స్వీయ అన్వేషణ – 105
ఎన్నో జ్ఞాపకాలు ఎస్వీబీసీలో! ఎన్నో కార్యక్రమాలు! కొన్ని సంతోషాన్ని కలిగిస్తే, కొన్నిటి విషయంలో నిరాశ! మనుష్యుల తీరుతెన్నులు ఆశ్చర్యం కలిగించేవి. ” ఇలా కూడా ఉంటారా?” అనిపించేది. స్వామి ఎందుకు పిలిచాడో… మనం మాత్రం మారము.
సహజమైన గాలి, వెలుతురు చొరబడని గర్భ గుడిలో, పగలూ రాత్రీ అని లేకుండా నిలువు కాళ్ళ మీద నిలబడి, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక కాసేపు నిద్ర పోదామని ఒక కునుకు కునికేలోపే ” కౌసల్యా సుప్రజా రామా…” అంటూ మేలుకొలుపు పాడేస్తే, “అప్పుడే తెల్లవారిపోయిందా? పాపం… ఎన్ని కష్టాల్లో ఉన్నారో?” అనుకుని, ఒక్క ఉదుటన నిద్ర వదల్చుకుని, ఆ కష్టాలు తీర్చి, “ఆపద మ్రొక్కులు” అందుకొని, ఆ సొమ్ములో నుంచి జీతాలు చెల్లించి, పోషిస్తూ ఉంటే… “అబ్బే… మనకి చాలదే?”. ఇంకా కావాలి… ఇంకా కావాలి!
నిజాయితీగా పని చేసేవారు ఎక్కడైనా కొద్ది మందే! కానీ… స్వామి సన్నిధిలో కూడా… ఆ నిజాయితీ లేకపోతే?!
ఒక కార్యక్రమం చేయాలి. దానికి ఛానల్ లో ఉన్న ” రిసోర్స్ పెర్సన్స్” పనికి రాలేదు! బయటి నుంచి కావాలట! కొన్ని పుస్తకాలు కొనాలట! కొన్ని డి వి డి లు కావాలట! బడ్జెట్ పెట్టాడు ఒకాయన. దానిలో బయటి నుంచి రిసోర్స్ పర్సన్ కి ఇవ్వటానికి, పుస్తకాలు, డీవీడీలు కొనటానికి బడ్జెట్! ఆ రిసోర్స్ పర్సన్ ఆయన అత్యంత సమీప బంధువు! ఆ కార్యక్రమం ప్రతిపాదన చూడమని రామలక్ష్మి గారు నాకు ఇచ్చారు. చూశాను. ఆ కార్యక్రమం అవసరమే. అయితే కొన్ని సూచనలు చేశాను. కావలసిన పుస్తకాలు, డీవీడీలు లిస్ట్ ఇమ్మని, వాటిని ఎస్వీబీసీ లైబ్రరీ ఇండెంట్ ద్వారా కొనాలని సూచించాను. ఆ సూచనలతో నేను ఆయనకు శత్రువును అయిపోయాను! ఆకాశవాణిలో పని చేసి, ఆంధ్రప్రభ వీక్లీలో ఎడిటర్ గా వచ్చిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి దగ్గర, ” వెలుగు” ప్రాజెక్ట్ లో నేర్చుకున్న ప్రభుత్వ విధానాలు నాకు ఈ పాఠాన్ని నేర్పాయి.
భగవంతుడు నేను చేసిన ప్రతి ఉద్యోగానికి నాకు ముందుగానే ” శిక్షణ” ఇచ్చి పంపేవాడు!
మరొకాయన ఉన్నాడు. ఒక కార్యక్రమంలో ఒక వక్తకు పారితోషికం చెక్ వచ్చింది. ఆ చెక్ తీసుకొని ఆయన ఆ వక్త ఇంటికి వెళ్ళాడు. ” మీకు చెక్ వచ్చింది సర్!” అంటూ ” అవునూ… ఈ డబ్బు ఏం చేస్తారు సర్?” అని అడిగాడు. ఆయన ” ఆ డబ్బు స్వామివారిది. ఎవరైనా చదువుకునే పిల్లలకు ఇస్తాను” అన్నారు. ” సర్! మీరు ఏమీ అనుకోకపోతే మా అబ్బాయి కూడా ఇంటర్ లో ఉన్నాడు ” అన్నాడు ఈయన. ఆ వక్తకు ఈయన ఉద్దేశ్యం అర్థం అయిపోయింది. అసహ్యం వేసింది. ” తీసేసుకోండి” అని వదలేశాడు.
ఇలాటి వాళ్ళు చాలా మందే ఉన్నారు ఆ ఛానల్ లో!
వీళ్ళ సంగతి ప్రక్కన పెడితే… నేను ఛానల్ నుంచి బయటకు వచ్చాక చేసిన కార్యక్రమాలలో ” విజయీభవ!” క్విజ్ ఒకటి. నాకు సంతృప్తి ఇచ్చిన వాటిలో ఒకటి కూడా. ఇది విద్యార్థుల కోసం రూపొందించింది. ఈ కార్యక్రమానికి కిరణ్ ప్రొడ్యూసర్ కాగా టి. శ్రీనివాసరావు కో ఆర్డినేట్ చేశారు.
