స్వీయ అన్వేషణ – 110
“ఇప్పటివరకూ చేసింది చాలు, ఇంక ఇంటి పట్టున కూర్చో!” అన్నట్టున్నాడు స్వామి!
మళ్ళీ ఇల్లు! ఇంటిలోనే జాతక పరిశీలనలు! పూజ, జపం, పారాయణ, జాతకాలు ఇదీ రోటీన్! ఇలా సాగిపోతే చెప్పుకోవటానికి ఏముంటుంది?
CVR OM నుంచి శశిధర్ బయటకు వచ్చేశాడు. వచ్చినవాడు ఇంకో చోట చేరాడు. అదే రమణానంద మొదలు పెట్టిన ” శివ శక్తి సాయి ఛానల్”. మళ్ళీ నాకు పిలుపు… కన్సల్టెంట్ గా. ” రాను” అని చెప్పాను. ” నా కోసం రండి” అని కోరాడు. ఎస్వీబీసీ నాటి నుంచీ పరిచయం. కాదని అనలేకపోయాను. వెళ్ళాను.
అప్పటి వరకూ ఏ ఛానల్ లోనూ లేని భయంకర అనుభవం అది! ఆ ఛానల్ మొదలు పెట్టిన రమణానంద ఒక ” గురువు” కొందరికి. మొట్టమొదటి సారి ఆ ఛానల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడే ఇది మనకు సరిపడేది కాదు అని తేలిపోయింది. అయితే శశిధర్ కోసం తప్పలేదు.
చాలా విచిత్రమైన వ్యక్తి ఆ రమణానంద! ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వుండే మనిషి. వాటిలో ప్రముఖమైనది ” శివాభిషేకం”! ఒక పెద్ద శివలింగం! పైపులతో దానికి “అభిషేకం!” ఒకసారి ఆ కార్యక్రమం అయిపోయాక ఆయన, శశిధర్, ఆ ఛానల్ పెట్టడానికి సహకరించిన ఆయన శిష్యులతో ఒక సమావేశం జరిగింది. దానికి నన్నూ రమ్మన్నారు. వెళ్ళాను.
” మన కార్యక్రమాల గురించి ఏమనుకుంటున్నారు?” అని అడిగారు.
” నాకు జనాలతో పెద్దగా సంబంధం లేదండీ! ఎవరు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోను” అన్నాను.
” అలా కాదు… ఏదో ఒకటి వినే వుంటారు కదా? చెప్పండి” అన్నారు.
” ఇప్పుడే, ఇక్కడే చెప్పమంటారా?” అని అడిగాను. ఆ ప్రశ్న వేసినప్పుడైనా ఆయన జాగ్రత్త పడవలసింది!
” చెప్పండి” అన్నారు.
” మొదటిది… శివలింగానికి పైపులతో నీళ్లు కొట్టి అభిషేకం అనటం బాలేదు” అన్నాను.
” మీకు అర్థం కావటం లేదు బాబూ! అంత ఎత్తుకు తెగించి ఎక్కి చేస్తున్నాను!” అన్నారు.
” మీరు పెట్టిన శివలింగం కన్నా శ్రావణబెళగొళ లో విగ్రహం ఇంకా ఎత్తైనది. దానికి అభిషేకం చేసేటప్పుడు పైపులలో చేయరు. కలశాలు అంచెలంచెలుగా అందుకుంటూ అభిషేకం చేస్తారు” అన్నాను.
” ఇంకా…” అన్నారు.
” మీరు చేసే హోమాలలో మీ అమ్మాయి చేత చేయిస్తున్నారు. ఆ అమ్మాయి జుట్టు విరబోసుకుని కూర్చొని ఆహుతులు వేస్తున్నారు. అది శాస్త్ర విరుద్ధం!” అన్నాను.
” ఓకే! తరువాత మాట్లాడుదాం” అని మీటింగ్ ముగించారు!
తరువాత ఆయన శశిధర్ తో “ఆయనేమిటి అలా మాట్లాడుతాడు? అదీ ఇంతమందిలో?” అన్నారుట!
