆ మంత్రాన్ని వినియోగిస్తాము. మానవుడి బుద్ధి ప్రచోదనకు ఆధారమైన ఆ మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించి లోకానికి అందించాడు అనే అత్యంత కీలక, ప్రధాన విషయం ఇప్పటివరకూ ఆ సీరియల్ లో రాలేదు కాబట్టి, ఆ ఒక్క విషయం చెప్పటానికి ఒక్క ఎపిసోడ్ ఇవ్వాలి. దానితో ఈ సీరియల్ ముగించటం ఉచితంగా ఉంటుంది”.
ఎస్ పి రామకృష్ణ ఈ వాదాన్ని అంగీకరించారు. అలా ఆ సీరియల్ కి ఒక ఎపిసోడ్ అదనంగా లభించింది.
మరొకటి శ్రీవాణి క్రియేషన్స్ కి సంబంధించినది. ప్రొడ్యూసర్ అప్పారావు. ఆయనకు అయిదు ఎపిసోడ్స్ తో ఒక టెలి ఫిల్మ్ అప్పటికే అప్రూవ్ అయివుంది. ఛానల్ నుంచి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆయన తన కూతురి వివాహం హడావిడిలో ఉండి ప్రొడక్షన్ వాయిదా వేసుకున్నారు. ఛానల్ నుంచి అప్రూవల్, అడ్వాన్స్ రెండూ అందాయి కాబట్టి దానిని కూడా కంటిన్యూ చేయాలి. దీనికీ ఇద్దరూ అంగీకరించారు. డబ్బు ఇచ్చి ఉన్నాం కదా? ఒప్పుకున్నారు.
అలా ఔట్ సోర్స్ సీరియల్స్ శకానికి ఎస్ వి బి సి స్వస్తి పలికింది!
” తిరుమల దైవం ఎవరు?” రేపు…
Leave a comment