స్వీయ అన్వేషణ – 107
తిరుమల శ్రీనివాసుడు సమస్త హైందవ ప్రపంచానికీ ఆరాధ్య దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం. అయితే అది ప్రధానంగా శ్రీవైష్ణవ దివ్య క్షేత్రం. భగవద్రామానుజులు ఆ స్వామికి ఆచార్య స్థానీయులు. ఆ విధంగా శ్రీవైష్ణవ సంప్రదాయానికి ఆ క్షేత్రంలో ప్రాధాన్యం ఉంది.
శ్రీమాన్ గోపాలకృష్ణ అనే ఆయన ఈ సంప్రదాయ సభలు నిర్వహించేవారు, ఈ సంప్రదాయ గ్రంథాలు ప్రచురించేవారు. ఆయన తిరుపతిలో అలాటి సభ ఒకటి ఏర్పాటు చేశారు.
అప్పుడు టిటిడి కి కార్యనిర్వహణాధికారి ఎల్. వి సుబ్రహ్మణ్యం. ఎస్వీబీసీ లో శ్రీవైష్ణవ రామానుజ సంప్రదాయానికి చెందిన కార్యక్రమాల ఊసు లేదు. ఈ సభలో ఆ విషయాన్ని చర్చించి ఈ ఓ కు ఒక “వినతి పత్రం” సమర్పించాలని నిర్ణయించు కున్నారు. వారు అనుకుంటున్న విషయాలను నాకు తెలిపి, ఒక పత్రం తయారుచేసి పంపమని అడిగారు. అప్పటికి నేను ఎస్వీబీసీ లో లేను. మానివేసి చాలా నెలలు అయింది.
వారు అడిగినట్లు నేను ఒక పత్రం తయారు చేసి పంపాను. అయితే అది వారికి అంతగా నచ్చలేదు! ఎందుకు అంటే ఆ పత్రం లోని భాష వారికి చాలా ” పదును” గా అనిపించింది. శ్రీవైష్ణవులు ” పరమ సాత్వికులు” కదా!? నేను వ్రాసినది “డిమాండ్” చేసే విధానం! వారు కోరుకున్నది ” వినమ్ర వినతి పత్రం!” తిరుమలలో శ్రీ రామానుజ సంప్రదాయస్థులు తమ సంప్రదాయ కార్యక్రమాల కోసం బ్రతిమాలుకో వలసిన పరిస్థితి! ” డిమాండ్” చేయవలసిన వారు ” రిక్వెస్ట్” చేసే స్థితికి వచ్చారు. దీనికి మూలం ఎస్వీబీసీ లో అధికారులు అనటంలో ఏ మాత్రమూ నాకు సందేహం లేదు! ఇంతకుముందు శ్రీ కూరేశుల విషయం చెప్పాను కదా? అంత పోరాడితే కానీ పని జరగలేదు. చివరికి నేను వ్రాసి పంపిన దానిలో ఒక చెరువు నీళ్లు కలిపి పలచన చేసి ” వినతి పత్రం” ఈ ఓ కి సమర్పించారు.
ఈ ఓ ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఆ పత్రాన్ని ఎస్వీబీసీ ఛీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రామలక్ష్మి గారికి ఇచ్చి చూడమని చెప్పారు. ఆమె నాతో సంప్రదించారు. నేను రెండు కార్యక్రమాలు సూచించాను. ఆ రెండూ ఛానల్ ” ప్రైమ్ టైమ్” లో ప్రసారం చేయాలని కూడా సూచించాను. అప్పుడు వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని అనుకున్నాం. ఆమె కూడా ఆ వినతి పత్రం దృష్ట్యా అలాగే చేయాలని నిర్ణయించారు. ఉదయం 7 గంటలకు ఒకటి, రాత్రి 9 గంటలకు ఒకటి ప్రసారం చేయాలని అనుకున్నాం. కార్యక్రమాల రికార్డింగ్ పూర్తి అయింది.
ఆ సమయంలో రామలక్ష్మి గారు ఛానల్ పని మీద విశాఖపట్నం వెళ్లారు. అప్పుడు ఆ రెండు కార్యక్రమాల ” ప్రోమో” లు ప్రసారం అయ్యాయి. అవి చూసే సరికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది! అనుకున్నది ఒకటి… ఈ “ప్రోమో” లలో ఉన్నది ఒకటి! ఆ కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు అని ప్రోమోలలో ఉంది. ఆ రెండు సమయాలు పెద్దగా ఎవరూ చూసే వేళలు కావు. ” ప్రైమ్ టైమ్” లో అనుకున్న కార్యక్రమాలు ఇలా ప్రాధాన్యం లేని వేళల్లో ప్రసారం చేయటం ఏమిటి? నాకు అర్థం కాలేదు.
