స్వీయ అన్వేషణ – 104
కృష్ణారావు గారు ఎస్వీబీసీ కి రెండు బాధ్యతలు అప్పగించారు. రెండూ చర్చా కార్యక్రమాలే. వాటిలో ఒకటి ” సత్యమేవ జయతే!” టి టి డి పైన వచ్చే ఆరోపణలను చర్చించి త్రిప్పికొట్టే చర్చా కార్యక్రమం. దీని రూపకల్పన, బాధ్యత టి టి డి లైజాన్ ఆఫీసర్ గా ఉన్న వేంకట శర్మ కు అప్పగించారు.
ఇక “ధర్మ క్షేత్రం”. అప్పట్లో టి టి డి నిర్వహణలోని ” హిందూ ధర్మ ప్రచార పరిషత్”కు అధ్యక్షుడు రాళ్ళబండి కవితా ప్రసాద్. ఈయన నేను ఆంధ్ర పత్రికలో పని చేస్తున్న నాటి నుంచీ మంచి మిత్రుడు. అప్పట్లో మిత్రుడు వివేకానందం, నేనూ, కవితా ప్రసాద్, మరికొందరు మిత్రులం కలసి ” రస తరంగిణి” అనే ఒక సంస్థను ప్రారంభించి, అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాం. ఆ కవితా ప్రసాద్ తో చర్చించి ధర్మ సంబంధ విషయాల ప్రచారానికి ఈ” ధర్మ క్షేత్రం” కార్యక్రమం చేయాలని కృష్ణారావు గారు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంపాదకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా పని చేసిన పొత్తూరి వేంకటేశ్వర రావు గారిని ఏంకర్ గా అనుకున్నారు.
సరే… ఈ కార్యక్రమానికి ఛానల్ లో ఒక వ్యక్తి కావాలి. ఆ చర్చా కార్యక్రమానికి అవసరమైన ప్రశ్నలు తయారు చేయటం, షూటింగ్ – ఎడిటింగ్ ల దగ్గర ఉండటం… ఎవరు చేస్తారు? ఛీఫ్ ప్రోగ్రామింగ్ హెడ్ రామలక్ష్మి గారిని అడిగారు కృష్ణారావు గారు. ఆమె నా పేరు చెప్పారు.
నా పేరు చెప్పగానే ఆయన వేసిన ప్రశ్న… “Is he vaishnava fanatic?’
” కాదు” అని చెప్పారు ఆమె. ఆమె మాట మీద నమ్మకంతో ఆ కార్యక్రమం నాకు ఇచ్చారు. దానికి ప్రొడ్యూసర్లుగా టి. శ్రీనివాస రావు, కొన్నిసార్లు ఉదయ్ కుమార్ కూడా ఉండేవారు.
తిరుపతిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు కరడు కట్టిన శ్రీవైష్ణవులు, మరొకరు వారికి సంపూర్ణ వ్యతిరేకులు. ఆ నేపథ్యంలోనే నా పేరు వినగానే కృష్ణారావు గారు అలా అడిగి ఉంటారు.
నిజానికి భక్తి టీవీ లో కానీ, ఎస్వీబీసీ లో కానీ నేను వ్రాసిన స్క్రిప్ట్స్ లో శివ సంబంధమైనవే ఎక్కువ!
ధనుర్మాసంలో శ్రీ వైష్ణవ సంప్రదాయపరులు అందరూ గోదాదేవి గానం చేసిన ” తిరుప్పావై” అనుసంధానం చేస్తారు. అలాగే తమిళదేశంలో శివ భక్తులు ” తిరువెంబావై” అనుసంధానం చేస్తారు. ఎస్వీబీసీలో మొట్టమొదటిసారిగా ధనుర్మాసంలో ఈ ” తిరువెంబావై” కార్యక్రమం నేను ప్రతిపాదించి, ప్రవేశ పెట్టాను. ఉదయం ” తిరుప్పావై”, సాయంత్రం ” తిరువెంబావై” రెండూ చెప్పించాము.
ఇక ” ధర్మ క్షేత్రం” కార్యక్రమానికి ఏంకర్ గా అనుకున్న పొత్తూరి వారు నాకు సుపరిచితులే. ఆంధ్రప్రభ వీక్లీ లో నేను చేరేసరికి ఆయన రిటైర్ అయిపోయారు. అలా ఆయనతో కలసి పని చేసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఆంధ్రపత్రికలో ఉన్నప్పటి నుంచీ అనేక సందర్భాలలో ఆయనను కలిశాను. ఆయనకు కూడా నా గురించి ఒక అంచనా ఉంది. ఇప్పుడు ఆయనతో కలసి పనిచేసే అవకాశం ఇప్పుడు కలిగింది.
