” చేయి వదలలేదు ఆ స్వామి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 104

నా రాజీనామా లేఖను రామలక్ష్మి గారు జె ఇ ఓ యువరాజ్ కు పంపారు. ఆయనే ఛానల్ కి “ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ” కనుక ముందు ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆయన వెంటనే ఆమోదించారు. ఆమోదిస్తారని నేను ఊహించినదే. నా మీద వచ్చిన ” ఆరోపణ”లు ఆయన మీద ఎంతో కొంత ప్రభావం చూపాయని నా భావన. “బయటి వారికి ఇచ్చిన సీరియల్స్ ఆపేయాలి” అనే నిర్ణయం దగ్గర రెండు సీరియల్స్ వారికి సపోర్ట్ గా నేను స్టాండ్ తీసుకున్న విషయం ముందే చెప్పాను. ఒకసారి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నేను, ఇన్ హౌస్ ప్రొడ్యూసర్ టి. శ్రీనివాస రావు, మరొక ఇన్ హౌస్ ప్రొడక్షన్ మేనేజర్ రాత్రి భోజనం చేయటానికి ఒక హోటల్ కి వెళ్ళాము. అక్కడికి శ్రీవాణి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ అప్పారావు కూడా వచ్చారు. ఈయన టెలి ఫిల్మ్ విషయంలో నేను అప్పుడు మాట్లాడాను. అందరం పరిచయస్థులమే కనుక ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఆ సమయంలో యువరాజ్ కుటుంబ సమేతంగా అదే హోటల్ కు వచ్చారు. మమ్మల్ని చూశారు కూడా. 

జె ఈ ఓ ఆమోదం పొందిన నా రాజీనామా లేఖ ఈ ఓ కృష్ణారావు గారి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే జె ఈ ఓ ఆమోదం పొందిన ఆ లెటర్ మీద ఆయన నన్ను పిలిచి డిస్కస్ చేయమని వ్రాశారు. జె ఈ ఓ పిలుపు వచ్చింది. వెళ్ళాను. జె ఈ ఓ అడిగారు రాజీనామా కారణం. మా అబ్బాయి విషయం ముందుగా చెప్పాను. తరువాత ” అసలు” విషయం చెప్పాను. ” సర్! నేను ఇక్కడికి వచ్చింది పని చేయటానికి కానీ లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవటానికి, నిందలు పడటానికి కాదు. ఆ అవసరం నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను!”  ఆయన ఏమీ మాట్లాడలేదు. “ఈ ఓ గారికి చెబుతాను” అని మాత్రం చెప్పారు. నేను వచ్చేశాను.

కొద్ది రోజులకు రామలక్ష్మి గారు ఫోన్ చేశారు… ” ఈ ఓ గారు హైదారాబాద్ వస్తున్నారు ఏదో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో మీటింగ్ కి. మిమ్మల్ని వచ్చి కలవమన్నారు”… అని. 

ఆ రోజు ఆయనను కలవటానికి వెళ్ళాను. ” అయితే మానేస్తున్నారు. రిటైర్ అయిపోతున్నారా?” అని అడిగారు.

” మానేస్తున్నాను అంతే సర్! రిటైర్ కావటం లేదు. ఫ్రీలాన్స్ చేస్తాను” అన్నాను.

” అయితే ఆ చేసేది ఏదో ఎస్వీబీసీ కి చేయండి” అన్నారు.

అంతకన్నా కావలసినది ఏముంది? తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి అంటే స్వామి వారికి ” విష్వక్సేన స్థానీయుడు” అని నా అభిప్రాయం. ఈ మాట ఈ రోజు అనటం లేదు…రామలక్ష్మి గారితో చాలాసార్లు అన్నాను. శ్రీవారి కార్య నిర్వహణ అధికారి ఒక మాట చెప్పారు అంటే అది ” స్వామి ఆజ్ఞ” యే!

బయటి వారికి సీరియల్స్ ఇవ్వటం నిలిపి వేశాక కృష్ణారావు గారు ఛానల్ లో ఉన్న ప్రొడ్యూసర్లు సీరియల్స్ నిర్మించే అవకాశం ఇచ్చారు. ఒకవేళ బయటి వారికి ఇవ్వవలసి వచ్చినా దానికి ఇన్ హౌస్ ప్రొడ్యూసర్ ఒకరు ఇన్ ఛార్జ్ గా ఉండాలి. ఆ సందర్భంలో వచ్చిన చర్చలో నేను కావ్యకంఠ గణపతి ముని జీవితాన్ని సీరియల్ గా చేయాలని ప్రతిపాదించాను. క్లుప్త కథ ఇచ్చాను. ఆ సీరియల్ బాధ్యతను రామలక్ష్మి గారు ప్రొడ్యూసర్  టి. శ్రీనివాస రావుకి అప్పగించారు. ఆయన బుర్రా సాయి మాధవ్ చేత సింగిల్ లైన్ ఆర్డర్ వ్రాయించుకున్నారు. చివరికి ఏమైంది అనేది ఇప్పుడు గుర్తు లేదు కానీ ఆ సీరియల్ స్క్రిప్ట్ బాధ్యత నాకు వచ్చింది.

కావ్యకంఠ గణపతి ముని గొప్ప మంత్ర సిద్ధుడు. మంత్ర విద్య మీద స్త్రీ పురుషులు అందరికీ అధికారం ఉండాలని వాదించిన వ్యక్తి. మనం అందరం ఇప్పుడు ” రమణ మహర్షి” అని పిలుస్తున్న పేరు ఆయన పెట్టినదే. ఆయనను ” భగవాన్ శ్రీరమణ మహర్షి” అని పిలవాలని నిర్దేశించిన వ్యక్తి ఆయన. రమణులు ఆయనను ఆప్యాయంగా ” నాయన” అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య  సంగ్రామానికి ఆధ్యాత్మిక – మంత్ర శక్తి తోడు కావాలని భావించి యువతకు మంత్ర దీక్షలు ఇచ్చిన వాడు ఆయన. జీవించి ఉండగా ” కపాల భేదన సిద్ధి” పొందిన మహాత్ముడు గణపతి ముని. ఆయన జీవిత గమనాన్ని సీరియల్ స్క్రిప్ట్ వ్రాసే అదృష్టం నాకు రావటం శ్రీ గురు కృప కాక మరేమిటి?

ఈ సీరియల్ మాత్రమే కాదు మరొక చర్చా కార్యక్రమం ” ధర్మ క్షేత్రం” నేపథ్యంలోనే కృష్ణారావు గారు నాకు ఈ ఫ్రీ లాన్స్ ఆఫర్ ఇచ్చారని అనుకున్నాను. ఆ ” ధర్మ క్షేత్రం” గురించి కొంత చెప్పాలి.

చెప్పాను కదా … స్వామి అచ్యుతుడు… తాను ” చేపట్టిన వారిని”, తనను ” పట్టుకొన్న వారిని” స్వామి వదలడు! అచ్యుతాయ నమః!

” ధర్మ క్షేత్రం ఎందుకు మొదలు పెట్టారు?” రేపు…


Leave a comment