స్వీయ అన్వేషణ – 103
ఐ.వై.ఆర్. కృష్ణారావు గారు ఈ ఓ గా వచ్చిన తరువాత తీసుకున్న పెద్ద నిర్ణయాలలో మొదటిది సీరియల్స్ నిలిపివేయటం కాగా రెండవది ఎస్వీబీసీ హైదారాబాద్ శాఖను మూసివేసి, సిబ్బందిని తిరుపతికి బదిలీ చేసేయటం!
దీనిలో ఛానల్ లోని విభాగాల హెడ్స్ కి మినహాయింపు ఉంటుంది. వారు వారంలో కొన్ని రోజులు హైదారాబాద్ లో, కొన్ని రోజులు తిరుపతిలో ఉండవచ్చు. మిగిలినవారు అందరూ తిరుపతిలోనే ఉండాలి.
అప్పుడే అర్థం అయింది నాకు. నా ఉద్యోగం పేరు ” కంటెంట్ మానిటర్ హెడ్”. పేరులో ” హెడ్” ఉంది కానీ నిజానికి దేనికీ “హెడ్” ను కాదని! అంటే నేను కూడా ” స్క్రిప్ట్ అండ్ ప్రివ్యూ కమిటీ” లో ఒక “సాధారణ సభ్యుడి”ని మాత్రమే! దీనినే ” పేరు గొప్ప ఊరు దిబ్బ” అంటారు!
ప్రోగ్రామింగ్ హెడ్ శశిధర్ ఉద్యోగం మానివేశాక ఆ క్యాబిన్ నాకు ఇచ్చారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి రిసోర్సెస్ విభాగానికి జనరల్ మేనేజర్ అయాక ఆ క్యాబిన్ ఆయనకు ఇచ్చి, మరొక క్యాబిన్ లో మరొకరితో పాటు నాకు వాటా వేశారు. ఆ తరువాత ఆ క్యాబిన్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన భుజంగరావుకు చోటు కల్పించి, నాకు బయట అందరితో పాటు ఒక వర్క్ స్టేషన్ కేటాయించారు!
ఆంధ్రప్రభ వీక్లీలో పని చేసేటప్పుడు వాకాటి వారు ఒక మాట అనే వారు… “నేను పని చేయటానికి నాకో క్యాబిన్, ఛాంబర్ వంటివి అవసరం లేదు. చెట్టు క్రింద ఓ కుర్చీ, టేబుల్ వేసినా చాలు. నేను చేసే పని నాకు ముఖ్యం! ఆ పని చేసే చోటు కాదు!” ఇదీ ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం! దానికి తోడు “జిడ్డు” పట్టిన మనిషిని కదా? “ఇమేజ్ బిల్డింగ్” … నా గురించి నేనే ఒక “మహోన్నత అభిప్రాయా”న్ని కల్పించుకోవటం, ” ఇది నా హోదా, అధికారం” అనే అజ్ఞానాన్ని వదలించుకొని చాలా కాలం అయింది! కనుక ఈ మార్పులు నా మీద ఎలాటి ప్రభావాన్ని చూపించలేదు.
ఇప్పుడు తిరుపతికి బదిలీ… రామలక్ష్మి గారు స్పష్టంగా చెప్పారు… ” మీరు ఏ విభాగానికీ హెడ్ కాదు కనుక మీరు తిరుపతికి షిఫ్ట్ కావలసిందే” అని.
ఇది నాకు సాధ్యం కాని పని. మా అబ్బాయి ఆ సంవత్సరమే పదవ తరగతిలోకి వచ్చాడు. ఆ సమయంలో వాడిని వదలిపెట్టి కేవలం ఒక ఉద్యోగం కోసం మరో ఊరికి వెళ్ళ వలసిన అవసరం ఏముంది? అంతే… ఒక నిర్ణయం తీసుకున్నాను! వాకాటి వారి సూత్రం ఉంది కదా? “జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన రోజే రాజీనామా లెటర్ కూడా వ్రాసి జేబులో పెట్టుకో!”
ఇప్పుడు ఆ జేబులో ఉన్న ఆ లెటర్ బయటకు తీసుకురావలసిన సమయం వచ్చేసింది.
తిరుపతి వెళ్ళాను. రాజీనామా లెటర్ ను రామలక్ష్మి గారికి అందించాను. భక్తి టీవీ నాటి నుంచీ ఒకరికి ఒకరం బాగా తెలుసు. ఆమె సౌజన్యం, సిబ్బందిలో ఏ స్థాయిలో ఉన్నవారికి అయినా ఆమె ఇచ్చే గౌరవ మర్యాదలు నాకు తెలుసు. నా పని తీరూ ఆమెకు తెలుసు. నాకు నచ్చచెప్పటానికి చాలా ప్రయత్నించారు. నా పరిస్థితిని, ఉద్దేశ్యాన్ని వివరించాను. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్య నా ప్రయారిటీ ఆ సమయంలో నా కొడుకు చదువు, వాడికి నేను ఇవ్వవలసిన సపోర్ట్ పట్ల నా బాధ్యతకే! ఆమెకు ఆ లెటర్ ఈ ఓ కి పంపక తప్పలేదు. పంపారు. ఉద్యోగిగా నా గుర్తింపు కార్డును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు ఇచ్చేశాను. ఇక ఆ ఛానల్ తో నాకు సంబంధం లేదు! అలా ఎస్వీబీసీ లో ఉద్యోగానికి స్వస్తి పలికాను.
” వెలుగు” ప్రాజెక్ట్ లో మహిళలు ఇచ్చిన ధైర్యం తోడుగా ఉంది. ఎలాటి అండా లేక, అంతంత మాత్రం చదువులతో జీవితానికి ఎదురు నిలిచి విజయాలను సాధిస్తున్న ఆ మహిళలు నాకు జీవిత పాఠాలు నేర్పిన గురువులు కారూ? ఈ ఉద్యోగం లేకపోతే బ్రతక లేమా?
టి టి డి , ఎస్వీబీసీ ఉద్యోగులకు ఒక సౌకర్యం ఉంది. ఒక ” లడ్డూ కార్డ్” ఉండేది. ఆ కార్డు చూపించి నెలకు పది లడ్డూలు తీసుకోవచ్చు. చివరిసారి ఆ కార్డ్ ఉపయోగించుకున్నాను. ఎస్వీబీసీ “ఉద్యోగి”గా స్వామి వారి దివ్య ప్రసాదాన్ని చివరి సారిగా తీసుకున్నాను.
హైదారాబాద్ కు బయలుదేరాను. సైడ్ బెర్త్. కూచుని బయటకు చూస్తున్నాను. మనసంతా శూన్యంగా ఉంది. ఏ ఆలోచనా లేదు. అలా వెడుతూ ఉంటే ఆ కొండ మీద దీప కాంతులతో వెలుగు లీనుతున్న స్వామివారి శంఖ చక్రాలు, వాటి మధ్య ధగధగ లాడుతున్న ఊర్ధ్వ పుండ్రం దర్శనమిచ్చాయి. వాటిని చూడగానే ఏదో తెలియని అనాది కాల దుఃఖం … ” ఇంతేనా? ఇంతవరకేనా నీ సేవ చేసే అవకాశం? నా సేవలో ఏదో లోపం ఉండే ఉంటుంది. లేకపోతే ఎందుకు పంపించేస్తావు?” అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. కానీ…
” చేయి వదలలేదు ఆ స్వామి!” రేపు…
Leave a comment