సరే… మొదటిగా ఏ విషయం తీసుకోవాలి?
ఈ కార్యక్రమం గురించిన ప్రస్తావన రావటానికి కొద్ది కాలం ముందు ఒక టివీ చర్చా కార్యక్రమంలో దళిత నాయకుడు కత్తి పద్మారావు శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం గురించి విమర్శలు గుప్పించారు. అదంతా పరమ శృంగారమయం అని విమర్శించారు. దానిని ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేయకూడదు అనీ, దాని స్థానంలో “అంబేద్కర్ సుప్రభాతం” ప్రసారం చేయాలని ఆ చర్చా కార్యక్రమంలో ఆయన ప్రతిపాదించారు! ఈ విమర్శలు చేసే వారందరూ… కమలా కుచ చూచుక… అనే ఒకే శ్లోకం పట్టుకుంటారు. ఆ శ్లోకానికి గోపాలకృష్ణయ్య గారు చేసిన వ్యాఖ్యానం చూసి ఉంటే ఈ మాటలు వచ్చేవి కావు. ఇక్కడ ” కమలా కుచ చూచుక కుంకుమతః” అంటే ఈ ” కుదృష్టుల”కు కేవలం ” లక్ష్మీ దేవి స్తనాగ్రములు” మాత్రమే కనిపిస్తాయి! కనీస తర్కం కూడా ఉండదు వీరికి! ” కమలా = తామర పూవుల, కుచ= మధ్యనున్న దుద్దు నందలి, చూచుక = కేసరముల, కుంకుమతః= పుప్పొడితో” ఎర్రబడిన నీలశరీరము కలవాడా! ” అని అర్థం చెప్పారు ఆయన. చూసే దృష్టిలో లోపం ఉంటే ” దుష్టార్ధాలు” పుట్టుకొస్తాయి. వీటిని ఖండించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
అదే టాపిక్ తీసుకోవాలి అనుకున్నాను. కవితా ప్రసాద్ కి, పొత్తూరి వారికి చెప్పాను. వారూ అంగీకరించారు. ప్రశ్నలు తయారు చేసి రామలక్ష్మి గారికి, కవితా ప్రసాద్ కి, పొత్తూరి వారికి చూపించాను. అందరూ అంగీకరించారు.
ఆ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్ పూర్తి అయింది. అలాగే వేంకట శర్మ నిర్వహణలో ” సత్యమేవ జయతే” కూడా సిద్ధం అయింది. రెండూ ఈఓ కృష్ణారావు గారి ప్రివ్యూకి రెడీ అయ్యాయి. అప్పటికే ” సత్యమేవ జయతే” ప్రోగ్రాం ఎస్వీబీసీ కి ” ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం” అని ఆయన నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రసార సమయం తెలియచేస్తూ పత్రికా ప్రకటన కూడా సిద్ధం చేయించారు.
ప్రివ్యూ సమయంలో వేంకట శర్మ, ఆ కార్యక్రమం ప్రొడ్యూసర్, రామలక్ష్మి గారు, కవితాప్రసాద్, టి. శ్రీనివాసరావు, నేనూ ఉన్నాం.
ముందుగా ఆయన ” సత్యమేవ జయతే!” కార్యక్రమం చూశారు.
తరువాత ” ధర్నక్షేత్రం” చూశారు. “ధర్మ క్షేత్రం” కార్యక్రమం సగం చూడగానే ఆయన పి ఆర్ ఓ ను పిలిచి, ఆ పత్రికా ప్రకటనలో ” సత్యమేవ జయతే!” బదులు “ధర్మక్షేత్రం” పెట్టమని ఆదేశించారు!
అలా ధర్మ క్షేత్రం ద్వారా మొట్ట మొదటి సారి నాకు ఈఓ కృష్ణారావు గారు పరిచయం అయ్యారు.
ఈ నేపథ్యంలో నేను ఛానల్ నుంచి బయటకు వచ్చినా ఫ్రీ లాన్స్ అవకాశం ఇచ్చారు అనుకుంటాను. చెప్పాను కదా… స్వామి వదలడు!
“అటు నుంచి ఇటు మార్చుకున్నాడు స్వామి!” రేపు…
Leave a comment