” ఇక ఇది నా జీవితం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 111

2019 నాటికి అన్నీ వదలివేశాను. అంతకుముందే CVR OM లో మానివేశాక నా శ్రీమతి ఒక సలహా ఇచ్చింది ” ఇప్పటి దాకా చేయవలసినవి అన్నీ చేసేశారు. ఇంక చాలు. రెస్ట్ తీసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చొని మీ పూజ, మీ జపం చేసుకోండి. పుస్తకాలు చదువుకోండి, రాయాలని అనిపిస్తే ఏదైనా రాయండి!” అని! వింటేగా? శశిధర్ అడిగాడని ఎగేసుకుని వెళ్లి శివశక్తిసాయి ఛానల్ కు సలహాదారు అయ్యాను. రెండు నెలల్లో మానేశాను.

అప్పుడు తెలిసివచ్చింది … ” పెళ్ళాం చెబితే వినాలి!” అని.

కానీ ఖాళీగా కూర్చునే లక్షణం లేదు కదా? “వ్రాసే చేతిని” కట్టేసుకున్నా, “వాగే నోటిని” కట్టేసుకోలేం కదా?

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఒక మాట అంటూ ఉండేవారు… “బట్టల కొట్లో పని చేసేవాడు బయటికి వచ్చేస్తే ఏం చేస్తాడు? కట్ పీసెస్ షాప్ పెట్టుకుంటాడు. వాడికి ఇంకేమీ తెలియదు కదా?”

నిజం… “వాగే నోటికి” ఇదే మందు. టివీ ఛానల్స్ లో పని చేసి బయటకి వచ్చేస్తే, ఏం చేస్తాము? ఇంద్రగంటి వారి ” సూక్తి” పాటించడమే!

అలా మొదలైంది ” Srivallabha Spiritual” యూ ట్యూబ్ ఛానల్! 2019 మార్చ్ 19 న యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభం అయింది. అదే రోజున ఆత్మీయ మిత్రులు బొమ్మకంటి త్రినాథ శర్మ గారు “Devaprasna” , భక్తి టీవీ లో, ఆ తరువాత నేను పని చేసిన అన్ని ఛానల్స్ లో పనిచేసిన మిత్రుడు, గ్రాఫిక్ డిజైనర్ వీరబాబు “Sadhana Spiritual Tv” అనే యూ ట్యూబ్ ఛానల్స్ మొదలు పెట్టారు. మేము  ముగ్గురమూ ముందుగానే ఈ విషయంలో నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాము.

ఆనాటి నుంచి మా పరమ పూజ్య గురుదేవులు స్వామీ నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులు అయిన డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ, పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ అందించిన మంత్ర సాధనలు అందిస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ మార్గదర్శనం, సలహాలూ – సూచనలూ మహత్తర మైనవి. తనను ఆశ్రయించిన వారి అభివృద్ధిని సర్వాత్మనా ఆకాక్షించే గురుదేవుల ప్రేమ పూర్వక ఆశీస్సులు లభించటం కన్నా అదృష్టం ఏముంటుంది? వాటితో పాటుగా సంప్రదాయికంగా పరంపరగా వస్తున్న సాధనలు కూడా అందిస్తూ వస్తున్నాను.

ఈ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా జాతక పరిశీలనలు ఎక్కువ అయ్యాయి. కొన్నాళ్ళకు గురూజీ సలహాతో పూర్తి జాతక పరిశీలన చేయటం మానివేశాను.

నిజానికి ఎవరు జాతకం కోసం వచ్చినా కేవలం అయిదు రకాల ప్రధాన సమస్యలు, వాటికి అనుబంధ సమస్యలు మాత్రమే ఉంటాయి. ఆ అయిదు ప్రధాన సమస్యలకూ పరిష్కారం చూపిస్తే చాలు కదా? అనిపించింది.

అంతే కాదు… ఎవరు మన దగ్గరకు జాతక పరిశీలనకు వచ్చినా వారు మన ” ఒక్కరి” దగ్గరకే వచ్చారు అనుకోవటం అమాయకత్వం లేదా అజ్ఞానం లేదూ భ్రమ. మన కన్నా ముందు చాలా మంది దగ్గరకు వెళ్ళి ఉంటారు. ఆ పండితులు వారికి ఏదో చెప్పి ఉంటారు. ఇక్కడ మనం ఒకటి చెబుతాం. అప్పుడు వాళ్ళు ” మరి ఫలానా ఆయన అలా చెప్పారు. మీరు ఇలా చెబుతున్నారు” అని చర్చ మొదలు పెడతారు! ఈ శాస్త్ర చర్చ నాకు అవసరమా? అనిపించింది కొన్నాళ్ళకు.

ఏ సమస్యకైనా మంత్ర, తంత్ర శాస్త్రాలలో పరిష్కార మార్గం ఉంది. కనుక ” సమస్య ఏమిటి? దాని పరిష్కారానికి మార్గం ఏమిటి?” అనేది చూస్తే చాలు.

దానికితోడు పరమ పూజ్య గురుదేవులు శ్రీమాలీజీ ” సూత్రం” ఒకటి ఉంది. “ప్రతి వాడికీ మంత్ర సాధన అందాలి. అందరికీ సాధనలో అధికారం ఉంది. దానికి స్త్రీ పురుష బాల, యువ, వృద్ధ, జాతి, కుల వివక్ష లేదు. ఈ దేశంలో సాధకులు పెరగాలి. ప్రతి ఇంటిలో కనీసం ఒక సాధకుడు తయారు కావాలి. ఒక సమస్య వస్తే ఇతరులను ఆశ్రయించే పరిస్థితి రాకూడదు. ఎవరి సమస్యకు వారు తమ సాధన ద్వారా పరిష్కారాన్ని సాధించుకోవాలి.”

ఇది పరమ పూజ్య గురుదేవుల ఆశయం. ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టడం ఆ పరంపరలోని వారిది. పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ ఆ ఆశయాన్ని సర్వాత్మనా ఆచరిస్తున్న మహాత్ములు! వారి మార్గదర్శనంలో , ఆశీస్సులతో ముందుకు సాగే ప్రయత్నంలో ఎంతవరకూ సఫలీకృతుడిని అయానో తెలియదు కానీ, ఆ కృపామయమూర్తి ఆశీర్హస్తం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అనేది నా అచంచల విశ్వాసం!

“శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!”

” చిత్ర విచిత్రమైన మనుష్యులు!” రేపు…


Leave a comment