” పండితులు అనే వాళ్ళు చదువుకోవాలి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 119

భారతీయ సమాజం మొదటి నుంచీ “వర్ణ” వ్యవస్థతో నడిచింది. ఒకానొక విష ఘడియల్లో ఈ ” వర్ణ వ్యవస్థ” ఇప్పటి ” కుల వ్యవస్థ” గా మారింది.

“పండితుల”ము అని చెప్పుకుంటూ, చేతులకు కంకణాలు , భుజాల మీద కండువాలు ధరించి, శాలువాలు, వాటితో పాటు నగదు సన్మానాలు స్వీకరించి బ్రతికే వాళ్లకు ” చదువు” లేదు!

ఎవడి పని వాడు చేసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు… ” కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలి” అని! ఇలా అనగానే దీనిని కూడా “కులం కళ్ళజోడు” తో చూసే మేధావులు ఉంటారని తెలుసు. వారికి “తెలివిడి” లేదు!

పూర్వకాలంలో మన గ్రామీణ ప్రాంతాలలో అన్ని “వర్ణా”ల వారూ బాబాయ్, అబ్బాయి, మామ, అమ్మాయి, అల్లుడు, పిన్ని, అత్త, కోడలు వంటి “వరస”లతో పిలుచుకొనే వారు. ఆ పరిస్థితి నుంచి ఒకరినొకరు ద్వేషించుకునే వరకూ, కత్తులతో నరుక్కునే వరకూ వచ్చింది.

ఈ పరిణామం ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? వంటి ” తెలివిడి” లేని “పండిత శబ్దవాచ్యులు” సభలలో మైకుల ముందు అవాకులు చవాకులు మాట్లాడుతూ ” నా జాతే చేసింది! నా వాళ్ళే చేశారు! నా గ్రంథాలే చేశాయి!” అంటూ ఒకవంక జాతిని, గ్రంథాలను కించపరచటం మాత్రమే కాక, ఇతరుల చేతికి ఆయుధాలు అందిస్తున్నారు.

నిజమే! స్త్రీలను హింసిస్తున్నారు, కొడుతున్నారు, నిందిస్తున్నారు. “ప్రతి గ్రంథం, ప్రతి శ్లోకం, ప్రతి పద్యంలో స్త్రీని నమ్మవద్దని చెప్పారు!” అని మరొక “వాక్యా”న్నిప్రకటించాడు ఆ పండితుడు!

ఏ గ్రంథంలో ఉంది స్త్రీని హింసించమని! ఏ గ్రంథంలో ఉంది స్త్రీని నిందించమని? ఏ గ్రంథంలో ఉంది స్త్రీని ” జుట్టు పట్టుకొని” కొట్టమని? అడగరేమి?

అదీ నిజమే! “స్త్రీని నమ్మవద్దు” అని కొన్ని గ్రంథాలలో ఉన్న మాట నిజమే! ఆ గ్రంథ సందర్భం ఏమిటి? ఎవరు ఎవరికి ఆ మాట చెప్పారు? ఇదేమీ చెప్పకుండా ” ప్రతి గ్రంథంలో, ప్రతి శ్లోకంలో, ప్రతి పద్యంలో స్త్రీని నమ్మవద్దని ఉంది” అని ఒక స్వీపింగ్ రిమార్క్ వదిలేస్తే?

ఇలాటి “పండిత శబ్దవాచ్యుల”కు వేరే ఏదో ఎజెండా ఉండి వుండాలని నా అనుమానం… కాదు నమ్మకం.

“స్త్రీని నమ్మవద్దు” అన్నది ఒకప్పటి రాజనీతి శాస్త్ర గ్రంథాలలో మాట. అది ” సార్వజనీన బోధ” కానే కాదు. ఒక రాజు లేదా రాజకుమారుడు స్త్రీని నమ్మి దాసుడైపోతే? రాజ్య రహస్యాలు బయటకు పోతే? ఆ సందర్భంలో చెప్పిన మాటను పట్టుకొచ్చి అది సమాజంలో అందరికీ చెప్పిన మాటగా చిత్రిస్తూ మన సంస్కృతి మొత్తం ” స్త్రీ హింసా పరాయణం” అని ప్రకటించే పండితుల ” దాసానుదాస శ్రోతలు” ఉన్నంత కాలం ఈ” అరాచకం” కొనసాగుతూనే ఉంటుంది.

” ఆవు ఒక పశువు. దాన్ని దేవతను చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏం వస్తుంది? ఆవు ఒంట్లో దేవతలు ఉంటారా? విష్ణుమూర్తి వచ్చి ఆవులో పడుకుంటాడా?” అని మరొక ఆణిముత్యం ప్రసాదించాడు ఆ పండితుడు. వెంటనే ఇతర ధర్మానికి చెందిన మరొక “ప్రవాచకుడు” దానిని అందుకొని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

” ఆవు పశువు” అని వేదర్షికి తెలియదు మరి! ఈ పండితుడు దగ్గర చదువుకొని ఉండకపోవటం వల్ల ” గో సూక్తం” దర్శించాడు ఆ వెర్రిబాగులవాడు!

” ఆవు పశువు” అని వ్యాసుడికి, పరమాత్మ అయిన శ్రీకృష్ణునికి తెలియదు మరి… వారు గో మహాత్మ్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఈ పండితుడు దగ్గర వాళ్ళు ట్యూషన్ చెప్పించుకోలేదు! కనీసం ఈయన ప్రవచనం  వినే ” దౌర్భాగ్యం” మనకి పట్టినట్టు వాళ్ళకి పట్టలేదు!

నిజానికి ” ఆవు చుట్టూ తిరగడం కాదు, గోవును రక్షించుకోవాలి” అని చెప్పటం ఆయన ఉద్దేశ్యం! ఆ విషయాన్ని చెప్పటానికి ఇలాటి “వెకిలి వ్యాఖ్యలు” చేయటంలో మర్మం ఏమిటి? ఆ విషయాన్ని సూటిగా, ఇంకా గౌరవప్రదంగా చెప్పవచ్చు. ” గోవు దేవతా స్వరూపం. ఇప్పుడు దానికి ప్రమాదం వాటిల్లుతోంది. దానికి ప్రదక్షిణలు చేయటం కన్నా దానిని రక్షించుకోవడం ముఖ్యం” అని చెప్పి ఉంటే బాగుండేది కదా? కానీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యల వల్ల ఏం జరిగింది. ” గోవు దేవతా స్వరూపం కాదు, గోవులో దేవతలు ఉండరు, గోవు కేవలం ఇతర పశువులలాగే మరొక పశువు” అని తేల్చారు!వెంటనే మరొక ధర్మానికి చెందిన వ్యక్తి ఏమన్నాడు? ” చూశారా వాళ్ళ పండితుడే చెప్పాడు. ఆవు జస్ట్ ఒక పశువు. కనుక గోమాంస భక్షణ లో ఏ తప్పూ లేదు” అన్నాడు!

ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తెచ్చిన చేటు గమనించారా? గోవును మరింత “ఆధికారికం”గా ప్రమాదంలోకి నెట్టేయలేదూ ఈ పండితుడు?

ఇలాటి వాళ్ళకి ఎక్కడికక్కడ ప్రశ్నించక పోతే?

కనుక చదవాలి! ఎవడు పడితే వాడు మైకుల ముందు చెప్పే వాటిని తలాడిస్తూ ఉంటే ఒకనాటికి ఊపటానికి తలలు మిగలవు!


Leave a comment