రామలక్ష్మి గారి ఫోన్ దొరకలేదు. అప్పుడు రిసోర్సెస్ జనరల్ మేనేజర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రికి ఫోన్ చేశాను. విషయాన్ని వివరించి “ఈ కార్యక్రమాలు ప్రైమ్ టైమ్ లో రావాలని మేడమ్ నిర్ణయించారు. ఇదేమిటి ఈ ప్రసార సమయాలు?” అని అడిగాను.
” ప్రైమ్ టైమ్ అనుకున్నారా? నాకు తెలియదు. అయినా వినేవాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడే వైష్ణవులు ఎవరున్నారు?” అన్నారు ఆయన.
రామలక్ష్మి గారి ఫోన్ దొరికాక మాట్లాడాను. ఆ రెండు కార్యక్రమాలు ప్రైమ్ టైమ్ కి మారాయి.
బాచంపల్లి వారు చేసిన వ్యాఖ్య నాకు చాలా కోపాన్ని తెప్పించింది. రామలక్ష్మి గారికి, ఆయనకి, ఈ ఓ కి ఒక లెటర్ వ్రాశాను. దానిలో ముగ్గురు వైష్ణవేతర ప్రవచనకర్తలు అదే ఛానల్ లో చెప్పిన మాటలను ఉటంకిస్తూ ప్రతి దాని చివరలో ” అవును! ఇంత ఆకట్టుకునేలా మాట్లాడే వైష్ణవులు లేరు!” అనే ” Tag Line” తో వ్రాశాను.
ఒకసారి పరిపూర్ణానంద స్వామి ఒక కార్యక్రమంలో ” తిరుమల ఆలయంలో ఏడాదికి రెండుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు” అని అన్నారు. ఆ కార్యక్రమానికి బాచంపల్లి వారే యాంకర్! తిరుమల ఆలయంలో ఏడాదికి రెండు సార్లు కాదు, నాలుగు సార్లు! ఈ విషయాన్ని చెప్పి ” అవును! ఇంతగా ఆకట్టుకునేలా మాట్లాడే వైష్ణవులు లేరు!” అన్నాను.
అలాగే చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మరొక విషయాన్ని, దానిలోని దోషాన్ని కూడా చెప్పి, అలాగే ముగించాను. ఆ లెటర్ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది.
ఈ లేఖ ముగ్గురికీ చేరింది. రామలక్ష్మి గారు ఒకసారి నాకు ఫోన్ చేశారు. ” మీరు బయట నుంచి రెండు మూడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఛానల్ లో. అన్నీ మీ పేరుతోనే వెడుతున్నాయి. పోనీ పేరు మార్చి చేయకూడదూ?” అని అడిగారు. ” చేయను. ఇకపై ఎస్వీబీసీ కి ఏ ప్రోగ్రామ్ చేయను!” అని చెప్పేశాను. కారణం…
అప్పటికే నాకు ఒక ఇన్ హౌస్ ప్రొడ్యూసర్ ద్వారా ఒక సమాచారం అందింది. “మీరు వ్రాసిన లెటర్ ఈఓ కు ఆగ్రహం కలిగించింది. మీకు ఇక మీద ఏ ప్రోగ్రాం ఇవ్వవద్దని మేడమ్ కి చెప్పారు” ఇదీ నాకు అందిన సమాచారం! నిజానిజాలతో పని లేదు. ” వడ్డించే వాడు వాడైతే ” అన్నట్టు ” మన వాళ్ళు” ఎన్ని తప్పులు మాట్లాడినా చెల్లిపోతుంది! “అది తప్పురా నాయనా!” అని చెబితే చెప్పిన వాడిని తరిమి కొట్టాలి! అంతే కానీ ” మన వాళ్ళని” ఏమీ అనకూడదు!
ఈ సంఘటనతో బయటి నుంచి కూడా ఎస్వీబీసీ కి పని చేయటం మానేశాను! మరి ” సంపాదన” ఎలా? గడవాలి కదా?
మా అన్నమాచార్యుల వారు చెప్పిన మాట ఉంది కదా…
ఇదిగో ఇదే…
పుట్టుభోగులము మేము
భువి హరిదాసులము ।
నట్టనడిమి దొరలు
నాకియ్యవలెనా ॥
పల్లకీలు నందనాలు
పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ
విలాసములు ।
తల్లియాకె మగనినే
దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥
గ్రామములు వస్త్రములు
గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు
నంగభేదాలు ॥
భామిని యాకె మగని
ప్రాణధారి లెంకలము
వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥
పస గల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మ తండ్రి
శ్రీ వేంకటేశుడు ।
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥
” స్వామి దగ్గర నోరు జాగ్రత్త!” రేపు…
Leave a comment