” ప్రశ్న మన సంప్రదాయంలో  భాగం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 118

ఎప్పుడూ రెండు భావాలు సంఘర్షిస్తూ ఉంటాయి నాలో! “నమ్మకం – ప్రశ్న” రెండూ ప్రక్క ప్రక్కనే వుంటూ వుంటాయి ఎప్పుడూ!

మన శాస్త్రాలలో నమ్మకం! అది అలాగే ఎందుకు చెప్పారు అనే ప్రశ్న! బహుశః ఇది సరైన మార్గం అనుకుంటాను. చెప్పినవారు సామాన్యులు కారు. ఈ తరం కన్నా విజ్ఞానులు అనటంలో నాకు సందేహం ఎంతమాత్రమూ లేదు. ఒక విషయాన్ని సూత్రీకరించారు అంటే అలా ఒక సూత్రాన్ని రూపొందించడం వెనుక భావన ఏమిటి? దానిలో పైకి కనపడని అర్థం ఏదైనా వుందా? ఒకవేళ వుంటే దానిని దాచిపెట్టి  ఎందుకు చెప్పారు? ఇలాటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి నన్ను!

ప్రశ్నించటం మన సంస్కృతిలో భాగం. జిజ్ఞాస అనేది ప్రశ్నకు మూలం. ఆ ప్రశ్నను మన ప్రాచీన గురువులు అందరూ ప్రోత్సహించారు. శిష్యుడు అడుగుతూ వున్న కొద్దీ మరింత ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ ” ప్రశ్న” అనేది క్రమంగా ” తెలుసుకోవటానికి” కాక “వాదన” కోసంగా మారిపోవడంతో ఒక “సంస్కృతి” విచ్ఛిన్నం అయిపోయింది.

కొన్నేళ్లుగా చాలా ప్రవచనాలు విన్నాను. ఛానళ్లలో పని చేస్తున్న కాలంలో చాలామంది చేత ప్రవచనాలు చేయించటంలో పాత్ర కూడా వహించాను.

ఈ ప్రవచనాలు విన్నప్పుడు నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. వీరిలో కొందరు ధర్మాన్ని వివరిస్తున్నారా? విమర్శిస్తున్నారా? అనే సందేహాలూ కలిగాయి.

కొన్ని శాస్త్ర విషయాలు ఉంటాయి. కొన్ని పరంపరగా వచ్చే అంశాలు ఉంటాయి. కొన్ని పూర్వీకుల అనుభవసిద్ధమైన విషయాలు ఉంటాయి. కొన్ని  గ్రామీణ సమాజంలో కులానుగతంగా వచ్చే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కలిసే ఒక సంస్కృతి లేదా సంప్రదాయం ఏర్పడుతాయి. ” భిన్నత్వంలో ఏకత్వం” అనేది కేవలం ఒక దేశంలో మతాల మధ్య మాత్రమే కాదు. ఒకే సమాజంలో కూడా దీనిని అంగీకరించి తీరాలి.

ఈ విషయంలో కేవలం శాస్త్రమే ప్రమాణం అంటూ మిగిలిన వాటిని అన్నిటినీ తిరస్కరించటం లేదా అవహేళన చేయటం ఒక అలవాటుగా మార్చుకొన్న ” ప్రవచన కర్తలు” కొందరు వున్నారు. ఒక మత లేదా ధర్మ లేదా సంస్కృతీ విధ్వంసానికి ఇతర మతాలు లేదా ధర్మ లేదా సంస్కృతుల వారి కన్నా వీరే “ప్రధాన కారకులు”!

పాండిత్యం వేరు, సభలలో మాట్లాడే సభ్యత వేరు. ఒక సభలో స్త్రీలు, పురుషులూ అందరూ అంటారు. అక్కడ ఏది చెప్పాలి? ఏది చెప్పకూడదు? అనే విచక్షణ మాత్రమే ” పండితుడు” అనే వాడి “సంస్కారా”నికి గీటురాయి.

ఒక ప్రవచన కర్త ” కలి పురుషు”ని రాక గురించి వివరిస్తున్నాడు. దేహ వర్ణన అయిపోయింది. ప్రవర్తన లోకి వచ్చాడు. స్త్రీలు, పురుషులు అందరూ వున్న ఆ సభలో ఆయన చెప్పిన మాటలు ఇవీ… ” కలి పురుషుడు తన పురుషాంగాన్ని చేతితో పట్టుకొని వేగంగా ఊపుతూ వస్తున్నాడు!”.

ఇది ఆ పురాణంలో వుండి వుండవచ్చు. కాదని అనను. కానీ మనం ఉన్నది ఎక్కడ? ఎవరికి చెబుతున్నాం? అక్కడ ఎవరు వున్నారు? ఈ వర్ణన ఇక్కడ చెప్పవచ్చునా? అన్న ” ఇంగిత జ్ఞానం” లేకపోతే ఎలా? ఈ మాటలనే పట్టుకొని ఇతరులు “మీ గ్రంథాలు ఆశ్లీలాలు” అనటానికి ఇలాటి “పండితులు” కారణం కాదా? ఇలాటి వారిని ప్రశ్నించటం తప్పా? ప్రశ్నిస్తే “నీకు ఆయన కన్నా తెలుసా? ఆయన కన్నా పండితుడివా?” అన్ని విరుచుకొని పడే ” అంధ భక్తులు” ఆ ప్రవచన కర్తల కన్నా ధర్మానికి “ప్రమాదకారులు!”

చమత్కారం, హాస్యం పేరుతో ధార్మిక విషయాలు, సంస్కృతీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తున్నవారిని ప్రశ్నించ వద్దా?

ఇన్ని ప్రశ్నలు నాలో రేగుతూ వుంటాయి. ఈ ప్రశ్నలు “తెలుసుకోవాలి” అనే జిజ్ఞాస నుంచి పుట్టినవి కొన్ని అయితే, సమాజంలో ” పండితులు”గా చలామణీ అవుతున్న వారి ” అహంకారం” చూసి పుట్టినవి. పూర్వుల జ్ఞాన సంపద మీద వున్న నమ్మకం నుంచి పుట్టినవి.

అలా ” నమ్మకం”, ” ప్రశ్న” రెండూ నాలో పెనవేసుకొని పోతున్నాయి.


Leave a comment