స్వీయ అన్వేషణ – 120
బయట ఆకాశానికి ఒక మూల నుంచి మెల్లగా కదులుతూ, క్రమంగా పరుగులు పెడుతూ, అంతటా కమ్మేసుకొన్న నల్లని మబ్బులు, నెమ్మదిగా మొదలైన చిరుజల్లు ముసురుగా మారి, గంటల తరబడి కుంభవృష్టి కురిసి, అంతా వెలిసిపోయి, శుభ్రంగా కడిగేసిన నేల లాగ ఆకాశం!
చిన్నప్పుడు కిటికీ లోపలి చిన్న గట్టు మీద గంటలపాటు కాళ్ళు మడచుకొని, మోకాళ్లకు చేతులు చుట్టేసి, గడ్డం ఆన్చి, తల కొద్దిగా ప్రక్కకు వాల్చి, కూర్చొని చూసిన దృశ్యం! సరిగ్గా అలాగే ఉంది జీవితం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే!
వాన మొదలు కావటానికి ముందు వీచే చల్లని చిరుగాలికి ఆనందంగా తలలూపుతున్న “చింత”చెట్లు… చూస్తూండగానే ప్రభంజనంగా మారిపోయిన గాలికి జటాజూటం విడివడేట్టు ప్రళయ తాండవం చేసే పరమశివుడి వెంట తలలూపుతూ ఉన్మత్తంగా ఊగిపోతున్న ప్రమధ గణాల్లా ఉన్నాయే… సరిగ్గా అలాగే ఉంది జీవితం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే!
చిన్నప్పుడు దార్లపూడి, ఏటికొప్పాక మధ్య మడమల లోతు ఏటిలో దిగి నడుస్తూ ఉంటే ఉన్నట్టుండి ఎక్కడ నుంచో ఉరుకులు పెడుతూ వచ్చి అకస్మాత్తుగా గుండెల వరకూ కమ్మేసిన వరద నీటికి ఊపిరి బిగబట్టి, ఒళ్ళంతా ఈడ్చుకుంటూ దాటి, ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకున్నానే… సరిగ్గా అలాగే ఉంది జీవితం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే!
పొద్దున్న అయిదు గంటలకు మురమళ్ళ రేవు దగ్గర బస్సు పట్టుకోవటానికి మా మేనత్త గారి ఊరినుంచి రాత్రి పదకొండు గంటలకు బయలుదేరి, చీకటిలో, వానలో, ఒకప్రక్క పంట కాలువ, మరొక ప్రక్క గోదారి, మధ్యలో ఉన్న గట్టు మీద నడుస్తూ ఉంటే, పిక్కల లోతుకు బురదలో అడుగు దిగబడి పోతూ, దిగబడిపోయిన అడుగులను పైకి లాక్కుంటూ, చివరికి రేవు చేరుకొని, ఆ గోదారి నీళ్లలో కడుక్కొని “హమ్మయ్య” అనుకున్నానే… సరిగ్గా అలాగే ఉంది జీవితం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే!
వరద హెచ్చరికలతో గోదారి రేవులో పడవలు అన్నీ ఆగిపోతే, రేవుకి పై తట్టున దొంగతనంగా నడుపుతున్న సన్నని వేట పడవ ఎక్కేసి, గోదారి దాటుతూన్నప్పుడు, ఆ వరద నీళ్లలో పడవ ఏటవాలుగా ఒరిగిపోయి వరద నీటిని చీల్చుకొంటూ పోతూ ఉంటే, లోపల పడవ అంచుకి తల ఆన్చి బిగుసుకొనిపోయి కూర్చొని, భుజాల దాకా వ్రేలాడే జుట్టుతో సహా సహస్రారం వరకూ గోదారి నీళ్లలో తడిసిపోతూ, పైనుంచి కురుస్తున్న వాన మొహం మీద ఈడ్చి ఈడ్చి కొరడాలా కొడుతూ ఉంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గోదారి దాటేసి, పడవలో నుంచి ఒక్కసారిగా ఒడ్డు మీదకి దూకేశానే… సరిగ్గా అలాగే ఉంది జీవితం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే!
చిన్నప్పుడు ఏటికొప్పాకలో కోడిగుడ్డు బొమ్మ కొనుక్కుని, దానిని తెరుస్తూ పోతూ ఉంటే, గుడ్డులో నుంచి గుడ్డు, గుడ్డులో నుంచి గుడ్డు వస్తూనే ఉన్నట్టు, ఇవాళ పొరలు పొరలుగా ఏళ్ళకు ఏళ్ళు మనోఫలకం మీద ఆవిష్కరించుకొంటూ పోతూంటే, “ఇన్నేళ్లలో ఏం చేశాం? ఏం సాధించాం? ఏటికేడు వయసు పెరిగిపోతూ ఉంది తప్ప ఏమాత్రం పరిపక్వత వచ్చింది? ఏ రోజుకు ఆ రోజు ” బ్రతుకుతున్నా” తప్ప “జీవించిన” రోజు ఏది?
