స్వీయ అన్వేషణ – 109
ఎస్వీబీసీ లో పని చేయటం అంటే ఏమిటి? టిటిడి ఈవో, ఛానల్ సి ఓ ఓ, ఛీఫ్ ప్రోగ్రామింగ్ హెడ్ దగ్గర పని చేయటమా? కాదు! కానే కాదు! వారు కూడా అక్కడ కేవలం ఉద్యోగులు మాత్రమే! కాకపోతే కాస్త పై స్థాయి ఉద్యోగులు. ఇంతకీ ఎస్వీబీసీ యజమాని ఎవరు? ఇంకెవరు? సాక్షాత్తూ ఆ తిరుమల శ్రీనివాస మహాప్రభువే! అంటే నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేశాను? సాక్షాత్తూ ఆ శ్రీనివాసుని కొలువులో పని చేశాను. ఉద్యోగ జీవితంలో అయినా, నిజ జీవితంలో అయినా ఆయనే కదా నాకు ” యజమాని!” అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వామి కొలువులో పని చేశాక ” క్షుద్ర మానవు”ల కొలువుతో నాకేమి పని? ఆ స్వామియే నాకు చిట్టచివరి “యజమాని!” అందువల్ల “ఇంక ఎవరి దగ్గరా ఉద్యోగం చేయకూడదు!” అని నిర్ణయించుకున్నాను. అలా నా “ఉద్యోగ జీవితం”లో చివరి అధ్యాయం ఎస్వీబీసీ!
ఎస్వీబీసీ లో మానివేశాక చాలా నెలలు ఏమీ చేయలేదు. ఖాళీగా ఉండిపోయాను. నా పూజ, జపం, పారాయణలు మాత్రమే జీవితంగా మార్చుకున్నాను. ఆ సమయంలో…
” భక్తి టీవీ”లో నా సహోద్యోగి ఒకరు తాను చేస్తున్న ఉద్యోగం మానివేసి, ఒక కన్సల్టెన్సీ లో చేరదామని అనుకున్నారు. నా సలహా అడిగారు. నేను ” అప్రయత్నంగా” ఆయనతో ” ఒకసారి మీ జాతకం తీసుకురండి. చూద్దాం!” అన్నాను.
ఈ మాట ఎందుకు అన్నానో నాకే తెలియదు! 1985 కి ముందు నేను హైదారాబాద్ కు షిఫ్ట్ కావటానికి ముందు ఎప్పుడో వదలివేసిన విద్య! మళ్ళీ ఎందుకు నా నోట వచ్చిందో!
ఆ సహోద్యోగి కాలక్రమంలో మరి కొందరిని జాతక పరిశీలనకు తీసుకువచ్చారు.అలా మళ్ళీ ” జాతక పరిశీలన” మొదలు అయింది. ఎవరెవరో వచ్చేవారు. చెప్పేవాడిని. కానీ ఎవరి దగ్గరా ఏమీ తీసుకోలేదు. అలా కొంతకాలం గడచింది.
ఒకరోజు ఆ పూర్వ సహోద్యోగి ” ఫీజ్ ఎంత తీసుకుంటున్నారు?” అని అడిగారు. ” ఏమీ లేదు!” అన్నాను. ” అదేవిటీ? ఈ ఫ్రీ సర్వీస్ ఏవిటి? ఎంతో కొంత తీసుకోవాలి?” అన్నారు. అలా ఆయనే రూ.500 ఫీజ్ గా నిర్ణయించారు. ఎవరిని పంపిన ఆ ఫీజ్ విషయం చెప్పి మరీ పంపేవారు. అయితే జనాలు “తెలివైన వారు” కదా? అంతా అయ్యాక ” ఫీజ్ ఎంత సర్?” అని అడిగేవారు. ” అడగటం” అలవాటు లేని మనిషిని కదా? నా షెల్ఫ్ లో ఉన్న గురుదేవుల ఫోటో చూపించి “ఎంతో కొంత అక్కడ పెట్టండి!” అనే వాడిని. 500 పెట్టిన వాళ్ళూ ఉన్నారు. 5, 10 పెట్టిన వాళ్ళూ ఉన్నారు! నేను అదేమీ పట్టించుకోలేదు.
