స్వీయ అన్వేషణ – 109
జీవితం చిత్రంగా ఉంటుంది. ఆ స్వామి లీలలు విచిత్రంగా ఉంటాయి! స్వామి కొలువులో వున్న వాడిని ” క్షుద్ర మానవుల” దగ్గర ఉద్యోగం చేయను అని నిర్ణయించుకున్నాను. అందుకే CVR ఛానల్ ఉద్యోగ అవకాశాన్ని ముందుగానే కాదని అనుకున్నాను.
నేను వద్దు అనుకున్న స్థానంలోకి శశిధర్ వచ్చాడు. గతంలో ఎస్వీబీసీ ఛానల్ హైదారాబాద్ శాఖలో ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్న వ్యక్తి ఈయనే! ఒకరోజు ఫోన్ చేశారు… ” నేను CVR OM ఛానల్ లో ప్రోగ్రామింగ్ హెడ్ గా చేరాను. ఒకసారి మీతో మాట్లాడాలి. రండి” అని. ఎస్వీబీసీ లో కలసి పని చేశాం. బాగా పరిచయం. తన హోదాని అడ్డం పెట్టుకొని నా పట్ల ఎలాటి అగౌరవమూ ప్రదర్శించలేదు. పిలిచినప్పుడు వెళ్ళక పోవటానికి నాకు ఏ కారణమూ కనిపించలేదు. ఒకరోజు వెళ్ళాను.
” నేను ఇక్కడ చేరాను. మీరూ వచ్చేయండి, చేరిపొండి. కలసి పని చేద్దాం!” అన్నాడు శశిధర్.
నాకు నవ్వు వచ్చింది! నేను ” ఓకే” అని అంటే ఇప్పుడు శశిధర్ కూర్చొన్న “సీట్” లో నేను ఉండేవాడిని! ఇప్పుడు మరొకరు ఆ సీట్ లో కూర్చొని నన్ను చేరమంటున్నారు! జీవితం చిత్రమైంది కదూ?
నేను చేరను అని చెప్పేశాను. రెండు కారణాలు కూడా చెప్పాను. ఒకటి… స్వామి దగ్గర పని చేశాక ఇంక ఎక్కడా చేయకూడదు అన్న నా నిర్ణయం. రెండు… మధ్యాహ్నం 12 – 12.30 వరకూ నా పూజాదికాలు ఉంటాయి కాబట్టి హాఫ్ డే తరువాత మాత్రమే ఖాళీ అవుతాను. ఈ రెండు కారణాల వల్ల నేను ఎక్కడా ఉద్యోగంలో చేరను.
శశిధర్ గొప్ప ” మానిప్యులేటర్!”.
” సరే! మీ నిర్ణయాన్ని నేను కాదనను. రెగ్యులర్ జాబ్ లో చేరవద్దు. కానీ ” కన్సల్టెంట్” గా ఉండండి. ప్రోగ్రామ్స్ ప్లానింగ్ లో తోడుగా ఉండండి. వారానికి ఒకటి, రెండు రోజులు… అదీ మధ్యాహ్నం తరువాతే రండి. ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ అడగను!” అన్నాడు.
ఇది ” ఉద్యోగం” కాదు. “సలహాదారు” పాత్ర. చేయాలనుకొని చేయలేక పోయిన, చేద్దామనుకున్నా ఇతరుల “ప్రతిబంధకాల” వల్ల ఆగిపోయిన కార్యక్రమాలు చేయవచ్చు కదా? శశిధర్ సాధారణంగా కాదనడు! చేయాలనుకున్నవి చేయటానికి ఆ స్వామి ఈ అవకాశం కల్పించాడేమో?! నా నిర్ణయానికి కూడా విరుద్ధమైన పని కాదు! ఎందుకు కాదనాలి? ” సరే” అన్నాను. ఒక భక్తి ఛానల్ కి “కన్సల్టెంట్”గా క్రొత్త అవతారం.
నా ” వైష్ణవం” నా స్వీయ ఆరాధనకు పరిమితం. ఒక ఛానల్ కు వచ్చాక హిందూ ధర్మంలోని సమస్త శాఖలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి… ఇచ్చి తీరాలి! అలాగే కార్యక్రమాలు రూపొందించాం. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మార్గాలలో ఉన్న పండితులతో కార్యక్రమాలు ప్లాన్ చేశాం.
