” ఆ సీరియల్ కి ఎన్ని అడ్డంకులో?!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 106

నేను దాదాపుగా తొమ్మిది, పదవ తరగతులలో ఉన్నప్పటి నుంచీ “భారతి” సాహిత్య మాస పత్రిక చదువుతూ ఉండేవాడిని… ఆ పత్రిక ఆగిపోయే వరకూ. 1970 ప్రాంతాలలో భారతిలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం ప్రసక్తి దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు వచ్చింది!

తిరుపతిలో ఎస్వీబీసీ లో ఒక ప్రివ్యూ కమిటీ ఉండేది. దానిలో ఆచార్య బ్రహ్మానందం, ఆచార్య సర్వోత్తమ రావు, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీమాన్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు సభ్యులు. ఈ చివరి వారు ఎప్పుడూ ఈ కమిటీ సమావేశాలకు వచ్చినట్టు నేను చూడలేదు!

ఒకసారి ఈ కమిటీ మీటింగ్ జరిగింది. సుదీర్ఘమైన సమావేశం కాబట్టి ఛానల్ వారు అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. భోజనాలు అయ్యాయి. చేతులు కడుగుకోవటానికి వెడుతున్నాను. వాష్ బేసిన్ దగ్గర ఆచార్య బ్రహ్మానందం గారు ఉన్నారు. వారి తరువాత నేను చేతులు కడుగుకొని, వారి ప్రక్కన నడుస్తూ…

” సర్! భారతిలో ‘బాల భాష – వ్యాకరణం ‘ వ్యాసాలు వ్రాసింది మీరే కదా?” అని అడిగాను.

ఆయన ఒక్కసారిగా ఆగిపోయి, నా వైపు చూసి ” ముప్ఫై ఏళ్ల నాటి మాట! మీరు చదివారా?” అన్నారు ఆశ్చర్యంగా.

” చదివాను సర్! అందుకే అడిగాను” అన్నాను.

ఆయన సంతోషంగా నా భుజం మీద చేయి వేసి నడుస్తూ ” ముప్ఫై ఏళ్ల క్రింద వ్రాసినది చదవటం, దానిని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం… I am very happy. ఒక పాఠకుడు తను వ్రాసిన దానిని ఇన్నేళ్ళ పాటు గుర్తు పెట్టుకొని అడగటం కన్నా వ్రాసిన వాడికి ఇంకేం కావాలి?” అన్నారు. అలా ఆ నాటి నుంచీ ఆయన నన్ను ఎంతో సన్నిహితంగా, ఆప్యాయంగా చూసేవారు.

” నాయన” సీరియల్ అయిపోయింది. ప్రొడ్యూసర్ టి. శ్రీనివాస రావు మరొక సీరియల్ చేద్దామని అన్నారు. ఏం చేయాలి? అప్పుడు వచ్చిన ఆలోచన  “శ్రీకూరేశ చరితం”!

కూరేశులు భగవద్రామానుజుల శిష్యులు. వయసులో ఆయన కంటే పెద్దవారు. తన ఆచార్యుని ప్రాణ రక్షణకు సిద్ధపడి, తన కన్నులు తానే పెరకి వేసుకొన్న గురుభక్తి పరాయణుడు! ఆచార్యుని పట్ల శిష్యుని నిష్ఠ , భగవంతుని పట్ల భక్తుని భావన ఎలా ఉండాలి అనేది తన జీవితంలో ఆచరించి చూపిన మహానుభావుడు! ఆయన చరిత్ర చెప్పాలి అనుకున్నాను. అప్పటికే శ్రీమాన్ సింగారాచార్యులు గారు శ్రీ కూరేశ చరితం వ్రాసి ఉన్నారు. వారి అనుమతి తీసుకొని, ఆ గ్రంథం ఆధారంగా స్క్రిప్ట్ తయారు చేశాను. దానిని ముందుగా ఒక టెలి ఫిల్మ్ గా చేద్దామని అనుకొని కూడా తరువాత సీరియల్ గా మార్చారు.