అలా ఏడాది, ఏడాదిన్నర గడచిన తరువాత ఆయనే ఫీజ్ రూ.1000 కి పెంచారు. అప్పటి నుంచీ చాలా ఏళ్ళు అలానే గడచిపోయాయి.
ఒకరోజు పత్రి వాసుదేవన్ అనే మిత్రుడు ఫోన్ చేశారు. ” CVR ఛానల్ వాళ్ళు ఒక భక్తి ఛానల్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ప్రోగ్రామింగ్ హెడ్ గా ఎవరైనా సీనియర్ పర్సన్ ఉంటే బాగుంటుందని వెతుకుతున్నారు. నేను మీ పేరు చెప్పాను. వస్తారా?” అని అడిగారు. దాదాపు ఏడాదిన్నర క్రితమే ” ఇంక ‘క్షుద్ర మానవు’ల దగ్గర పని చేయకూడదు” అని నిర్ణయించుకున్న నేను ఆలోచనలో పడ్డాను. ” రేపు చెబుతాను” అన్నాను.
” ప్రోగ్రామింగ్ హెడ్!” ఎంత పనైనా చేయవచ్చు. అటు “భక్తి టీవీ”లో, ఇటు ఎస్వీబీసీ లో చేయలేక పోయినవి అన్నీ చేయవచ్చు. వెడితే ఎలా ఉంటుంది? అసంపూర్తిగా మిగిలి పోయిన ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు! “వెడదాం” అనుకున్నాను. మరునాడు వాసుదేవన్ కి చెప్పాను. ” వస్తాను!” అని! ఆయన ” మీ రెస్యూ మ్ నా మెయిల్ కి పంపండి. మా సి ఈ ఓ టూర్ లో ఉన్నారు. తిరిగి రావటానికి నాలుగు రోజులు పడుతుంది. ఆయన రాగానే చెబుతాను. వచ్చి కలవండి!” అన్నారు. ” సరే ” అని మెయిల్ చేశాను.
ఆ తరువాత నా మనసు చాలా గందరగోళంలో పడింది. “ప్రోగ్రామింగ్ హెడ్!” అంటే ఉదయం ఆఫీస్ ప్రారంభ వేళకు ఉండాలి. ఆఫీస్ పూర్తి అయే వేళ అంటూ నిర్దిష్టంగా ఇదీ అని ఏమీ ఉండదు. నా నిత్య పూజ, జపం ఏమైపోవాలి? అవన్నీ అయేసరికి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. అప్పుడు బయలుదేరి వెడితే లంచ్ టైమ్ పూర్తి అయే టైమ్ కి మాత్రమే వెళ్లగలను. అంటే సగం రోజు గడిచాక మాత్రమే ఆఫీస్ కి వెళ్ళగలను. సరైన టైమ్ కి వెళ్ళాలి అంటే నా నిత్యపూజ, జపం అన్నీ వదలి వేసుకొని మళ్ళీ ఒకడి దగ్గర ఉద్యోగం చేయాలి. మూడవ రోజుకు ఒక నిర్ణయానికి వచ్చాను.
“వద్దు. వెళ్ళవద్దు!” ఆ సాయంత్రమే నేను అనుకున్న విషయాలు చెబుతూ, నేను “ఆ ఉద్యోగానికి రాను” అని వాసుదేవన్ కి మెయిల్ పంపేశాను!
బహుశః ” క్షుద్ర మానవు”ల దగ్గర ఉద్యోగం చేయకూడదు అనే నా నిర్ణయం ఎంత గట్టిదో అని స్వామి ఈ పరీక్ష పెట్టాడేమో?! ఆ స్వామికి చేసుకునే నిత్యపూజ వదలి, జీతం డబ్బుల కోసం పోతాడా? జీతం డబ్బులు వదిలేసుకొని నా దగ్గర పడి ఉంటాడా? అని స్వామి పరీక్షించాడేమో?! దానికే నాలుగు రోజులు టైమ్ ఇచ్చాడేమో సిఇఓ టూర్ పేరుతో! ఆ పరీక్షలో నేను నెగ్గానా? లేదు… ఆయనే నెగ్గించాడు!!!
” కన్సల్టేషన్ మొదలు!” రేపు…
Leave a comment