అద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీమదాది శంకర భగవత్పాదులు. వారి “ఉపదేశ గ్రంథాల”ను తెనాలిలోని “సాధన గ్రంథ మండలి” ద్వారా ప్రచురించి శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారు గొప్ప సేవ చేశారు. ఆ ” ఉపదేశ గ్రంథాలు చెప్పించాలని నిర్ణయించాం. ఎవరు చెప్పాలి! అప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న వక్త గరికిపాటి నరసింహారావు. ఆయన చేత చెప్పించాలని అనుకున్నాం. అయితే ఒక సమస్య ఉంది. ఆయన ఏ గ్రంథాన్ని అయినా ” సామాజిక వ్యాఖ్య” పేరుతో “అంతులేని” ఎపిసోడ్స్ చేస్తారు. దానికి అడ్డుకట్ట వేయాలి. కనుక ప్రతి ఉపదేశ గ్రంథానికి ఇన్ని ఎపిసోడ్స్ మాత్రమే అనే పరిమితి పెట్టాను. ఆయనా ఒప్పుకున్నారు. అలా శంకరుల ఉపదేశ గ్రంథాల ప్రవచనాలు మొదలయ్యాయి.
రెండవది… ఎస్వీబీసీ లో పది ఎపిసోడ్స్ రికార్డు అయి ఆగిపోయిన ” శ్రీ వేంకటేశ ఇతిహాస మాల!”. అక్కడ కొందరు అడ్డుపడి ఆపిన అంశం. ఆ నేపథ్యం అంతా శశిధర్ కి చెప్పి, ఆ కార్యక్రమం మొదలు పెట్టించాను. ఎస్వీబీసీ లో ఆ కార్యక్రమానికి అనుకున్న శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్య స్వామి చేతనే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఆయనా సంతోషంగా అంగీకరించారు. అలా “తిరుమల దైవం ఎవరు?” అని ఒకప్పుడు ABN ఆంధ్రజ్యోతిలో జరిగిన చర్చా కార్యక్రమానికి సమాధానం చెప్పవలసిన ఎస్వీబీసీ ఆ బాధ్యతను నెరవేర్చుకోలేక పోయినా ఇక్కడ CVR OM లో ఆ బాధ్యత నెరవేర్చ గలిగాను! స్వామి ఇందుకే నన్ను ఇక్కడికి ” కన్సల్టెంట్” గా తెచ్చాడేమో!?
ఎన్నో కార్యక్రమాలు… శ్రీవచన భూషణం, శ్రీ గురు పరంపరా ప్రభావం, శ్రీగుణ రత్న కోశము, ఉపదేశ రత్నమాల, ప్రశ్నోత్తర రత్నమాల… ఇలా ఎన్నెన్నో అద్వైత, విశిష్టాద్వైత గ్రంథాలపై ప్రవచాలు సాగాయి. మాకు ఇబ్బంది వచ్చిందల్లా ద్వైత సిద్ధాంత పండితులు దొరకలేదు. అందువల్ల మిగిలిన రెండు సిద్ధాంతాల గ్రంథాలు మాత్రమే చెప్పించ గలిగాము.
ఈ క్రమంలో కొన్ని విచిత్రాలూ జరిగాయి. ఏ సిద్ధాంత శాఖలో అయినా కొందరు ” ఛాందస వాదులు” ఉంటూనే ఉంటారు.
“శ్రీ వచన భూషణం” అనే శ్రీవైష్ణవ గ్రంథం గురించి శ్రీమతి కె.వి. జానకి గారు, ” శ్రీ గురు పరంపరా ప్రభావం” అనే శ్రీవైష్ణవ గ్రంథం గురించి ఎన్.వి.ఎల్.ఎన్. రామానుజాచార్యులు గారు చెబుతూ ఉండేవారు. ఒక రోజు వీళ్లిద్దరూ ఎదురుపడ్డారు. ” మీరేమి చెబుతున్నారు?” అంటే ” మీరేమి చెబుతున్నారు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
జానకి గారు “నేను శ్రీవచన భూషణం చెబుతున్నాను” అన్నారు.
వెంటనే ఆయన ” అదెలా చెబుతారు? సంప్రదాయ విరుద్ధం కదా?” అని ఎదురు ప్రశ్న వేశారు.
ఈ సమస్య శశిధర్ దగ్గరకు వెళ్ళింది. ఆతడు నాకు ఫోన్ చేశాడు. ఆ రోజు నేను ఛానల్ కి వెళ్ళలేదు. అంతా విని ” వాళ్ళు ఇద్దరూ రేపు వస్తారు కదా? రేపు మాట్లాడదాంలెండి!’ అని మరునాడు వెళ్ళాను.
వెళ్ళేటప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు తన వ్యాఖ్యానంతో ప్రకటించిన “శ్రీవచన భూషణం” గ్రంథం తీసుకొని వెళ్ళాను. రామానుజాచార్యులు గారు, జానకి గారు, శశిధర్, నేనూ కూర్చున్నాం. రామానుజాచార్యులు గారు ” ఆ గ్రంథం ఇలా టీవీల్లో చెప్పడం సంప్రదాయ విరుద్ధం. చెప్పకూడదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వారికి మాత్రమే చెప్పాలి” అన్నారు.
