స్వీయ అన్వేషణ – 113
ఇప్పటి వరకూ భక్తి టీవీ, ఎస్వీబీసీ, CVR OM, శివ శక్తి సాయి లలో నా పాత్ర, అనుభవాలు చెప్పాను.
శివశక్తిసాయి కి గుడ్ బై చెప్పేసి, నా యూ ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి మధ్యలో మరికొన్ని “విన్యాసాలు” ఉన్నాయి!
శశిధర్ తన భార్య ప్రొడ్యూసర్ గా దూర్ దర్శన్ కి ఒక సీరియల్ చేశాడు. దానికి కథ, స్క్రీన్ ప్లే, టైటిల్ సాంగ్ అన్నీ సమకూర్చాను. అది ఒక యువతి అనేక అవరోధాలను ఎదుర్కొంటూ విజయం సాధించిన కథ! అదే “వైశాలి” సీరియల్! దాదాపుగా ప్రతిరోజూ షూటింగ్ స్పాట్ లో ఉన్నాను. అంతకుముందు ఎస్వీబీసీ లో కూడా ” నాయన”, ” శ్రీ కూరేశ చరితం” సీరియల్స్ నిర్మాణం అప్పుడు కూడా చాలా ఎపిసోడ్స్ షూటింగ్ సమయంలో ఉన్నాను. అందువల్ల ఒక సీరియల్ నిర్మాణంలో ఉండే అన్ని అంశాలలో … ఒక్క బడ్జెట్ తప్ప…ఒక అవగాహన ఏర్పడింది.
ఈ కాలంలోనే విక్రమ్ గౌడ్ అనే ఆయన టివీ సీరియల్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలి అనుకున్నారు. టీమ్ మామూలే… శశిధర్, నేనూ, మరి కొందరు.
ఎన్నో కథలు వచ్చాయి. వాటిలో సెలెక్ట్ చేసే పని నాది. కొన్ని ఎంపిక చేసుకున్నాం. వాటిని కొన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ కి పంపాము.
ఈ చానల్స్ కి ” క్రియేటివ్ టీమ్” అనే ఒక ” గుంపు” ఉంటుంది. వారు కథను పరిశీలించి, కథా రచయితను చర్చకు పిలుస్తూ ఉంటారు.
అలాటి సందర్భం ఒకటి వచ్చింది. కథా రచయిత, నేనూ ఆ ఛానల్ కి వెళ్లాం ” చర్చ” కి.
దాదాపు ఏడెనిమిది మంది “సృజనాత్మక వ్యక్తులు” కూర్చున్నారు. రచయిత కథను క్లుప్తంగా చెప్పారు.
అప్పుడు మొదలైంది ఒక “ప్రహసనం!”
ఆ ” గుంపు” లో ఒకతను ఒక ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పి ” ఆ సినిమా చూశారా?” అని అడిగారు.
ఆ కథా రచయిత కానీ, నేను కానీ ఆ సినిమా చూడలేదు. అదే చెప్పాం.
అప్పుడు ఆ ” సృజనాత్మక మేధావి” మాకు ఆ కథ చెప్పారు. చెప్పి ” అందులో ఆ లైన్ వుందే… దానికి ఈ స్టోరీలోకి తీసుకోండి” అని సలహా ఇచ్చాడు!
నాకు బుర్ర తిరిగిపోయింది. “స్టోరీ డిస్కషన్” లో ” క్రియేటివ్ టీమ్” ఆ కథను మరింత మెరుగు పరచటానికి సలహాలు, సూచనలు ఇస్తారని భావించిన ” అజ్ఞాని” కదా నేను! ఏవేవో సినిమాల నుంచి లైన్లు కాపీ కొట్టేయమని చెప్పటమా “సృజనాత్మక”?
ఆ కథా రచయిత కూడా నాలాగే “తిక్క మనిషి!”
” అలాగే. మళ్ళీ కలుస్తాం” అని వచ్చేశాం.
ఆఫీస్ కి వచ్చాక ఆ రచయిత ” నేను నా కథను మార్చను సర్!” అన్నారు.
” అవును, మార్చవలసిన అవసరం లేదు. మీరే కరెక్ట్!” అన్నాను.
మీకు గుర్తుంటే ఒక ఛానల్ లో ఒక సీరియల్ వచ్చింది. తెలుగులో వెంకటేశ్, మీనా లతో “దృశ్యం” అనే సినిమా వచ్చింది కదా? అది ఒక మలయాల సినిమాకు చాలా ఆలస్యంగా వచ్చిన ” రీ మేక్”. ఆ మలయాల సినిమా వచ్చిన తరువాత, తెలుగు రీమేక్ విడుదల అయే మధ్య కాలంలోనే ఆ ఛానల్ లో ప్రసారమైన ఒక సీరియల్ లో ” ఒక యువకుని చంపటం, పూడ్చి పెట్టడం, పోలీసులు వచ్చి త్రవ్వే లోపు ఆ దేహం మారిపోవటం” అనే లైన్ యథాతథంగా ఎత్తేశారు!
