స్వీయ అన్వేషణ – 114
ఒకాయన ఫోన్ చేశాడు. తనను తాను ” బ్రాహ్మణుడు” అనీ, ” దత్త ఉపాకుడ” ననీ పరిచయం చేసుకున్నాడు. ఒక మంత్ర సాధన చెప్పమని అడిగాడు.
“సాధనకు సంబంధించిన నియమాల గురించి వివరిస్తూ అయిదు వీడియోలు అందించాను. ముందుగా అవి చూడండి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించ గలను అనుకుంటే ఫోన్ చేయండి” అని చెప్పాను.
కొద్ది రోజుల తరువాత మళ్ళీ ఫోన్ చేశాడు. ” ఏమండీ! ఏమిటిది? నియమాలు అన్నీ బ్రాహ్మణులకేనా? మీరు చెప్పిన నియమాలు బ్రాహ్మణులు కాని వారు అందరూ పాటిస్తున్నారా? వాళ్ళు మంత్ర సాధనలు చేయటం లేదా? ఫలితాలు పొందటం లేదా?” అంటూ “యుద్ధా”నికి దిగాడు.
” ఏం? నియమాలు పాటించకపోతే దేవతలు కోపిస్తారా? శపిస్తారా? వాళ్ళ వంశాలు నాశనం అయిపోతాయా?” అంటూ వాదన మొదలు పెట్టాడు.
” మా పెద్దవాళ్ళు నామస్మరణకు మించినది లేదు అని చెప్పారు. నామస్మరణకు ఏమీ నియమాలు లేవు కదా? మంత్ర సాధనకు మాత్రం ఎందుకు?” అంటూ రెచ్చిపోయాడు.
ఆయన చిన్నవాడేమీ కాదు. అయిదు పదుల వయసు! బ్రాహ్మణుడు! పైగా ” దత్త ఉపాసకుడు!”
ఆయన వేసిన ప్రశ్నలు ఇవి!
యూ ట్యూబ్ పుణ్యమా అని ప్రతీదీ ” సులువు”గా ఎలా చేయాలి? అనే వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి.
” అయిదు నిమిషాలలో పూజ పూర్తి చేసుకోవటం ఎలా?”,
” ఈ వీడియో ఉంటే చాలు, మీరే సులువుగా పూజ చేసుకోవచ్చు!”,
” పద్ధతి ప్రకారం పూజ చేయలేరా? సులువుగా ఇలా చేసుకోండి!”,
” అమ్మవారికి ఇలా చేస్తే చాలు, మీ కోరికలు అన్నీ సులువుగా నెరవేరుతాయి!’,
” ఏ నియమాలు లేకుండా ఇలా చేస్తే చాలు, సులువుగా అమ్మవారు మీతో మాట్లాడుతుంది!”
… ఇవీ మనకి లభించే మార్గాలు! ప్రతీదీ ” సులువు”గా అయిపోవాలి. ప్రతి పనిలో ” షార్ట్ కట్” కి అలవాటు పడిపోయాం!
ఇంటర్ లో చేరాలంటే టెన్త్ క్లాస్ పాస్ కావాలి. డిగ్రీలో చేరాలంటే ఇంటర్ పాస్ కావాలి. అదే ఏ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవాలి అంటే “ఎంట్రెన్స్ టెస్ట్” రాసి పాస్ కావాలి.
అలా పాస్ కావటానికి పిల్లల్ని కోచింగ్ లకీ, ట్యూషన్లకు, హాస్టల్స్ కి పంపి, వాళ్ళని నానా చిత్రహింసల పాలు చేసే ఈ ” పెద్దవాళ్ళ”కి మాత్రం “అయిదు నిమిషాల్లో పూజ అయిపోవాలి, అమ్మవారు వచ్చి ఎదురుగా నిలబడాలి, మాట్లాడాలి, ఫలితాలు వచ్చి జేబులో పడిపోవాలి!”
ఏ పరీక్ష పాస్ అవాలి అన్నా దానికి ఒక ” సిలబస్” ఉంటుంది. దానిని ఫాలో కావలసిందే! మినహాయింపులు ఉండవు! లౌకికమైన పరీక్షలకే ” సిలబస్” ఉంటే అలౌకికమైన దేవతల అనుగ్రహం పొందటానికి మాత్రం ” సిలబస్” ఉండదా?
ఆ ” సిలబస్”నే ” సాధన నియమాలు” అంటారు. ఇది ప్రాథమిక పరిజ్ఞానం.
మరొక విషయం… ” నియమాలు అన్నీ బ్రాహ్మణులకేనా? బ్రాహ్మణులు కాని వారికి లేవా?”
ఈ ప్రశ్న ఎవరు వేశారు? ఒక బ్రాహ్మణుడు! అందులోనూ ” దత్త ఉపాసకుడిని” అని ప్రకటించుకున్న వ్యక్తి!
ఒక ఉపాసకుడు ” నియమాలు” మాకేనా? అని అడిగితే ఏమనాలి? అతగాడు ఏమి “ఉపాసకుడు?”
తాను “బ్రాహ్మణుడు”, ఇతరులకూ – తనకూ భేదాన్ని చూసేవాడు తానేమి ” దత్త ఉపాసకుడు?”
విశ్వ వ్యాప్తం అయిన శ్రీ గురు చైతన్య తత్వం లో “నేను బ్రాహ్మణుడను”, “వారు కారు” అనేవాడికి అసలు తనను తాను “ఉపాసకుడను” అని చెప్పుకొనే అధికారం ఉందా?
“లోపలా బయటా అంతా నారాయణుడు నిండి యున్నాడు” అనే వాక్యాన్ని ఈ ఉపాసకుడు నమ్మడా? ఈ సృష్టిలోని చరాచర జీవ రాశులు అన్నింటా ” భగవత్ చైతన్యం” నిండి ఉండగా ” నేను – వారు” అని విభజించి చూసే “ఇలాటి ఉపాసక శబ్దవాచ్యుల” కన్నా మన ధర్మానికి ప్రమాదకారులు వేరే ఎవరు ఉంటారు?
” ఆ పెళ్లి ఆపేయాలి?”…
Leave a comment