స్వీయ అన్వేషణ – 102
నేను భక్తి టివీ లో మానివేసి, ఎస్వీబీసీ లో చేరే మధ్యకాలంలో ABN ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్ లో ఒక రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఒక “Live Debate” జరిగింది… దాని చర్చనీయాంశం ” తిరుమల దైవం ఎవరు?”! అసలు ఆ చర్చకు అవసరం ఏమిటో తెలియదు. పైగా సగం రోజు దానికి అంకితం!
ఆ చర్చలో ఒకరు అక్కడ ఉన్నది శివుడి విగ్రహం అన్నారు. మరొకరు అది సుబ్రహ్మణ్యుని విగ్రహం అన్నారు. ఆ రెండూ కాదు అమ్మవారి మూర్తి అని ఇంకొకరు అన్నారు. అసలవేవీ కాదు జిన మూర్తి అన్నారు మరొకరు. నిజానికి అది బౌద్ధ క్షేత్రం అని మరొకరు చెప్పారు. సరే, తిరుపతి నుంచి కొందరు విద్వాంసులు అది విష్ణుమూర్తి విగ్రహం అన్నారు. చివరికి ఏమి తేలుతుంది? ఏమీ తేలదు! అన్ని చర్చలలాగే ” ఇదీ ఈనాటి చర్చా కార్యక్రమం, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం” అని ముగుస్తుంది.
సరే, ఆ ఛానల్ వారు ఆ చర్చ ఎందుకు పెట్టారు అనేది ప్రక్కన పెడితే “తిరుమల దైవం ఎవరు?” అనే ప్రశ్న వచ్చినప్పుడు చారిత్రక, సాహిత్య, శాసన, పత్ర సంబంధ ఆధారాలతో అక్కడ వున్న దైవం ఎవరో స్పష్టంగా ప్రకటించ వలసిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిదే ఆ బాధ్యత! పైన చెప్పిన సమస్త ఆధారాలతో పండితుల సహకారంతో ఒక్కసారి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే మళ్ళీ ఇలాటి చర్చకు అవకాశం ఉండదు. ఆ బాధ్యతను టి టి డి పూర్తిగా విస్మరించింది!
అలాగే ఒకసారి TV 9 ఒక వీడియో ప్రసారం చేసింది. చాలా ఏళ్ళ క్రితం సంగతి. వారు ఏమి చెప్పారు అంటే… యాభై ఏళ్ళ క్రితం ఒక భక్తుడు తీసిన శ్రీవారి అసలైన వీడియో… అని. దీని మీదా టి టి డి ఎలాటి ఖండనా ప్రకటించలేదు!
ఆ వీడియోలో తిరుమల ఘాట్ రోడ్, ప్రెస్, స్వామి వారి ఆలయం లోపలి దృశ్యాలు, హుండీలో భక్తులు కానుకలు సమర్పించటం, అధికారుల సమావేశం వంటివి ఉన్నాయి. ఎంత అసంబద్ధమైన విషయం? ఒక భక్తుడు జూమ్ ఇన్, జూమ్ ఔట్ సౌకర్యాలు ఉన్న కెమెరా తీసుకుని లోపలికి వెళ్ళి, స్వామి వారి అభిషేకాన్ని కూడా షూట్ చేశాడా? అదీ 60 ఏళ్ల క్రితం! అప్పట్లో అలాటి కెమెరాలు ఉన్నా అవి ఏ సైజ్ లో ఉండేవి? కులశేఖర పడి వరకూ, క్యూ లో వెడుతూ వాటితో షూట్ చేయటం సాధ్యమా? అంతే కాదు… కులశేఖర పడి దగ్గర అర్చక స్వామి భక్తులకు తీర్థం ఇవ్వటం చూపించారు. అర్చకుని వీపు వెనుక నుంచి షూట్ చేసిన ఆ దృశ్యంలో తీర్థం కోసం వస్తున్న భక్తుల క్యూ కనిపిస్తుంది. అంటే ఆ కెమెరాతో స్వామి వారి గర్భాలయం లోకి వెళ్లి ఆ దృశ్యాన్ని షూట్ చేయాలి! అది సాధ్యమా? అసలు ధ్వజ స్థంభం దాటి కెమెరాలకు అనుమతే లేదు కదా?