దానికి శశిధర్ ” ఆయన ముందే అడిగాడు… ఇప్పుడే, ఇక్కడే చెప్పమంటారా? అని. మీరే అనవసరంగా తొందరపడి చెప్పమన్నారు” అన్నాడు. ఈ విషయం శశిధర్ నాకు చెప్పాడు. ఇలాటి విచిత్ర సన్నివేశాలు చాలా జరిగాయి. ఒకసారి ఆయన ఒక పుస్తకం వ్రాసి ప్రచురించాలని అనుకున్నారు. ఆ పుస్తకం నాకు ఇచ్చి, చూడమని శశిధర్ కి చెప్పారు. అది చదివి, దానిలో చాలా అభ్యంతరాలు చూపించాను లిఖిత పూర్వకంగా! ఆ రిపోర్ట్ చూసి ” ఛైర్మన్ అనే గౌరవం కూడా లేకుండా ఇలా రాశాడేమిటి?” అన్నారుట! ఇదీ శశిధర్ నాకు చెప్పిన విషయం!
రెండు నెలల్లోనే ఆ ఛానల్ కి స్వస్తి చెప్పేశాను. కొద్ది రోజులకే శశిధర్ కూడా మానేశాడు! నేను మళ్ళీ ఇంటికే!
ఇక ఈసారి ఎవరు పిలిచినా వెళ్లకూడదు అనుకున్నాను. ఆ సమయంలో ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ కంపనీ యజమాని. ఛానల్ మొదలు పెడుతున్నాడు. అదే ” జయ జయ శంకర”. వెళ్ళాను. చెప్పేశాను… నేను ఎక్కడా పని చేయను… అని. “అయితే ఎవరిని అయినా సజెస్ట్ చేయండి” అని అడిగాడు. శశిధర్ పేరు చెప్పాను. అలా శశిధర్ ఆ ఛానల్ కి ప్రోగ్రామింగ్ హెడ్ అయాడు.
ఒకసారి శశిధర్ ఫోన్ చేసి ” మాకు స్క్రిప్ట్స్ రాయండి” అని అడిగాడు.
” సర్! నేను ఏ ఛానల్ కి పని చేయదలచుకోలేదు, ఏ స్క్రిప్ట్స్ వ్రాయదలచుకోలేదు. ఆ చాప్టర్ అయిపోయింది” అని చెప్పేశాను.
తరువాత ఏవో మాటలు సాగాయి. మధ్యలో శశిధర్ ఒక మాట అన్నాడు… ” అఫ్ కోర్స్… మీరు స్క్రిప్ట్స్ రాసినా, రాయకపోయినా నాకు వచ్చే లక్ష రూపాయల జీతం వస్తుంది!”
చాలు… ఈ మాట చాలు… ఎస్వీబీసీ లో, CVR OM లో నేను అతనికి తోడుగా నిలబడి చేసిన పనులు, కార్యక్రమాలు అతనికి తెచ్చి పెట్టిన పేరుకి ఈ ” ఆటిట్యూడ్” వచ్చింది అన్న మాట! ఆ రోజు అతని మీద నాకున్న గౌరవం పోయింది.
ఛానల్ “ప్రోగ్రామింగ్ హెడ్” ఎవరైనా కావచ్చు… ముఖ్యంగా భక్తి సంబంధమైన ఛానల్…ఆ వ్యక్తికి ఛానల్ నిర్వహణ, బడ్జెట్ విషయాలలో అపార అనుభవం ఉండి ఉండవచ్చు. కానీ… “కంటెంట్”. నేను ఖచ్చితంగా చెప్పగలను… వారికి ఈ విషయంలో కొన్ని పేర్లు, పుస్తకాలు తెలిసివుండవచ్చు. కానీ వాటి లోతులు ఎంతమాత్రమూ తెలియవు గాక తెలియవు.
క్రొత్త కాన్సెప్ట్స్ ఆలోచించే ఒకే ఒక ప్రోగ్రామింగ్ హెడ్ మేడపాటి రామలక్ష్మి గారు ఒక్కరే! శశిధర్ ఈ విషయంలో “శూన్యం”! అలాటి మనిషి ” మీరు రాసినా, రాయకపోయినా నా లక్ష జీతం నాకు వస్తుంది!” అంటే… అదీ ప్రతి విషయంలో ప్రక్కన నిలబడ్డ నాతోనా?
” మంచిది! అంతకన్నా కావలసినది ఏముంది? కానివ్వండి. నేను మాత్రం స్క్రిప్ట్స్ వ్రాయను” అని చెప్పేశాను.
అక్కడితో నా ” ఉద్యోగ – కన్సల్టెన్సీ” అధ్యాయానికి పూర్తిగా తెర దించేశాను!
” ఇక ఇది నా జీవితం!” రేపు…
Leave a comment