స్వీయ అన్వేషణ – 108
తిరుమలేశుడు ప్రత్యక్ష దైవం! ఒకప్పుడు తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామితో మాట్లాడేవాడుట! ఆ తరువాత బాబాజీతో రోజూ పాచికలు ఆడేవాడుట! తొండమాన్ చక్రవర్తి చేసిన ఒక అపచారం వల్ల ” ఇంక నేను ఎవరితోనూ మాట్లాడను! ఏదైనా చెప్పవలసి వస్తే అర్చకముఖంగా మాత్రమే చెబుతాను” అన్నాడుట! అప్పటి నుంచీ స్వామి మౌనవ్రతం పాటిస్తున్నాడు! ఆయనంతట ఆయన మాట్లాడక పోవచ్చు!. నేరుగా సమాధానం చెప్పకనూ పోవచ్చు! కానీ… ఆయన మన మాటలు అన్నీ వింటాడు! విని ఊరుకోడు! ఒక్కొక్కసారి తక్షణమే “పని” చేస్తాడు. లేదూ మన కర్మ శేషాలను చిత్రిక పట్టి తొలగించి, మనకు కావలసినది ఇస్తాడు. హిందీలో అంటారు కదా… ” भगवान के पास देर है, अंधेर नही!” భగవంతుడు మన కోరికలు తీర్చటంలో ఆలస్యం ఉండవచ్చు… కానీ తీర్చకపోవటం అంటూ ఉండనే ఉండదు.
మరి “ఆలస్యం ఎందుకయ్యా?” అంటే మన కోరిక తీరే “అర్హత”, ఆ “భగవత్ ప్రసాదం” అందుకునే అధికారం మనకు రావాలి కదా? ఆ “అర్హత”, “అధికారం” రెండూ ఆయనే కల్పిస్తాడు. అందుకని ఆలస్యం అవుతుంది!
గతంలో ఎస్వీబీసీ నుండి పిలుపు వచ్చిన సందర్భంలో ఒక విషయం చెప్పాను. మా ఇంటి దగ్గర సరూర్ నగర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామి దగ్గర నేను అన్న మాటలు, ఆయన ” ప్రతి స్పందన” చెప్పాను కదా? అప్పుడు ఒక మాట అన్నాను… ” స్వామి దగ్గర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి” అని.
కానీ, మనుష్యులం కదా? మన మనసు, ఆలోచనలు మన అదుపులో ఉంటే ” యోగుల” మే అయివుండేవాళ్ళం. కాదు కదా? మామూలు మనుష్యులం మాత్రమే కదా?
” ధర్మ క్షేత్రం ” కార్యక్రమం చేసే రోజులలో ఒక సౌకర్యం ఉండేది. ఆ కార్యక్రమంలో నలుగురు అతిథులు, ఒక యాంకర్, ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్, నేనూ భాగస్వాములం. వీరందరికీ స్వామి దర్శనానికి నేరుగా 17వ కంపార్ట్మెంట్ నుంచి వెళ్లే విధంగా ఈఓ అనుమతి పత్రం జారీ చేశారు. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. తిరుపతికి బయటి ఊళ్ళ నుంచి వచ్చే అతిథులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. తిరుపతి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఈ అవకాశం ఉండదు.
అలాగే బయటి ఊళ్ళ నుంచి వచ్చే అతిథులు సాధారణంగా కుటుంబ సభ్యులతో వచ్చేవారు. కానీ వారికి ఈ 17వ కంపార్ట్మెంట్ నుంచి వెళ్లే సౌకర్యం ఉండదు. అందువల్ల ఆ కుటుంబ సభ్యులకు వి ఐ పి దర్శనం టికెట్స్ ఏర్పాటు చేసేవారు. అలా అందరమూ సాధారణ వి ఐ పి క్యూ నుంచే వెళ్లి స్వామిని దర్శించుకునే వాళ్ళం. అలా తిరుపతిలో “ధర్మ క్షేత్రం” కార్యక్రమం షూటింగ్ జరిగినప్పుడల్లా స్వామి దర్శనం లభించేది.
ఒకసారి ఈ కార్యక్రమంలో అతిథులు అందరూ తిరుపతికి చెందిన వారే. వారికి ఈ ప్రత్యేక సౌకర్యం కానీ, విఐపి దర్శనం అవకాశం కానీ లేవు. మిగిలిన వాళ్ళం ప్రొడ్యూసర్ టి. శ్రీనివాస రావు, ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, నేను మాత్రమే దర్శనానికి వెళ్లాం. ఈ ఓ అనుమతి పత్రం వల్ల నేరుగా 17వ కంపార్ట్మెంట్ కి పంపారు. అక్కడ నుంచి లోపలికి తీసుకువెళ్ళి, రంగనాయక మంటపంలో కూర్చోబెట్టారు కాసేపు. ఆ రోజు ఒక రాష్ట్ర మంత్రి వచ్చారు. ముందుగా ఆయనను పంపారు. ఆ తరువాత మమ్మల్ని దర్శనానికి తీసుకువెళ్ళారు. మా దర్శనం పూర్తి అయి మేము బయటకు వచ్చాక అప్పుడు వి ఐ పి టికెట్ దర్శనాలు మొదలు అవుతాయి.