” ఏవో చదువులు చదివి, ఎన్నో వ్రాతలు వ్రాసి, ఎన్నెన్నో ప్రసంగాలు చేసి చివరికి సాధించినది ఏమిటి?
” చుట్టూ ఉన్న జీవితాలలో మార్పు తీసుకురావటం కాదు సరికదా నా బ్రతుకులో అయినా మార్పు తెచ్చుకో గలిగానా?
” ఇప్పటికీ లోలోపలి అహంకారం ఛావలేదే? దానికి ఆత్మాభిమానం అనే ముసుగు వేసేసి నటించేయటం ఆపలేదే? ఎదుటివాడికి ఏం తెలుసు అనే ఒళ్ళు పొగరు తగ్గలేదే?
” నిజంగా అవసరాలు అంటూ ఏవీ లేకపోయినా, లేని అవసరాలను సృష్టించుకుంటూ పోతూ, వాటిని తీర్చుకోవటానికి పెట్టే పరుగులు ఆపలేదే?
” ఇంత సుదీర్ఘ జీవితంలో ఎంతమంది సత్పురుషుల సాంగత్యం లభించలేదు! ఆ సాంగత్య పరిమళ సారం ఇసుమంతైనా ఈ మనసులోకి ఇంకిందా?
” ఇన్నేళ్ళ నుంచీ అధ్యయనం చేసిన ఇన్ని మహత్తర సంప్రదాయ సాహిత్య గ్రంథాలు నాలో ఏ సంస్కారాన్ని తెచ్చాయి? ఇన్ని ఆధునిక సాహిత్య గ్రంథాలు నాలో ఏ మానవత్వాన్ని వికసింప చేశాయి? ఇన్ని వేదాంత గ్రంథాలు నాలో ఏ వైరాగ్య గంథాన్ని నింపగలిగాయి?
” శరీరమూ, మనసూ రెండూ అదుపు తప్పిపోయి, బ్రతుకును బురదలో పొర్లించేసి, ఆ పంకగర్తం నుంచి బయటపడలేక, కొట్టుమిట్టాడి పోయి, పారిపోవటం తప్ప, పరిష్కారం తెలియక, కనీసం ఆ పరిష్కారం కోసం వెతక్క, ఆ విషవలయం నుంచి విడివడ గలిగానా?
” శ్రీకృష్ణ దర్శనం పొందిన ముత్తాత, మహామంత్ర సిద్ధులు అయిన తాత, చినతాత, భక్తిసారాన్ని ఒంట పట్టించుకొని బ్రతుకుతూ నన్ను పెంచిన మరొక చినతాత… వీళ్ళందరికీ నేను చెల్లించిన కృతజ్ఞత ఏముంది కనుక నా బ్రతుకులో?
” ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్య ప్రపంచంలో ప్రవేశింపచేసిన మా మాష్టారు శరభయ్య గారికి నేను ఏ గురుదక్షిణ ఇవ్వగలిగాను? చివరికి ఆ సాహిత్యాన్నే వదలివేశానే?
” ఇన్ని మలయ మారుతాలూ, ప్రచండ ప్రభంజనాలూ ఈనాటివా?
” సృష్ట్యాదిలో మాత్రం నేను లేనూ? ఉన్నానుగా? జన్మలు జన్మలుగా సాగివస్తున్న ఈ జీవన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు శీర్ణమై పోయాయో? ఎవరెవరు కలిశారో? ఎవరెవరు విడిపోయారో? ఎవరెవరు ఆనాటి నుంచి ఈనాటి వరకూ చేదోడు వాదోడు గానో, లేదూ, కక్షా కార్పణ్యాలతో వెంటాడుతూ, వేటాడుతూ వస్తున్నారో? నాకు తెలుసా? తెలియదే!
” కానీ ఒక్కటి మాత్రం నిశ్చయంగా తెలుసు! ఒక అమృతమూర్తి మాత్రం నా చేయి విడువకుండా పట్టుకొని నడిపిస్తోంది! దారిదీపం పట్టుకొని నా ముందు నడుస్తూనే ఉంది! ‘ మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు నా దగ్గరే ఉండాలి ‘ అంటూ రాబోయే అధ్యాయాలకు కూడా హామీ ఇస్తోంది!
” ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆ వెలుగే తోడు లేకపోతే, తాత ముత్తాతల సాధనాశీర్వాద భూమిక లేకపోతే నేను ఈరోజు ఇలా నిలబడగలిగే వాడినా?
కనుక…
శ్రీ గురురూపమైన ఆ వెలుగుకు వందనం! ఎప్పటికైనా నేను అనే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలిపే ఒక్క కాంతికణం ప్రసాదించదూ ఆ దివ్యజ్యోతి?
అందుకని…
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః! గోత్ర ఋషిభ్యో నమః!
వంశ ఋషిభ్యో నమః!
Leave a comment