” అయితే ఈ విషయం శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి తెలియదా? వారు ఈ గ్రంథాన్ని వ్యాఖ్యానంతో ప్రచురించారు. మార్కెట్ లో దొరుకుతోంది. ఇదుగో ఆ గ్రంథం” అని చూపించాను.
” చిన జీయర్ స్వామి వారి దివ్య సాకేతంలో సభలు జరుగుతాయి. ఆ సభలలో పాల్గొనే వారు అందరూ శ్రీవైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారాలు పొందిన వారు మాత్రమే కారు కదా? ఇతరులు కూడా ఆ సభలకు వస్తారు కదా? అక్కడ ఆ సభలలో మీవంటి పండితులు ఈ గ్రంథాల పై ప్రసంగాలు చేస్తున్నారు కదా? అలాంటప్పుడు అవే గ్రంథాలను టివిలో చెబితే తప్పేమిటి?” అని నా వాదన. దానికి ఆయన ఏమీ చెప్పలేక పోయారు. ఆయన కూడా ఆ సభలలో ప్రసంగాలు చేసిన వారే! ఏమని సమాధానం చెప్పగలరు?
ఆ విధంగా ఆ కార్యక్రమానికి వచ్చిన అడ్డంకి తొలగిపోయింది.
అసలు సమస్య ఇక్కడే ఉంది… శ్రీ వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు “రహస్యాలు” అని మూసి పెట్టుకొని కూర్చున్నారు “సంప్రదాయ వాదులు”. దానివల్ల ఆ సంప్రదాయ విశేషాలు జన సామాన్యానికి అందుబాటులో లేకుండా పోయాయి. అద్వైతులు తమ గ్రంథాలకు విస్తృత ప్రచారం కలిగించారు. విశిష్టాద్వైతులు ఆ పని చేయలేక పోయారు. ” మూసి పెట్టుకుంటే పాసి పోతుంది” అనే సామెతలా ఉంది వ్యవహారం.
భగవద్రామానుజులు “మంత్రోపదేశం” పొంది, ఆ రహస్యాన్ని బయటకు చెబితే నరకానికి పోతావ్ అని ఆచార్యుడు చెప్పినా, తిరుక్కొట్టియూర్ ఆలయ గోపురాన్ని అధిరోహించి, తిరు మంత్రాన్ని బహిరంగంగా ప్రకటించారు. అదే… ఆ సంఘటనే … రామానుజుల ఆ ప్రేమమమయ తత్వమే…ఆదర్శం నాకు! చెప్పాలి… ఇష్టమైన వారు ఆచరిస్తారు… లేకపోతే లేదు. చెప్పవలసిన కర్తవ్యం మన మీద ఉంటుంది… ఉంది!
అలాగే మరొక కార్యక్రమంలో తెలుగు సాహిత్యం గురించి…తెలుగులో ఒక పదానికి అర్థం ఏమిటి? దానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి? అని ఒక విభాగం. ఒక పద్యాన్ని తీసుకొని దాని అర్థం, దానిలోని సందేశం చెప్పటం… ఇలా ఒక మంచి కార్యక్రమం చేయగలిగాం.
మరొక కార్యక్రమం నాకు పరిపూర్ణ సంతృప్తిని ఇచ్చింది… అదే… విజయనగరం లో నిర్మించిన ” రామ నారాయణం” కి వ్రాసిన స్క్రిప్ట్. ఆ నిర్మాణం ప్రారంభం అవబోతున్నప్పుడు దానిపై శశిధర్ ఛానల్ తో సంబంధం లేకుండా చేసిన షార్ట్ ఫిల్మ్ అది. ఆ మహత్తర నిర్మాణం గురించి వివరిస్తూ వ్రాసిన ఆ స్క్రిప్ట్ నాకు తృప్తిని ఇచ్చిన వాటిలో ఒకటి!
అయితే చివరికి అక్కడా మానివేశాను… సమయానికి ఆ ఛానల్ వాళ్ళు రెమ్యూనరేషన్ అందించకపోవటం వల్ల!
అలా మరొక అధ్యాయం సమాప్తం!
ఒకటే తృప్తి… స్వామి సన్నిధిలో చేయాలనుకొనీ, ఇతరులు కల్పించిన ఆటంకాలు కారణంగా ఆగిపోయిన “శ్రీ వేంకటేశ ఇతిహాస మాల” ఇక్కడ CVR OM లో చేయగలిగాను. స్వామి పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చుకో గలిగాను! అయినా ఇందులో నా ” కర్తృత్వం ” ఏముంది? అలా నెరవేర్చుకునే అవకాశాన్ని ఆ స్వామియే కల్పించాడు! ” నాహం కర్తా హరిః కర్తా!”
” మళ్ళీ ఇంటిలోనే…!” రేపు
Leave a comment