లోపలికి వెళ్లాం. స్వామి గర్భాలయం మొదటి గడప ” కులశేఖర పడి” దగ్గర నిలబడ్డాం. నా జీవితంలో మొట్టమొదటి సారి అక్కడ నిలబడి స్వామిని సేవించుకోవటం. అంతకు ముందు వి ఐ పి బ్రేక్ దర్శనాలకు చాలాసార్లు వెళ్ళాను. కానీ, ఇలా ఇంతసేపు నిలబడే అవకాశం ఎప్పుడూ రాలేదు.
నిలబడ్డాం… స్వామికి గర్భాలయంలో హారతి సమర్పించారు. అదొక ” చాక్షుష క్రతువు!”. హారతి సంపన్నమైంది. గర్భాలయం లోపలి నుంచి స్వామి తీర్థం తీసుకువచ్చి ఇచ్చారు అర్చక స్వామి! అంతకన్నా జీవితంలో కోరుకునేది ఏముంటుంది? తీర్థం అయింది. గర్భాలయం లోపలి నుంచి స్వామి పాద ముద్రాంకింతం అయిన “శఠారి” వచ్చింది. మా శిరసులపైన, భుజాల పైన, హృదయం మీద ఆ స్పర్శ! స్వయంగా స్వామి పాదాలను శిరసున ధరించిన అనిర్వచనీయ, అలౌకిక అనుభూతి! ఆ తరువాత గర్భాలయం లోపలి నుంచి కదళీ ఫల ప్రసాదం మా చేతులను పావనం చేసింది. మరొక్క నిమిషం సమయం ఉంది… బయటికి నడవటానికి.
అప్పుడు వచ్చింది ఒక ఆలోచన! దురదృష్టం వెంటాడితే అలాటి ఆలోచనలే వస్తాయి! మనుష్యులం కదా? మనకి ఎంత వ్రాసిపెట్టి ఉంటే అంతే!
” స్వామీ! ఇన్ని నిమిషాలు నీ సన్నిధిలో నిలబడే అదృష్టాన్ని ప్రసాదించావు. నీ గర్భాలయం లోపలి నుంచి పంపి మరీ తీర్థ ప్రసాదాలు అనుగ్రహించావు. ఏమిటి? ‘ఇక చాలు… వెళ్ళు” అంటున్నావా?”
స్వామి దర్శనం పూర్తి చేసుకుని క్రిందికి వచ్చాము. కొండ మీద నుంచి క్రిందికి రావటానికి ఎంత సేపు? 40 నిమిషాలు! అంతే!
ఆఫీస్ కి వెళ్ళాం. రామలక్ష్మి గారు అప్పటికే ఆఫీస్ కి వచ్చి వున్నారు. వెళ్లి కలిశాను.
” సర్! ధర్మ క్షేత్రం ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాయి ఇప్పటివరకూ?” అని అడిగారు.
” యాభై పూర్తి అయ్యాయి మేడమ్?” అని చెప్పాను.
” ఇంక ఆపేద్దాం సర్!” అన్నారు ఆమె!
నాకు నోట మాట రాలేదు! జస్ట్ నలభై నిమిషాలు! జస్ట్ నలభై నిమిషాల క్రితం స్వామి సన్నిధిలో నా మనసులో అనుకున్న మాట! ” ఇక చాలు… వెళ్ళు ‘ అంటున్నావా?” అనుకున్న మాట! జస్ట్ నలభై నిమిషాలలో నా చెవుల్లో స్పష్టంగా వినపడింది.
స్వామి నేరుగా మనతో మాట్లాడడు! ఎవరో ఒకరిని సాధనంగా చేసికొని తన సంకల్పాన్ని మనకి వినిపిస్తాడు! ఆ సాధనంగా ఇప్పుడు రామలక్ష్మి గారిని ఎంచుకున్నాడు స్వామి! బహుశః “ఆ కార్యక్రమం ఇంక చాలు” అనుకునే నా మనసులో ఆ ఆలోచన కలిగించాడేమో!?
అప్పటి వరకూ చేసిన ఆ సేవకు తన అనుగ్రహాన్ని ప్రసాదించాడే కానీ ” ఇక చాలు ఫో’ అనలేదు స్వామి!” అనుకున్నాను కొన్నాళ్ళ తరువాత! ఆ మాట విన్న క్షణం మాత్రం గుండె కలుక్కుమంది! స్వామి దర్శనం ఇక లభించదా? అనిపించింది.
స్వామి లీలను అర్థం చేసుకోవటానికి మనలాటి వాళ్ళకి కొంత టైమ్ పడుతుంది మరి!
అందుకే అంటున్నా ” స్వామి దగ్గర నోరు జాగ్రత్త!”
ఇక్కడితో నా ప్రయాణంలో ఎస్వీబీసీ అధ్యాయం ముగిసిపోయింది!
” వదలి వేసిన విద్య మళ్ళీ ప్రారంభం!” రేపు…
Leave a comment