నలుగురు విద్యార్థులు ఉంటారు. ఆ కార్యక్రమం అయిదు విభాగాలుగా ఉంటుంది. ఇదంతా మాకెందుకు? అనకండి. ఒక విచిత్ర విషయం చెబుతాను. అయిదు విభాగాలలో మొదటిది ” వడి వడిగా…” అంటే ఇప్పుడు మనం అంటున్నామే” రాపిడ్ ఫైర్” అని అదన్నమాట. ప్రతి విద్యార్థినీ అయిదు ప్రశ్నలు అడుగుతారు. ఎవరు ముందుగా ఘంటానాదం చేస్తే వారు సమాధానం చెప్పాలి. రెండవది ” చిత్ర సీమ”. ఒక పౌరాణిక చిత్రం క్లిప్ చూపించి దానిలో నుంచి ప్రశ్నలు. మూడవది ” గానమె సోపానము”. ఒక గీతం, ఒక కీర్తన, ఒక కృతి, ఒక భజన్…ఇలా ఏదో ఒకటి వినిపించి దాని నుంచి ప్రశ్న. ఈ ప్రశ్నలు అది ఎవరు వ్రాశారు అని ఉండవచ్చు, దానిలోని ఒక పదానికి అర్థం చెప్పమనవచ్చు… ఇలా. తరువాత ” నవరత్నాలు” దైవభక్తులు, దేశ భక్తులు, దేశ చరిత్ర… దేని గురించి అయినా తొమ్మిది ప్రశ్నలు ఉంటాయి. చివరగా ఒక కథ… దానిలో ప్రశ్నలు.
ఈ కార్యక్రమం నేను ఎస్వీబీసీ లో మానేశాక చేశాను. దీనిలో ప్రశ్నలు, సమాధానాలు, సాంగ్ – ఫిల్మ్ క్లిప్స్, అవసరమైన ఇమేజెస్ అన్నీ నేను సేకరించి ఇచ్చేవాడిని. సాంగ్ – ఫిల్మ్ క్లిప్స్ టైమ్ లైన్ తో సహా ఇచ్చే వాడిని. సాంగ్ క్లిప్స్ లో ప్రసిద్ధమైనవి అయితే వాటి క్లిప్స్ ఇచ్చే వాడిని కాదు. జస్ట్ ఆ కీర్తన అని పంపేవాడిని. అంతే.
ఆ క్రమంలో ఒకసారి ” జగదానంద కారక అనే కీర్తన ఎవరు వ్రాశారు?” ఇది ప్రసిద్ధమైన కీర్తన కనుక నేను క్లిప్ పంపలేదు. అని ప్రశ్న ఇచ్చాను. “త్యాగరాజ స్వామి” అని సమాధానం కూడా ఇచ్చాను.
తిరుపతి నుంచి ఫోన్ చేశారు. ” సర్! మీరు ఇచ్చిన వాటిలో ఒక సాంగ్ ప్లే చేస్తాము. వినండి. ఇదేనా?” అని అడిగారు. సరే అన్నాను. ఆ “సాంగ్” వినిపించారు. నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. ” ఇంత జ్ఞానులను ఎస్వీబీసీ లోకి ఎలా తీసుకున్నావ్ స్వామీ?” అనుకున్నాను.
వారు వినిపించిన “సాంగ్” అప్పట్లో విడుదలైన ” శ్రీరామరాజ్యం” అనే సినిమాలో పాట!!! “ఒకప్రక్క ‘త్యాగరాజ స్వామి ‘ అని సమాధానం ఇచ్చినా కూడా ఈ సినిమా పాట ఎలా వినిపిస్తార్రా నాయనా? ” అనుకుని ” అది కాదు బాబూ! ఇంక శ్రమ పడకండి. నేను పంపిస్తాను” అని ఆ క్లిప్ పంపవలసి వచ్చింది.
అలాగే మరొక సందర్భం… గాయకుడు గంగాధర శాస్త్రి చేత “మధురాష్టకం” గానం చేయించి రికార్డు చేశారు. ఒక్కొక్క శ్లోకం కార్డ్ వేస్తూ, నేపథ్యంలో ఆ స్తోత్రం వస్తుంది. ఆ కార్యక్రమానికి నిర్వాహకుడు అయిన ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు.
” సర్! మీ ఫోటో ఒకటి కావాలి. పంపండి” అన్నారు.
” నా ఫోటో ఎందుకు?” అని అడిగాను.
” అదే సర్! మధురాష్టకం ఉంది కదా? దాంట్లో మీ ఫోటో వేద్దామని!” అన్నారు ఆ మహానుభావుడు!
” దానికి నా ఫోటో ఎందుకు?’ అని అడిగాను.
” అది మీరే రాశారు కదా సర్! వల్లభాచార్య కృతం అని మీరే ఇచ్చారుగా?” అన్నారు ఆ మహాత్ముడు!
” అయ్యా! అది వ్రాసిన వల్లభాచార్యులు నేను కాదు. ఆయన శుద్ధాద్వైత సిద్ధాంత కర్త. ఆయన 1478 ప్రాంతంలో జన్మించారు. నేను 1957 లో పుట్టాను” అని చెప్పవలసి వచ్చింది. ఇలాటి ” మహాత్ముల” సాంగత్య దురదృష్టం నాకు కలిగింది!
అలా ఎస్వీబీసీ నుంచి బయటకు వచ్చాక నాలుగైదు కార్యక్రమాలు నా చేతికి వచ్చాయి.
రామలక్ష్మి గారు ఒకసారి అన్నారు… ” మానేస్తాను, మానేస్తాను అన్నారు. కానీ స్వామి వారు మిమ్మల్ని వదల్లేదు. ఆ చంక నుంచి ఈ చంక లోకి మార్చుకున్నాడు. అంతే!” అన్నారు.
నిజమే!
” ఆ సీరియల్ కి ఎన్ని అడ్డంకులో!” రేపు…
Leave a comment