మరి ఈ ఫుటేజ్ ఎక్కడిది? 1971 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ” శ్రీవేంకటేశ్వర వైభవం” అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్లలో ఇది ప్రదర్శితం అయింది కూడా! ఆ చలనచిత్రం లోని ముక్కను ” యాభై ఏళ్ల క్రితం ఒక భక్తుడు షూట్ చేసినది” అని TV 9 ఒక దారుణమైన అసత్య ప్రచారాన్ని చేసింది!ప్రసారం చేసింది! ఇదంతా ఎందుకు ఇప్పుడు అంటే… TV 9 ప్రసారం చేసిన ఆ అసత్య ప్రచారం ఇప్పటికీ అనేక యూ ట్యూబ్ ఛానల్స్ లో చక్కర్లు కొడుతోంది. ” తిరుపతి బాలాజీ ఒరిజినల్ వీడియో” అంటూ!
అది తాము నిర్మించి విడుదల చేసిన ” శ్రీ వేంకటేశ్వర వైభవం” చిత్రం లోనిది అనీ, ఏ భక్తుడూ షూట్ చేసినది కాదనీ, తిరుమల ఆలయంలో స్వామి మూర్తిని షూట్ చేయటం, అందులోనూ గర్భాలయం లోపలి నుంచి షూట్ చేయటం అసాధ్యమని, ఆ అనుమతి టి టి డి కి కూడా లేదని ప్రకటించి, ఇలాటి అసత్య ప్రచారానికి “చెక్” పెట్టవలసిన బాధ్యత ఎవరిది? అలాటి అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పైన ” తమ కంటెంట్ ను వక్రీకరించి ప్రసారం చేస్తున్నారు” అని రిపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎవరిది? టి టి డి పాలక మండలిది కాదా?
స్వామివారి ” ఉనికి” ప్రశ్నార్థకం అయినప్పుడు అధికారికంగా స్పందించ వలసిన బాధ్యత, కర్తవ్యం ఎవరిది? టి టి డి పాలక మండలి వారిది కాదా?
వారు ఆ పని చేశారా? లేదే?
టి టి డి ఇలాటి చర్యలు తీసుకుంటుందని ఆశించటం కన్నా అత్యాశ మరొకటి ఉండదు!
ఇక ” తిరుమల దైవం ఎవరు?” అనే విషయానికి వద్దాం…
ABN ఆంధ్ర జ్యోతి చర్చను ప్రక్కన పెట్టేద్దాం! గతం లోనికి… శతాబ్దాల వెనకకు… వెడదాం.
అది భగవద్రామానుజుల వారి కాలం. అప్పుడు తిరుపతి ఒక యాదవరాజు పాలనలో ఉండేది. భగవద్రామానుజుల వారు ఒకనాడు తమ శిష్యులతో మాట్లాడుతూ “తిరుమల పుష్ప మంటపం. ఆ స్వామికి పుష్ప కైంకర్యం చేయటానికి మీలో ఎవరు వెళ్ళగలరు?” అని అడిగారు. అక్కడ ఉన్న వారిలో అనంతాళ్వాన్ సిద్ధపడ్డారు. అప్పట్లో తిరుమల చేరటమే దుష్కరమైన పని. కీకారణ్యం … మృగాకీర్ణం! అయినా ఆయన భార్యతో కలసి తిరుమల చేరారు. ఒక తటాకం నిర్మించి పుష్పవనాన్ని పెంచి స్వామికి పుష్ప కైంకర్యం ప్రారంభించారు.