ముందుగా ఆ సీరియల్ ప్రతిపాదన ప్రివ్యూ కమిటీకి ఇచ్చాము. అందరూ అంగీకరించినా ఒక సభ్యుడు సర్వోత్తమ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కథలో అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, శైవ – వైష్ణవ విభేదాలు ఉన్నాయని ఆయన అభ్యంతరం!

ఒక చోళ చక్రవర్తి పరమ శివభక్తుడు. ఎంత శివ భక్తుడో అంతకంత విష్ణు ద్వేషి! ” శివుని కన్న వేరే ఎవరూ లేరు!” అనే పత్రం మీద శ్రీ వైష్ణవుల అందరి సంతకాలు సేకరించమని ఆదేశించాడు. అయితే అతని దగ్గర ఆశ్రయం పొందిన నాలూరన్ అనే ఒక వైష్ణవుడు ” అందరూ ఒప్పుకుంటే ఏముంది? రామానుజులు ఒప్పుకొని సంతకం చేస్తే అప్పుడు కదా ఫలితం?” అని రెచ్చగొట్టాడు. ఆ చక్రవర్తి రామానుజులను తీసుకొని రమ్మని భటులను పంపాడు. ఆ సమయంలో ఆయన ఆశ్రమంలో లేరు. రాజ్యంలో జరుగుతున్న విషయం తెలుసు కనుక కూరేశులు తన ఆచార్యునికి రానున్న ప్రమాదాన్ని ఊహించి, ఆయన కాషాయ వస్త్రాలను, దండాన్ని తాను ధరించి రాజసభకు వెళ్లారు. అక్కడ చక్రవర్తి తో వాదోపవాదాలు జరిగాయి. చక్రవర్తికి కోపం వచ్చింది. కూరేశుల కళ్ళు పెరికివేయమని ఆదేశించాడు!

” నీవంటి వాడిని చూసిన ఈ నేత్రాలు నాకు అవసరం లేదు!” అంటూ ఆయన తన కళ్ళను తానే పెరికివేసి పారేశాడు.

తన ఆచార్యుని ప్రమాదం నుంచి కాపాడుకోవటానికి ఆయన చేసిన మహత్తర సాహసం, త్యాగం ఇవి.

ఈ కథ శైవ – వైష్ణవ విభేదాలను రెచ్చ గొడుతుంది కనుక అనుమతి ఇవ్వ కూడదు అని సర్వోత్తమ రావు అభ్యంతరం.

ఇది చరిత్ర. చరిత్రలో నమోదైన విషయం. మీకు గుర్తు వుంటే ” దశావతారం” సినిమా ప్రారంభ సన్నివేశంలో ఉన్న చక్రవర్తి ఇతడే. ఆ సన్నివేశం మీద సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. ” ఇది చరిత్రలో భాగం. అభ్యంతరాలకు అవకాశం లేదు” అని సుప్రీం కోర్టు ఆ కేసును కొట్టివేసింది.

అలాగే ఆయన చెప్పిన అభ్యంతరాన్ని  కమిటీలోని ఇతర సభ్యులు అందరూ త్రోసిపుచ్చారు. ఆయన కూడా చాలా అసంతృప్తి తోనే సంతకం పెట్టవలసి వచ్చింది. అనుమతి లభించింది. అది ఆ సీరియల్ దాటిన మొట్ట మొదటి పెద్ద అడ్డంకి!

అలా ప్రివ్యూలో ప్రతి ఎపిసోడ్ దగ్గరా ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తేవారు. నా వివరణ నేను ఇచ్చేవాడిని. కమిటీలోని లక్ష్మణయ్య గారు, బ్రహ్మానందం గారు, కొండమాచార్యులు గారు కొండంత అండగా నిలిచేవారు.

