” చిత్ర విచిత్రమైన మనుష్యులు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 112

యూ ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన తరువాత ఎన్నో అనుభవాలు! చిత్ర విచిత్రమైన మనుష్యులు తగిలారు!

మంత్ర, తంత్ర శాస్త్ర విషయాలు ఈ యూ ట్యూబ్ అనే మాధ్యమం వల్ల ఎంత ” పలుచన” అయిపోయాయి అనేది అర్థం అయింది.

ఈ శాస్త్రాలలో అనేక సాధనలు ఉన్నాయి. ఏ సాధనకైనా వర్తించే “సాధన నియమాలు” ఉంటాయి. ఇవి అన్నిటికీ పాటించ వలసిన సాధారణ నియమాలు. ఇవి కాక ప్రతి సాధనకు కొన్ని ” ప్రత్యేక నియమాలు” కూడా ఉండవచ్చు. అవేవీ చెప్పకుండా ” ఇలా వారం రోజులు చేస్తే ఫలానా దేవత మీ ముందు ప్రత్యక్షం అవుతుంది, మీ కోరిక తీరిపోతుంది, కోట్లు వచ్చి పడి పోతాయి”… ఇలా చెప్పటం సర్వ సాధారణం అయిపోయింది.

నియమాలు పాటించకుండా ఆ విషయాలు ఫాలో అయిపోయి, ఫలితం రాక, చివరికి మంత్ర – తంత్ర శాస్త్రాల పైనే నమ్మకం పోవటం ఒకటి అయితే, ఇతర ధర్మాల వారు ఇదే నిదర్శనంగా చూపించి ” మీ దేవుళ్ళు వేస్ట్, ఇన్ని పూజలు చేశారు, ఏం లాభం?” అంటూ సందేహాలు కల్పించి మతాంతరీకరణలకు దారి కల్పించటం రెండవది.

అలా మార్చే వారి సంగతి ప్రక్కన పెట్టినా, మన వారిలోనే, మన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు పెట్టి పని చేస్తున్న వారు కూడా ఈ మంత్ర – తంత్ర శాస్త్రాల పట్ల సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు! మోక్ష సాధన పరమ ప్రయోజనం అనటంలో సందేహం లేదు! కానీ, ” రేపు నా బ్రతుకు ఏమిటి?” అనే పరిస్థితిలో ఉన్న సామాన్యుడి దృష్టి అక్కడ ఉండదే?!

మరొక ప్రక్కన ఎలాటి ప్రాథమిక అవగాహన లేకుండా, ” మనిషి ఆలోచనా పరుడు, ఇవాళ నేను చెప్పినది రేపు మారవచ్చు. మీ పరిశోధన మీరు చేసుకోండి” అని డిస్క్లైమర్ లో చెప్పేవారి వెంట పడిపోతున్నారు జనం! “నా పరిశోధన నేను చేసుకునేటట్టయితే తమరు ఎందుకు?” 

ఇన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురు అవుతాయి ఈ శాస్త్రాల పైన వీడియోలు చేయాలి అంటే! వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవటమే! అయితే ఈ “సోది” అంతా ఎందుకు అంటే మన ఋషులు దర్శించి అందించిన ఈ మంత్ర – తంత్ర శాస్త్రాలు ఎంత చులకన అయిపోతున్నాయి అనేది వివరించటానికి మాత్రమే!

పరమ పూజ్య గురుదేవులు శ్రీమాలీజీ ఒక మాట చెప్పేవారు… “మన దేవీ దేవతల విగ్రహాలు కానీ, చిత్రాలు కానీ చూడండి. ఎంత సుందరంగా, ఎంత సంపన్నంగా ఉంటాయి? అదే వారు ఇచ్చే సందేశం. మనం కూడా అంత సంపన్నంగా ఉండాలి. రేపేమిటి అనుకుంటూ బ్రతికే మనిషికి, ఆశోపహతులైన వారికి మోక్షం మీద దృష్టి ఎలా ఉంటుంది? ముందు మనిషి తాను పడుతున్న లౌకికమైన కష్టాల నుంచి బయటపడాలి, దారిద్ర్యం నుంచి విముక్తుడు కావాలి, రోగాల నుంచి బయట పడాలి. ఈ కష్టాలు అన్నీ మనిషి చరమ లక్ష్యానికి అవరోధాలు! కనుక ముందు వీటి నుంచి విముక్తులు కావాలి” అని.

ఆ మాట నిజం కాకపోతే మన ప్రాచీన ఋషులు ఇంత శాస్త్ర విజ్ఞానాన్ని మనకి ఎందుకు అందించారు? ఏ ప్రయోజనమూ లేకపోతే వారి తపః ఫలంగా దర్శించిన దానిని  మనకి ఎందుకు అందిస్తారు? వారు అంత “అజ్ఞానులా?”

ప్రస్తుతం మూడు రకాల మనుష్యులు ఉన్నారు… ఒకరు –  ఏ నియమాలూ పాటించకుండా ఏదో సాధన చేసేసి, ఫలితం రాక ప్రక్క చూపులు చూసేవారు, రెండు – అలాటి వారిని టార్గెట్ చేసి తమ వైపు త్రిప్పుకోవటానికి సర్వ విధాలా ప్రయత్నాలు చేసే వారు, మూడు – మన ” ధర్మ పరిరక్షణ” కోసమే అంకితం అయినవారు కూడా ” గ్రౌండ్ రియాలిటీ” పట్టించుకోకుండా ఉండటం!

వీటన్నిటి మధ్య అచంచలంగా నిలబడి, మన పూర్వ ఋషుల “మంత్ర – తంత్ర విజ్ఞానాన్ని ఈ తరాలకు నిర్విరామంగా  అందించిన వారు పరమ పూజ్య గురుదేవులు డాక్టర్ శ్రీమాలీజీ, ఆయన మార్గంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నవారు మా పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ!

ఆ మార్గంలో వారి ఆశీస్సులతో, అండదండలతో సాగుతున్నది Srivallabha Spiritual యూ ట్యూబ్ ఛానల్.

” ఒకే ఒక్క అడుగు వెనక్కి వెళ్లి, మళ్ళీ వద్దాం!..” రేపు…


Leave a comment