సరిగా ఆ కాలంలోనే యాదవ రాజు సభలో ఈ “తిరుమల దైవం ఎవరు?” అనే వివాదం వచ్చింది. అనంతాళ్వాన్ భగవద్రామానుజులకు కబురు పంపి, రప్పించారు. ఆ సభలో జరిగిన వాదంలో భగవద్రామానుజులు అనేక ప్రమాణాలతో ఆ ఆలయంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని నిరూపించారు. ఈ విషయాలు అన్నీ అనంతాళ్వాన్ గ్రంథస్థం చేశారు సంస్కృతంలో. అదే ” శ్రీ వేంకటేశ ఇతిహాస మాల”!
దాని తెలుగు అనువాదం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఇది టి టి డి వారి అధికారిక ప్రచురణ. దానిలో ఆనాటి వాదోపవాదాలతో పాటు అనేక విషయాలు ఉన్నాయి.
ABN ఆంధ్రజ్యోతి లో ఆ చర్చ ప్రసారం అయిన నాటి నుంచీ ఆ విషయం నా మనసులో తిరుగుతోంది. ఛీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రామలక్ష్మి గారికి చెప్పాను. “శ్రీ వేంకటేశ ఇతిహాస మాల” గురించి చెప్పాను. ఆ గ్రంథం ఆధారంగా శతాబ్దాల నాడే ” తిరుమల దైవం ఎవరు?” అనే ప్రశ్నకు, ఈనాటి చర్చకు సమాధానం ఉందని చెప్పటం ఎస్ బి వి సి కర్తవ్యం అని చెప్పాను. ఆ గ్రంథం ఆధారంగా ప్రవచన కార్యక్రమాన్ని చేద్దామనే ప్రతిపాదన ఇచ్చాను. ఆమె అంగీకరించారు.
ఆ గ్రంథాన్ని స్వతంత్రంగా తెనిగించిన శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్యుల వారి చేత ఈ ప్రసంగాలు చేయించాలని నిర్ణయించాం. దాదాపు పది ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి అయింది.
అప్పుడు వచ్చింది అడ్డంకి !
ఎస్వీబీసీ లో రిసోర్సెస్ విభాగానికి జనరల్ మేనేజర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. ఆయన మహా పౌరాణికుడు అయిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద పౌరాణిక విద్యలో శిక్షణ పొందిన వాడు. అనేక రామాయణ – భాగవత సప్తాహాలు నిర్వహించిన వాడు. ఆయన ఛీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రామలక్ష్మి గారి దగ్గర ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెప్పారు! ఆయన అభ్యంతరం ఏమిటి అంటే “ఇప్పటికే తిరుమల క్షేత్రంలో పాంచరాత్ర, వైఖానస విభేదాలు నడుస్తున్నాయి. ఈ కార్యక్రమం వల్ల అవి పెరుగుతాయి. కనుక ఈ కార్యక్రమం వద్దు!”
తిరుమల క్షేత్రంలో ఉన్న దైవం శ్రీమహావిష్ణువు అని చెబితే పాంచరాత్రులకు, వైఖానసులకు విభేదాలు ఎందుకు పెరుగుతాయో? నాకు అర్థం కాలేదు. ఆ రెండు వర్గాలకూ సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు గాక, కానీ ఇద్దరికీ శ్రీమహావిష్ణు పారమ్యంలో విభేదం లేదు కదా?
ఏది ఏమైనా రిసోర్సెస్ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న ఆయన అభ్యంతరం కారణంగా ఆ కార్యక్రమం ఆగిపోయింది!
” అధికార తారతమ్యం” అనేది “సత్య ప్రకటన”కు విఘాతం కలిగించటం మీడియా రంగంలో సర్వ సాధారణం. కానీ అది ఎస్వీబీసీ లాంటి చోట కూడా ప్రత్యక్షం కావటం బాధాకరం!
“తిరుమల దైవం శ్రీనివాసుడే!” అని టి టి డి కాకపోయినా కనీసం ఎస్వీబీసీ ద్వారా అయినా ప్రకటించే అవకాశం చేజారిపోయింది!
” తిరుపతికి షిఫ్ట్!” రేపు…
Leave a comment