రాజసభ ఎపిసోడ్ వచ్చింది. ఆ ఎపిసోడ్ స్క్రిప్ట్ లో నేను ఎక్కడా “శైవం” అని కానీ, ” వైష్ణవం” అని కానీ ఎక్కడా వ్రాయలేదు! ఆయా మతాల పేర్ల బదులు ” ధర్మం” అనే మాటనే వాడాను. ఈ సీన్ లోనే కూరేశులు కళ్ళు పెరకివేసుకోవటం వస్తుంది. సర్వోత్తమ రావు గారు ఈ సీన్ కి గట్టిగా అభ్యంతరం చెప్పారు. ఆ సీన్ పూర్తిగా తొలగించాలని అన్నారు. మిగిలిన వారు అంగీకరించ లేదు. ఆ సీన్ తీసేస్తే అసలు సీరియల్ ప్రాణం తీసేసినట్టే అని అభిప్రాయపడ్డారు. ఆ సీన్ ఉండి తీరాలి అని తేల్చారు. చివరకు సర్వొత్తమరావు గారు ” ఎవరో ఇద్దరిని తృప్తి పరచటానికి ఈ సీరియల్ చేస్తున్నారు” అని ఆ ఎపిసోడ్ స్క్రిప్ట్ మీదే స్వహస్తాలతో వ్రాశారు. ఆ ” ఇద్దరు” ఎవరో మరి? ఏది ఏమైనా ఇలాటి ఎన్నో గండాలు దాటి ” శ్రీ కూరేశ చరితం” వెలుగు చూసింది!

ఒక వైష్ణవ భక్తశిఖామణి చరిత్ర తెరకు ఎక్కించటానికి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ఇన్ని అడ్డంకులా? తన ఆచార్యుని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు పెట్టిన ఒక శిష్య సత్తముని చరిత్రకు ఇన్ని ఆటంకాలా?

ఏవో ” వ్యక్తిగత ఎజెండా” లు లేకపోతే ఇలాటి అడ్డంకులు ఎలా వస్తాయి? చరిత్రను చరిత్రగా చెప్పటానికి ఎందుకు అడ్డం పడిపోతారు?

నా ఊహ మాత్రమే సుమా… ఈ సీరియల్ మూలకథా రచయిత శ్రీమాన్ సింగరాచార్యులు గారు. ఆయన టిటిడి లో ” ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్” అధికారిగా పని చేశారు. ఆయనకు ముందు ఆ స్థానంలో పని చేసిన వారు ఆచార్య సర్వోత్తమ రావు గారు. అసలు సర్వోత్తమ రావు గారిని ఆ ప్రాజెక్ట్ కి అధికారిగా టిటిడి ఎలా నియమించింది అనేది నాకు అసలు  అర్థం కాని విషయం! ఆళ్వారులు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన వారు. ఈయన శ్రీ ఆనంద తీర్థ మాధ్వ సంప్రదాయానికి చెందిన వారు. ఆయన ఎలా పని చేశారు అనేది ప్రక్కన పెడితే ఒక ప్రముఖ సంప్రదాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కు మరొక ప్రముఖ సంప్రదాయానికి చెందిన వ్యక్తిని అధికారిగా నియమించటంలోని “లాజిక్” ఏమిటి? టిటిడి విజ్ఞత ఇలా ఉంటుంది!

ఆయన ” ఎవరో ఇద్దరిని తృప్తి పరచటానికి ఈ సీరియల్ చేస్తున్నారు” అని వ్రాసిన వ్యాఖ్యలో ఆ ” ఇద్దరు”లో ఒకరు శ్రీమాన్ సింగరాచార్యులు గారు కాగా రెండవది నేను అనుకొంటాను. ఇద్దరమూ శ్రీ వైష్ణవులమే కదా మరి!

ఏది ఏమైతే ఏమి… అసలు వైష్ణవ సంప్రదాయానికే చెందని ఆచార్య బ్రహ్మానందం, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఈ సీరియల్ కి నిష్పాక్షికంగా, సత్య నిష్ఠతో సహకరించారు! నిజానికి వారు లేకపోతే ఈ ” శ్రీ కూరేశ చరితం” సీరియల్ వెలుగు చూసేదే కాదు. వారికి శిరసా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియచేయటం నా బాధ్యత. కానీ ఇది చదవటానికి ఇప్పుడు వారిద్దరూ లేకపోవటం బాధాకరం!

” వైష్ణవుల వేడుకోలు!” రేపు…


Leave a comment