అలాగే మరికొన్ని కథలు … ప్రతిచోటా ఏదో భాషలో సినిమా పేరు చెప్పి కాపీ కొట్టేయమనే ” క్రియేటివ్ టీమ్స్” ఎదురు పడ్డాయి.
ఇప్పటికీ ఒక సీరియల్ కి ఒక పేరు పెట్టలేక, సినిమా పేర్లను కాపీ కొట్టేసి రుద్ధేయడమే చూస్తున్నాం.
అంతే కాదు, ఈ ఛానల్స్ లో “ప్రివ్యూ కమిటీ” లనే “గుంపులు” కూడా ఉంటాయి.
మీరు ఏ సీరియల్ అయినా చూడండి. నేపథ్యంలో స్తోత్ర భాగాలు, మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. వేటికీ “సందర్భ శుద్ధి” ఉండదు. సీరియల్ ఎడిట్ చేసే ఎడిటర్ కు ఈ జ్ఞానం ఉండదు, అది అతని దోషం కాదు. అతను కేవలం “టెక్నికల్ పర్సన్”. మరి ” దర్శకుడు” అనే ” జీవి” ఏం చేస్తున్నాడు? ఆ “జీవి”కీ ఇవేమీ తెలియవు. పోనీ ఈ రెండు దాటి ఛానల్ కు వెళ్ళాక, అక్కడ ఉన్న ” ప్రివ్యూ కమిటీ” వీటిని ప్రశ్నించాలి కదా! ఊహూ! వాళ్ళ “జ్ఞానమూ” అంతంత మాత్రమే!
“విష్ణు సహస్రనామం” తో పిండ ప్రదానాలు చేయిస్తారు! విలన్ అనే వాడు హిరోయిన్ ను భుజాన వేసుకొని మోసుకుపోతూ ఉంటే “ధర్మే చ అర్దే చ… ” అని వినిపిస్తూ ఉంటుంది! “అరే బాబూ! అది పెళ్లి కాదురా! కిడ్నాప్ రా!” అని చెప్పేవాడు ఒక్కడూ ఉండడు!
ఇలాటి ” దరిద్రాలు” అన్నీ మన స్తోత్రాలు, మంత్రాల దగ్గరే ఏడుస్తాయి!
శ్రీవాణీ క్రియేషన్స్ అప్పారావు ” సతీ సావిత్రి” టెలి ఫిల్మ్ చేశారు. దాని కథ, సంభాషణలు నావి. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దానికి దర్శకుడు. షూటింగ్ సౌకర్యం కోసం రెండు యూనిట్స్ చేశారు. ఒక యూనిట్ ఆయన దర్శకత్వం వహించగా, మరొక యూనిట్ కి ఒక “పురాణ వాచస్పతి”ని దర్శకునిగా తీసుకున్నారు.
ఆ సీరియల్ లో కొన్ని పూజా ఫలితాల గురించి ఉంటుంది. శివలింగానికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఫలానా ఫలితం ఉంటుంది అని చెప్పటం సీన్. ఈ ” పురాణ వాచస్పతి” ఒక శివలింగాన్ని పెట్టాడు. అక్కడి వరకూ ఓకే. బిల్వ పత్రాలు అని ఉంటే ” ఎండిన రావి ఆకులు” తో ఆ సీన్ షూట్ చేశాడు! అలాగే ఒక సీన్ లో ” సాలగ్రామ పూజ” ఉంటే అక్కడ ” ఒక గుండ్రని రాయి” తో షూట్ చేశాడు ఆ “పురాణ వాచస్పతి”!
ఇవన్నీ ప్రివ్యూ లో చూసి, రీ షూట్ చేయించ వలసి వచ్చింది!
ఇలాటి ” అజ్ఞానులు”, ” విషయ పరిజ్ఞాన శూన్యులు” రాజ్యం ఏలుతున్న కాలం ఇది!
మన ఇళ్ళల్లో పురాణ, ఇతిహాస, పూజా, స్తోత్ర విషయాలు కనుమరుగై పోయి, ఇంత ముద్ద నోట్లో వేసుకుని, తీరుబడిగా టివీ ముందు కూర్చుని, ఈ ” ఓగాయిత్యాలు” అన్నీ నోరెత్తకుండా చూస్తున్నంత కాలమూ ఈ ” అరాచకం” ఇలాగే కొనసాగుతుంది!
వాళ్ళెవరో మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు, మతాలూ మార్చేస్తున్నారు అంటూ ” పెడ బొబ్బలు” పెట్టడమే కానీ, లోపల లోపల ” వేరు పురుగు”లలా తొలిచేస్తున్న ఈ ” సామాజిక, సాంస్కృతిక అత్యాచారం” పై నోరెత్తే వారు కనపడటం లేదు!
” ఏ ఏ ప్రారంభము లేని ఈ తెలుగులిట్లే గూఢ సంవర్త వేళా పర్యంతము నుండనిమ్ము! విధి ఎలా మారు మా కోసమై?”!
” నియమాలు అన్నీ బ్రాహ్మణులకేనా?” రేపు…
Leave a comment